అనుమానం రాకుండా స్కెచ్ వేసిన కోడలు
చివరకు కటకటాల పాలైన నిందితురాళ్లు
దిశ దశ, దండకారణ్యం:
మెట్టినింటి వారిని హతం చేసేందుకు ఓ కోడలు చేసిన ఘనకార్యం దేశ వ్యాప్తంగా సంచలనం కల్గిస్తోంది. ఓ అడవు ఖిల్లా ఆదివాసి జిల్లాలో ఈ నేరం వెలుగులోకి రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కసి, ద్వేషంతో రగిలిపోతున్న కోడలు చేసిన వరస హత్యలు… అవి జరిగిన తీరు తెలిస్తే ఒళ్లు జలదరించకమానదు. మెట్టినింటి వారు చనిపోతుంటే పైశాచిక ఆనందం పొందిన కోడలు చేసిన ఘనకార్యం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ షాకుకు గురయ్యారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరీ తాలుకా మౌజా మహాగావ్ లో జరిగింది ఈ ఘటన.
వరస మరణాలతో…
మౌజా మహాగావ్ కు చెందిన శంకర్ కుంభారే కుటుంబంలో 20 రోజుల్లో ఐదుగురు అనారోగ్యానికి గురై మృత్యువాత పడ్డారు. సెప్టెంబర్ 20న శంకర్ కుంభారే, అతని భార్య విజయ కుంభారేలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీరికి అహేరిలో ప్రాథిమిక చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో చంద్రపూర్ జిల్లా కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ వీరిద్దరి ఆరోగ్యం బాగు కాకపోవడంతో మరింత మెరుగైన వైద్యం అందించేందుకు నాగపూర్ తీసుకెళ్లారు. ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. దీంతో సెప్టెంబర్ 26న శంకర్ కుంభార్ చనిపోగా, 27న అతని భార్య విజయ కుంభార్ మృత్యువు ఒడిలోకి చేరిపోయింది. ఒకే సారి తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబంలో విషాదం అలుముకుంది. ఇంటి పెద్దలు ఇద్దరూ చనిపోయిన షాకు నుండి తేరుకుంటున్న క్రమంలో ఆ కుటుంబ సభ్యులకు మరో ఆందోళనకరమైన సమాచారం అందింది. గడహేరిలో నివసం ఉంటున్న శంకర్ కుభారే కుమార్తే కోమల్ దహగాంకార్, ఆయన కొడుక కొడుకు రోషన్ కుంభారే, ఆనంద అలియాస్ వర్ష ఉరాడేల ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో ఆసుపత్రికి తరలించినట్టుగా వారికి సమాచారం అందించి. వీరికి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోగా కోమల్ దహగాంకర్ అక్టోబర్ 8న, ఆనంద అలియాస్ వర్ష ఉరాడే 14న, రోషన్ కుంభారే 15న చనిపోయారు. ఉద్యోగరిత్యా ఢిల్లీలో నివాసం ఉంటున్న శంకర్ కుంభారే పెద్ద కుమారుడు సాగర్ కుంభారే తన కుటుంబ సభ్యుల గురించి సమాచారం అందుకుని అహేరీ చేరుకున్నాడు. ఈ క్రమంలో తనతల్లిదండ్రులను ఆసుపత్రికి తరలించిన కారు డ్రైవర్ రాకేష్ ఆరోగ్యం కూడా క్షీణించడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలుసుకున్నాడు. అలాగే శంకర్ కుంభార్ దంపతులకు సపరిచర్యలు చేసేందుకు వచ్చిన అతని అల్లుడు, మరోకరు కూడా అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అందరికి ఒకే రకమైన డిసీజ్
వరసగా చనిపోయిన ఐదుగురు, అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతున్న ముగ్గురు కూడా ఒకే రకమైన వ్యాధితో బాధ పడ్డారు. వీరికి అవయవాల్లో జలదరింపు, నడుము, తలలో తీవ్రమైన నొప్పి, పెదవులు నలుపు రంగులోకి మారడం, నాలుక లావు కావడం వంటి లక్షణాలు కనిపించాయని వైద్యులు తెలిపారు. ఇలాంటి లక్షణాల బారిన పడడం అంటే విషం వారి శరీరాల్లోకి చొచ్చుకపోయి ఉంటుందని వైద్యులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే