దిశ దశ, పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లాలో పరిధిలోని మానేరు నదిలో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. ఈతకని వెల్లి వీరు మృత్యువు ఒడిలో చేరిపోయారు. వీరిని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగులకు చెందిన వారిగా గుర్తించారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… తనగులకు చెందిన కావ్య (13), నిత్య (14)లు వీణవంక మండలం కొండపాకలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. బుధవారం వీరు ఈతకని కొండపాక, పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి సమీపంలోని మానేరు నదిలోని చెక్ డ్యాం సమీపంలో నీటిలో దిగి గల్లంతయ్యారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగానే పోలీసులతో పాటు ఫైర్ డిపార్ట్ మెంట్ బృందాలు మానేరు నదిలో గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఇద్దరు చిన్నారులు కూడా నీటి గుంతలో చిక్కుకుని మృత్యువాత పడడం స్థానికులను కలిచి వేసింది.
నెల రోజుల క్రితం కూడా…
నెల రోజుల క్రితం కూడా పొత్కపల్లి గ్రామానికి చుట్టపు చూపుగా వచ్చిన మరో యువకుడు కూడా ఇదే ప్రాంతంలో నీటి గుంటలో చిక్కుకుని చనిపోగా అతనిది కూడా తనుగుల గ్రామమేనని తెలుస్తోంది. తాజాగా ఇక్కడే ఇద్దరు చిన్నారులు నీటి గంతలో చిక్కుకుని ప్రాణాలో కోల్పోవడం స్థానికులను విషాదంలోకి నెట్టేసింది.
కారణం అదేనా..?
వేసవి కాలంలో సాధారణ ప్రవాహంతో ఉండే మానేరు నదిలో తరుచూ మరణ మృందంగం వినిపించడానికి కారణం ఇసుక తవ్వకాలేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిభందనల ప్రకారం ఇసుక తవ్వకపోవడంతో భారీగా ఏర్పడిన గుంతల్లో నీరు చేరిన విషయం గమనించని వారు ఈతకని వెల్లి వాటిలో చిక్కుకుని చనిపోతున్నారని స్థానికులు అంటున్నారు. టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న మైనింగ్ లోతుగా తవ్వకాలు జరపడం వల్లే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మానేరు నదిలో అడగడుగునా ఇసుక రీచులకు టీఎస్ఎండీసీ అనుమతి ఇవ్వడంతో ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో భారీ సైజులో ఏర్పడిన గుంతల్లో నీరు చేరడం అప్పటి వరకు సాఫిగా నడుచుకుంటూ వెల్తున్న వారు అందులో చిక్కుకుని మరణిస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఇసుక తవ్వకాల్లో నిభందనలు పాటించకపోవడం వల్లే నిండు నూరేళ్లు జీవించాల్సిన వారు విగత జీవులుగా మారిపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వరస మరణాలను గమనించైనా టీఎస్ఎండీసీ అధికారులు మానేరు నదిలో ఇసుక తవ్వకాల విషయంలో నిభందనలు అమలు చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తుందో లేదో చూడాలి మరి.
ఈటల దిగ్భ్రాంతి
తనుగులకు చెందిన ఇద్దరు చిన్నారులు మానేరు నది నీటి గుంతలో పడి దుర్మరణం చెందడం పట్ల మాజీ మంత్రి ఈటల రాజేందర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.
Disha Dasha
1884 posts
Next Post