దిశ దశ, జగిత్యాల:
రాష్ట ఆవిర్బావ దినోత్సవ వేడుకల్లో పెను ప్రమాదం తప్పింది. మరి కొద్ది క్షణాలు అక్కడే ఉన్నట్టయితే ఆ అధికారి ఆసుపత్రి పాలయ్యేవారు. జగిత్యాల జిల్లా బీర్పుర్ ఎంపీడీఓ కార్యాలయంలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… శుక్రవారం బీర్పుర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పతాకావిష్కరణ చేసేందుకు ఎంపీడీఓ మల్లారెడ్డి తన కార్యాలయం నుండి బయటకు వచ్చారు. ఆయన అలా బయటకు వెల్లారో లేదో మరు క్షణమే ఆఫీసు బిల్డింగ్ ఆర్సీసీ రూఫ్ లో కొంత భాగం కుప్పకూలి పడిపోయింది. ఎంపీడీఓ తన కార్యాలయం నుండి బయటకు వెళ్లడం ఏ మాత్రం ఆలస్యం అయినా ఆయన రూఫ్ భాగం నుండి పడిపోయిన శకలాల కింద చిక్కుకపోయే వారు. కానీ అదృష్టవశాత్తు ఆయన కొద్ది క్షణాల ముందే బయటకు వెళ్లడంతో సేఫ్ గా ఉన్నారు. అయితే బీర్పుర్ మండల పరిషత్ కార్యాలయ భవనం శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నదని స్థానికులు అంటున్నారు. ఇలాంటి భవనంలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
