దిశ దశ, అనంతపురం:
నవమాసాలు మోసి కన్న ఆ తల్లిని విధి వంచించింది. కేవలం నవ మాసాలు నిండిన ఆ బిడ్డను మృత్యువు కబళించింది. పండంటి బిడ్డ కోసం ఏడేళ్ల పాటు తల్లడిల్లిపోయిన ఆ తల్లిదండ్రుల కోర్కె ఎట్టకేలకు తీరినా… నవ మాసాలు నిండిన ఆ బిడ్డ ఊపిరి ఆగిన తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. అప్పటి వరకు బోసి నవ్వుతో ఇల్లంతా కలియ తిరుగుతున్న ఆ పసి బిడ్డ విగత జీవిగా మారిపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఏపీలోని అనంతపురం జిల్లా పెద్ద వడుగూరు మండలం మల్లేనిపల్లిలో జరిగిన ఈ విషాద ఘటన వివరాల్లోకి వెల్తే… గ్రామానికి చెందని గోవింద రాజులు, దీపల కూతురు తొమ్మిది నెలల జస్విత ఇంట్లో ఆడుకుంటుండగా నిమ్మకాయ దొరకడంతో దానిని నోట్లో పెట్టుకుంది. నిమ్మకాయ చిన్నారి ఊపిరిని ఆడకుండా చేసింది. చిన్నారి జస్వితను గమనించిన గోవింద రాజులు కుటుంబ సభ్యులు గొంతు నుండి నిమ్మకాయను బయటకు తీసేందుకు శత విధాల ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే మండల కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి నిమ్మకాయను బయటకు తీసే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. అక్కడి నుండి 108లో అనంతపురం జిల్లా కేంద్రానికి తరలిస్తున్న క్రమంలో పామిడి వద్ద మరో ప్రైవేటు డాక్టర్ ను ఆశ్రయించారు. అయితే జస్వితను పరీక్షించిన వైద్యుడు ఆమె శ్వాస ఆగిపోయిందని చెప్పడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చిన్నారి కానరాని లోకాలకు చేరిపోయిందని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆసుపత్రి ఆవరణలో ఆ కుటుంబ సభ్యుల రోధనలు మిన్నటిపోయాయి.
ఏడేళ్ల నిరీక్షణ తరువాత…
గోవింద రాజులు, దీప దంపతులు సంతానం కోసం ఏడేళ్ల పాటు నిరక్షించాల్సి వచ్చింది. పండంటి బిడ్డను కనేందుకు ఆ దంపతులు ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. చివరకు దీప గర్భం దాల్చడం… ఓ కూతురుకు జన్మనివ్వడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. లేక లేక కల్గిన సంతానం కావడంతో జస్వితను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే మృత్యువు మాత్రం జస్వితను నిమ్మకాయ రూపంలో తీసుకెళ్లిన తీరు ప్రతి ఒక్కరిని భాదించింది. పండంటి బిడ్డను 9 నెలలు నిండక ముందే మృత్యువు కబళించుకపోయిన తీరు స్థానికంగా విషాదాన్ని నింపింది.