దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పీజీ కాలేజీలను నిరవధికంగా మూసివేయాలని ఆయా యూనివర్శిటీ పరిధిలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత యూనివర్శిటీలకు సమాచారం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దసరా సెలవుల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సెలవులను యథావిధిగా కంటిన్యూ చేస్తూ డిగ్రీ, పీజీ కాలేజీలను మూసివేసి ఉంచనున్నట్టు సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో సుమారు 1200 వరకు డిగ్రీ, పీజీ కాలేజీలు ఉండగా, గత రెండేళ్లుగా రూ. 1500 నుండి 2 వేల కోట్ల వరకు ఫీజు రియంబర్స్ మెంట్ బకాయి ఉందని దీంతో తమపై పడుతున్న ఆర్థిక భారాన్ని తట్టుకునే స్థితిలో లేనందున విద్యార్థులకు చదువు చెప్పే పరిస్థితి లేదని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు అంటున్నాయి. అయితే ఇంజనీరింగ్ కాలేజీలతో కలిపి ఫీజు రియంబర్స్ మెంట్ 6 నుండి 8వేల కోట్లకు పైగా బకాయి ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోందని, దీనివల్ల డిగ్రీ, పీజీ కాలేజీలు నష్ట పోతున్నాయని అంటున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్ మెంట్ తో పాటు అదనంగా ఫీజులు వసూలు చేస్తుంటాయని, దీంతో వాటిపై ఆర్థిక భారం అంతగా పడే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం ఫీజు రియంబర్స్ మెంట్ పై ఆధారపడి విద్యాబోదన అందిస్తున్న డిగ్రీ, పీజీ కాలేజీలపై ఆర్థిక భారం తీవ్రంగా పడుతున్నందున ముందుకు వెల్లే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకున్నా అప్పులు తీసుకొచ్చి కాలేజీలను నిర్వహిస్తున్నాని చెప్తున్నారు. తమకు తలకు మించిన భారంగా మారినందున కళాశాలలను తిరిగి తెరిచే పరిస్థితి లేకుండా పోయిందని ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం అంటోంది.
శాతవాహన పరిధిలో…
కరీంనగర్ శాతవాహన యూనివర్శిటీ పరిధిలో కూడా డిగ్రీ కాలేజీలు నిరవధికంగా మూసివేయనున్నారు. విద్యార్థులకు చదువులు చెప్పేందుకు సుముఖంగా లేమని యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కాలేజీలు నిర్వహించే పరిస్థితిలో లేమని యాజమాన్యాలు అంటున్నాయి. శాతవాహన యూనివర్శిటీ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్ మెంట్ అసోసియేషన్ (SUPMA) డిగ్రీ, పీజీ కాలేజీలను నిరవధికంగా మూసి వేస్తున్నట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. దసరా సెలవులు ముగిసిన తరువాత కూడా యథావిధిగా కాలేజీలను క్లోజ్ చేసి ఉంచాలని, తరగతులు నిర్వహించకూడదని నిర్ణయించుకున్నట్టు పేర్కొంది. సంఘం అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీపాద నరేష్ లు విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎస్ యూ పరిధిలోని డిగ్రీ, పీజీ కాలేజీలను నిరవధికంగా మూసివేస్తున్నామన్న విషయాన్ని యూనివర్శిటీకి కూడా తెలియజేస్తామని వెల్లడించారు. ఎస్ యూ పరిధిలో 60కి పైగా ఉన్న కాలేజీలకు రూ. 120 కోట్ల మేర ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
విద్యార్థుల భవిషత్తు..?
తెలంగాణ వ్యాప్తంగా కూడా డిగ్రీ, పీజీ కాలేజీలను మూసివేయాలని సంఘం ప్రతినిధులు నిర్ణయించడం సంచలనంగా మారింది. ప్రైవేటు విద్యా సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం పడనుంది. లక్షలాది మంది విద్యార్థులు అర్థాంతరంగా చదువులకు దూరం కావల్సిన దుస్థితి ఎదురు కానుంది. ప్రైవేటు కాలేజీల యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వల్ల స్టూడెంట్స్ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో నేటి తరం విద్యార్థులు భవిష్యత్తు అంధకారంగా మారనుంది.