దసరా వస్తుందయ్యా… దశనే మరుస్తుందయ్యా…

అభ్యర్థులను వెంటాడుతున్న విజయదశమి

ప్రచారానికి వెల్తే తడిసి మోపెడు అవసరమా..?

నవంబర్ వరకూ ఆగడమే బెటర్

దిశ దశ, హైదరాబాద్:

విజయ దశమి అంటే సంబరాల్లో మునిగి తేలుతారు… విజయ దరహాసం అందుకునేందుకు ఈ పర్వదినం నుండి మంచి కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతుంటారని అనుకుంటుంటాం. కానీ ఈ సారి మాత్రం వారికి ఈ పండగ భయం పట్టుకుందన్న టాక్ నడుస్తోంది. తమ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈ పండగ తరువాతే మొదలు పెడ్తామని అప్పటి వరకు అంటీ ముట్టనట్టుగా వ్యవహరించాలని కొంతమంది అనుకుంటున్నారట. ఇంతకీ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనకున్న కారణమేంటో తెలిస్తే మీరూ ఆశ్చర్యపోక మానరు.

ఎన్నికల సందడి అప్పుడే…

తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయినప్పటికీ చాలా మంది అభ్యర్థులు మాత్రం నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇందుకు ప్రధాన కారణం పితృ పక్షాలు నడుస్తుండడమే అయినా ఈ నెల 14న అమావాస్యతో ముగియనుంది. పితృ తర్పణాలు ఇచ్చే సమయంలో మంచి కార్యక్రమాలు చేపట్టడం సరి కాదని భావించే వారంతా కూడా అమావాస్య తరువాత కార్యరంగంలోకి దూకే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. కానీ అప్పుడు కూడా చాలా మంది అభ్యర్థులు ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అమావాస్య తరువాత వస్తున్న విజయదశమి పర్వదినం అంటే తెలంగాణ పల్లెల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. దేవి నవరాత్రులు పూర్తి అవుతాయి కానీ… ఆ మరునాడే దసరా పండగ వస్తుండడంతో అభ్యర్థులు వెనుకుంజ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణాలో దసరా పండగ అంటే చుక్క, బొక్క కంపల్సరీగా ఉంటుంది. ఊరు వాడ అన్ని చోట్ల కూడా విజయదశమి పర్వదినం రోజుల దావత్ లు చేసుకోవడం సర్వ సాధారణ విషయం. ఆనవాయితీగా వస్తున్న ఈ ఆచారాన్ని పాటించేందుకు మెజార్టీ జనం మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలో దసరా దావత్ ల పేరిట అరేంజ్ మెంట్స్ చేయాల్సి వస్తుందని, దీనివల్ల ఖర్చు తడిసిమోసపెడు అయ్యే ప్రమాదం ఉందని అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. తమ తమ ప్రాంతాల్లోకి వెల్లి అదనపు ఖర్చులు వెచ్చించి జేబు గుల్ల చేసుకోవడం అవసరమా అని అనుకుంటున్న ఆశావాహులు, అభ్యర్థులు నియోజకవర్గాల జనానికి అందుబాటులో లేకుండా ఉండడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా సమాచారం. వందలాది గ్రామాల్లోని సంఘాలకు అవసరమైనవన్ని ఏర్పాట్లు చేయడం అంటే రూ. కోట్లతో కూడుకున్న పని అని లెక్కలు వేసుకుంటున్న వారంతా కూడా టచ్ మి నాట్ అన్నట్టుగా ఉండేందుకే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అభ్యర్థుల ఎత్తులను గమనించి కొంతమంది ముందస్తుగానే దసరా దావత్ ల కోసం అవసరమైనవన్ని సమకూర్చుకోవాలని కూడా ఆలోచిస్తున్నారట. దసరా సరదా తీరే వరకూ జాగ్రత్తగా ఉంటే మంచిందని కొంతమంది అభ్యర్థులు భావిస్తుంటే మరికొంతమంది అటుగా వెల్లి చిక్కుల్లో ఇరుక్కపోవడం అవసరమా అని అనుకుంటున్నారట. ఏది ఏమైనా విజయ దశమి పర్వదినం మాత్రం ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు ఆర్థిక భారం భయాన్ని తీసుకొచ్చిందన్నది నిజం.

You cannot copy content of this page