బీజేపీలో అంతర్మథనం…
దిశ దశ, కరీంనగర్:
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాలకు పదును పెట్టాల్సిన భారతీయ జనతా పార్టీ నిస్తేజంగా మారిందా..? నాయకుల కేంద్రీకృతంగానే సమీకరణాలు జరుగుతున్నాయి తప్ప క్షేత్ర స్థాయిలో సమీకరణాలు చేయడంలో విఫలం అవుతున్నారా..? వ్యాపారాల్లో స్థిరపడ్డ అభ్యర్థులకు అవకాశం ఇవ్వడం వల్ల ఆ పార్టీ ప్రతికూలతను ఎదుర్కొంటోందా..? అంటే అవుననే సమాధానలే వినిపిస్తున్నాయి పార్టీ శ్రేణుల్లో. ఓ వైపున ఢిల్లీ విజయం… మరో వైపున పార్టీపై యువతలో పెరిగిన క్రేజీని అనుకూలంగా మల్చుకోవడంలో విఫలం అవుతున్నట్టుగా ఉందన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది.
ఇలా ఎలా..?
పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్న ఇద్దరు బీజేపీ అభ్యర్థుల తీరుపై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. అర్బన్, రూరల్ ఏరియాల్లోని క్యాడర్ లో ఒకింత నైరాశ్యమే నెలకొందనే చెప్పాలి. బీసీ కార్డు కూడా లాభిస్తుందన్న వ్యూహంతో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమురయ్యకు అవకాశం ఇచ్చింది పార్టీ అధిష్టానం. అయితే మొదట్లో కొమురయ్య గెలుపు ఖాయం అన్న ప్రచారం ఊపందుకోవడంతో ధీమా పెరిగిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో అన్ని వర్గాల టీచర్లను సమీకరించే విషయాన్ని విస్మరిస్తున్నట్టుగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెద్దపల్లికి చెందిన మల్క కొమురయ్య విద్యా సంస్థలతో పాటు పలు వ్యాపారల్లో స్థిరపడ్డారు. కొంత కాలంగా హైదరాబాద్ నగరంలోనే జీవనం సాగిస్తున్న ఆయన స్థానికుడేనన్న నినాదం వినిపించే ప్రయత్నం చేసినప్పటికీ ఇక్కడి క్యాడర్ తో సంబంధాలు లేకపోవడం మైనస్ అవుతున్నట్టుగా ఉంది. మెజార్టీ టీచర్లు మల్క కొమురయ్యకు అనుకూలంగా ఉన్నారని జరుగుతున్న ప్రచారానికి గ్రౌండ్ రియాల్టిలో ఉన్న తీరుకు చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా కనిపిస్తోంది. టీచర్లను ప్రభావితం చేయగలిగే వివిధ సంఘాల నాయకులను అనుకూలంగా మల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ప్రైవేటు టీచర్ల ఓట్లు కేవలం 4 వేల వరకే ఉండగా 25 వేలకు పైగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ గెలుపు ఓటములను శాసించేది ఖచ్చితంగా ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారే. ప్రైవేటు రంగంలోని టీచర్లపై స్కూల్స్ యాజమాన్యాలు, సంఘాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధాన దృష్టి అంతా కూడా ప్రభుత్వ, ఎయిడెడ్ ఉపాధ్యాయులపై సారించి ప్రచార పర్వం కొనసాగించాల్సి ఉంటుంది. కానీ ఇందుకు భిన్నంగా ప్రచారం కొనసాగుతున్న తీరే పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. మరో వైపున కొన్ని జిల్లాల్లో ప్రభావితం చేయగలిగే సత్తా ఉన్న ముఖ్య నేతలను కూడా విస్మరిస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కొమురయ్య కుటుంబ సభ్యులే సమీకరణాలు చేస్తుండడం కూడా పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారినట్టుగా తెలుస్తోంది. ఓ స్థాయి నాయకులు కూడా కొమురయ్య కుటుంబ సభ్యులకు కాల్ చేసి మాట్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్న తీరుపై కినుక ప్రదర్శిస్తున్న సందర్బాలు కూడా ఉన్నట్టుగా సమాచారం.
ఇప్పుడే ఇలా…
మరో వైపున పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తీరుపై కూడా పార్టీలో సుదీర్ఘమైన చర్చ సాగుతోంది. పార్టీ నేతలతో ప్రచార పర్వం కొనసాగిస్తూ, మీడియా సమావేశాలు పెడుతున్నప్పటికీ అంతర్గతంగా జరుగుతున్న తతంగం వేరే విధంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి పార్టీ శ్రేణులను కలుపుకపోతూ నియోజకవర్గాల వారిగా సమీకరణాలు చేస్తుంటూ అంజిరెడ్డి మాత్రం మొక్కుబడి చర్యలతోనే సరిపెడుతున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన కుటుంబ సభ్యుల కనుసన్నల్లోనే అన్ని సమీకరణాలు నెరిపుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ప్రాపకం చేసుకోవలన్న పరిస్థితి తయారు కావడం పార్టీ వర్గాలకు మింగుడుపడకుండా పోతోంది. ప్రచార వ్యూహాల విషయం కూడా అంజిరెడ్డి కుటుంబ సభ్యులతో చర్చించిన తరువాతే ముందుకు సాగాలన్న పరిస్థితి తయారు కావడం సరికాదని అంటున్న మార్పు రావడం లేదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ప్రచారంలో అన్ని వర్గాలను కలుపుకపోతూ ముందుకు సాగాల్సి ఉంటుందని అలాంటిది ఇప్పుడే ఆయన కుటుంబ సభ్యుల ఆదిపత్యం ఉన్నట్టయితే గెలిచిన తరువాత కూడా ఇదే పరిస్థితి రిపిట్ అవుతుందన్న అనుమానం కూడా పార్టీ వర్గాలను వెంటాడుతోంది. దీంతో పార్టీ క్యాడర్ కూడా అంజిరెడ్డి ప్రచారం విషయంలో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పోలింగ్ తేది సమీపిస్తున్నా కూడా పార్టీ అభ్యర్థుల్లో మాత్రం మార్పు రావడం లేదన్న చర్చ తీవ్రంగా సాగుతోంది. ఇద్దరు అభ్యర్థుల తీరులో మార్పు తీసుకొచ్చేందుకు పార్టీ ముఖ్య నేతలు చొరవ తీసుకోవల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.