కారుణ్య నియామాకలపై అసెంబ్లీలో చర్చించండి

రఘునందన్ రావుకు బాధితుల వినతి

దిశ దశ, హైదరాబాద్:

జిల్లా పరిషత్, పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలను వెంటనే భర్తీ చేయడం లేదని దీంతో ఉద్యోగాల కోసం ఆయా కుటుంబాలకు చెందిన వారు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును కోరారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 61 కారుణ్య నియామకాలకు సంబంధించిన ఖాళీలు ఉన్నా వాటిని భర్తీ చేయడం లేదని, 2014 నుండి ఎదురు చూస్తున్నా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు భేతి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బాధితులు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును కోరారు. న్యాయ బద్దంగా రావాల్సిన కారుణ్య నియామకాలను కూడా భర్తీ చేయకపోవడం దారుణమన్నారు. ఈ సమస్యను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తి పరిష్కారం కోసం కృషి చేయాలని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ నెం: 79 ద్వారా 1266 పోస్టులు మంజూరు చేసినప్పటికీ ఈ జీఓ పంచాయతీరాజ్ శాఖకు వర్తించదని చెప్తుండడంతో బాధితులు మానసికంగా కుంగిపోతున్నారని భేతి మహేందర్ రెడ్డి అన్నారు. సూపర్ న్యూమరరీ విధానం ద్వారా ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేసి కారుణ్య నియామకాల ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాలు చేపట్టకుండా వీఆర్ఓ, వీఆర్ఏలను లోకల్ బాడీస్ పరిధిలోకి తీసుకరావడం వల్ల బాధితులు అన్యాయానికి గురవుతున్నారని వివరించారు. బాధిత కుటుంబాల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కారుణ్య నియామకాల గురించి అసెంబ్లీలో ప్రస్తావించాలని రఘునందన్ రావుకు వినతి చేశారు.

You cannot copy content of this page