వరస మరణాలపై అనుమానించిన గడ్చిరోలి జిల్లా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసే పనిలో నిమగ్నం అయ్యారు. జిల్లా ఎస్పీ నీలోత్పాల్ ఈ కేసులు అన్ని కోణాల్లో విచారించాలని అహేరీ ఏఎస్పీ యతీష్ దేశ్ ముఖ్, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సుదర్శన్ రాథోడ్, ఇన్స్ పెక్టర్ మనోజ్ కల్పండే, గడ్చిరోలి క్రైం బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ ఉల్హాస్ భూసారిలను ఆదేశించారు. మొత్తం నాలుగు పోలీసు బృందాలు రంగంలోకి దిగి శంకర్ కుంభారే ఇంటితో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా వేశారు. ఈ కేసును డిటెక్ట్ చేసేందుకు అహేరీ పోలీసులు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసి అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ కుటుంబంలో వరస మరణాలు జరగలేదని, అవన్ని హత్యేలేనని తేల్చిన పోలీసులు ఆ ఇంటి కోడలు సంఘ మిత్ర కుంభారేపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీంతో కొన్ని క్లూస్ లభ్యం కావడంతో సంఘమిత్రను అదుపులోకి తీసుకుని విచారించగా ఆ హత్యలకు కారణం తానేనని, తన తల్లి సహకారం కూడా ఉందని పోలీసుల ముందు ఒప్పుకుంది.
ఆదర్శ వివాహం చేసుకుని…
అయితే సంఘమిత్ర ఆమె భర్త రోషన్ కుంభారేను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకోని మరనింణించాడు. ఆ తరువాత ఆమె భర్త రోషన్ కుంభారే, అత్తా మామలు తరుచూ సూటిపోటి మాటలతో వేధించేవారు. వ్యవసాయ బావి వద్ద కూడా తన పుట్టినింటి వారితో కూడా తరుచూ కుటుంబంతో గొడవలు జరుగుతుండేవి. దీంతో మెట్టినింటి వారిని ఎలాగైనా చంపాలని భావించిన సంఘమిత్ర విషం ఇచ్చి హత్య చేయాలని స్కెచ్ వేసింది. ఇందుకు రోజా రామ్ టేకే సహాకారం తీసుకుని విషం తెప్పించి చంపింది.
తెలంగాణ విషం…
సంఘమిత్రకు సహకరించిన రోజా రామ్ టేకే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మరీ విషం కొనుగోలు చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ విషాన్ని శంకర్ కుంభారే కుటుంబ సభ్యులకు ఆహారం, నీళ్లలో కొంచెం కొంచెం కలిపి ఇస్తూ వారు క్రమక్రమంగా అనారోగ్యం బారిన పడేవిధంగా స్కెచ్ వేశారు. వీరు అనుకున్నట్టుగా శంకర్ కుంభారే కుటుంబంలో ఐదుగురు మరణించారు. అయితే వరస మరణాలు చోటు చేసుకోవడం గ్రామంలో కూడా భయానక వాతావరణం నెలకొనడంతో ఈ విషయం కాస్తా అహేరీ పోలీసుల వరకు చేరింది. మరో వైపున ఢిల్లీలో ఉంటున్న శంకర్ కుంభారే పెద్ద కుమారుడు సాగర్ కుంభారేకు కూడా అనుమానం వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని కారు డ్రైవర్ రాకేష్ కూడా శంకర్ కుంభారే కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో వారివద్ద ఉన్న నీళ్లు తాగడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. ఈ కేసులో నిందితులు ఇద్దరు సంఘమిత్ర, రోజా రామ్ టేకేలను అరెస్ట్ చేసిన అహేరీ పోలీసులు వారిపై ఐపీసీ సెక్షన్ 320, 307, 328, 120(బి), 34లలో కేసు నమోదు చేశారు. అయితే ఈ హత్యలకు వెనక ఇంకా కుట్రదారులు ఎవరైనా ఉండి ఉండవచ్చని అనుమానిస్తున్న గడ్చిరోలీ ఎస్పీ నిలోత్పాల్ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. దీంతో ఈ కేసును మరిన్ని కోణాల్లో విచారించేందుకు అహేరీ సబ్ డివిజన్ పోలీసులు సమాయత్తం అయ్యారు.