రిజిస్ట్రేషన్ కార్యాలయాల వికేంద్రీకరణ

కొత్త కార్యాలయల ఏర్పాటుకు నిర్ణయం

దశ దిశ, హైదరాబాద్:

రాష్ట్రంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలోని కొన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయల పరిధిలో వికేంద్రీకరణ జరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ జీఓ విడుదల చేసింది. పెద్దపల్లి జిల్లా రామగుడం ప్రాంతాన్ని పెద్దపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండి విడదీసి కొత్తగా రామగుండంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ సబ్ రిజిస్టార్ కార్యాలయం పరిధిలో రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలను చేర్చారు. ఇంతకాలం పెద్దపల్లి కేంద్రంగా రిజిస్ట్రేషన్ కార్యాలయ సేవలు అందడం వల్ల రామగండం పారిశ్రామిక ప్రాంతంలోని భూముల క్రయవిక్రయాలకు సంబందించిన లావాదేవీలు జరపాలంటే పెద్దపల్లికి వెల్లాల్సి ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి సపరేట్ గా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయడంతో ఇక నుండి స్థానికంగానే రిజిస్ట్రేషన్ లు నిర్వహించుకునే అవకాశం ఉండనుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ (ఫైల్ ఫోటో)

దశాబ్దాల కల…

రాష్ట్రంలో రెండో పారిశ్రామిక ప్రాంతంగా భాసిల్లుతున్న రామగుడం ఏరియాలో ప్రత్యేకంగా భూ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ఆఫీసు లేకపోవడం ఇబ్బందికరంగా ఉండేదనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు పెద్దపల్లి, మంథని కేంద్రాలుగా ఈ విభాగం సేవలందిస్తూ ఉండేది. దీనివల్ల రామగుండం ప్రాంతానికి చెందిన వారు పెద్దపల్లిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో క్రయ విక్రయాలకు సంబంధించిన దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేయించుకోవల్సి ఉంది. చాలా కాలంగా రామగుండంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేస్తే బావుంటుందన్న ప్రతిపాదనలు వెల్లినప్పటికీ కార్య రూపం దాల్చలేదు. రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు ఏవో కారణాలు చూపుతూ ఇంతకాలం హోల్డ్ లో పెట్టడంతో తమ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వినతి పత్రం అందజేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం కావడంతో ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో భూ క్రయవిక్రయాలు ఊపందుకున్నాయని, అయితే రామగుండం ప్రాంత వాసులు అల్లంత దూరంలో ఉన్న పెద్దపల్లికి వెల్లి రావడం ఇబ్బందికరంగా మారిందని సీఎంకు వివరించారు. పారిశ్రామిక ప్రాంతం కూడా కావడంతో ఇక్కడకు వచ్చి స్థిరపడే వారు ఎక్కువ మంది ఉంటారన్నారు. దీంతో సొంత స్థలాల క్రయవిక్రయాలు జరపడం ఎక్కువ సంఖ్యలో సాగుతున్నందున రామగుండం పారిశ్రామిక ప్రాంత వాసులకు రిజిస్ట్రేషన్ శాఖ సేవలు అందించినట్టయితే అన్ని విధాలా బావుంటుందని చందర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రామగుండంలో ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. దీంతో రామగుండం నియోజకవర్గ వాసులు పెద్దపల్లికి వెల్లాల్సిన పని లేకుండా పోయిందని ఇక నుండి సమీపంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఏర్పడనుందని కోరుకంటి చందర్ వివరించారు. రామగుండం వాసుల ఇక్కట్లను తొలగించేందుకు కొత్త సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు చందర్ ధన్యవాదాలు తెలిపారు.

You cannot copy content of this page