దిశ దశ, భూపాలపల్లి:
మేడిగడ్డ బ్యారేజ్ లోతుపాతులు వెలికితీయడానికి విజిలెన్స్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే రికార్డులను సేకరించిన అధికారులు వాటిని పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కో అంశం వెలుగులోకి వస్తోంది. అర్భాటంలో చూపిన పారదర్శకత నిర్మాణ విషయంలో ఏ మాత్రం లేదని ప్రాథమికంగా తేటతెల్లం అయినట్టుగా తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో పరిశీలించిన విజిలెన్స్ డైరక్టర్ జనరల్ రాజీవ్ రతన్ కూడా షాకింగ్ విషయాలను గుర్తించినట్టుగా సమాచారం.
పగుళ్లు తేలిన డబుల్ పిల్లర్
మూడు సార్లు రీ డిజైన్…
సాధారణంగా ఓ ప్రాజెక్టు నిర్మాణం కోసం కొన్ని డిజైన్లను రూపొందించి వాటిపై అన్ని విషయాల్లో చర్చించే ఆనవాయితీ సాగుతుంటుంది. ఒక్కో డిజైన్ వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి..? ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరదలను తట్టుకునేందుకు ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి… ఏ డిజైన్ కు ఎంత ఖర్చు అవుతుంది..? ముంపునకు గురయ్యే ప్రాంతం ఎంత..? పర్యావరణ ముప్పు ఎంతమేర ఉండనుంది, అందుకు తగ్గట్టుగా ప్రతిఫలాలు అందనున్నాయా..? ఎంపిక చేసిన సైట్ వద్ద భవిష్యత్తులో ఏమైన ఇబ్బందులు ఎదురవుతాయా..? నిరంతరం ప్రవహించే నీటి మధ్య నిర్మించే ఇలాంటి నిర్మాణాలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది..? గతంలో ఎలాంటి నిర్మాణాలు జరిపారు..? ఆధునికంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటే లాభమా నష్టమా ఇలా పలు అంశాలపై సమగ్రంగా చర్చించడం ఆనవాయితీ. ఇంజనీరింగ్ నిపుణులే కాకుండా పర్యావరణ వేత్తలతో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగిన కట్టడాలకు సంబంధించిన ఎస్టిమేట్లను కూడా సేకరిస్తారు. అయా ప్రాంతాల్లో ఉన్న భూమి, ఫ్లడ్ స్పీడ్ వంటి అంశాలను కొత్తగా నిర్మాణం జరిపే ప్రాంతాలకు ఉన్న సారూప్యతపై కూడా అధ్యయనం చేసి ఓ డిజైన్ ను ఎంపిక చేస్తారు. అయితే మేడిగడ్డ విషయంలో మాత్రం విచిత్రంగా అధికారులు వ్యవహరించినట్టుగా విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది. ఈ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను మూడు సార్లు మార్చినట్టుగా అధికారులు గుర్తించారు. మూడు సార్లు జరిగిన రీ డిజైన్ కు సంబంధించిన రికార్డులను అధ్యయనం చేయాలంటేనే నెలల సమయం పట్టనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రీ డిజైన్లు కూడా స్టేట్ డ్యామ్ సేష్టీ అథారిటీ ద్వారా సీడబ్లూసీ ఆమోదం కోసం పంపించారా..? ఇందులో సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన సలహాలు ఏంటీ..? అందుకు అనుగుణంగానే డిజైన్లను మార్చారా అన్న విషయాలపై కూడా విజిలెన్స్ అధికారులు తమ నివేదికలో వివరించనున్నట్టు సమాచారం.
మరిన్ని తప్పిదాలు వెలుగులోకి…
మేడిగడ్డ నిర్మాణం చేసినప్పుడు ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద ప్రవాహం ఎంత వేగంగా వస్తుంది..? భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఉన్నాయా అన్న విషయంపై ప్రత్యేకంగా స్టడీ చేయనట్టుగా విజిలెన్స్ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఈ కారణంగానే అందుకు తగినట్టుగా బ్యారేజ్ నిర్మాణానికి ఉపయోగించే మెటిరియల్ కూడా ఫ్లడ్ స్పీడ్ కు తగ్గట్టుగా వినియోగించలేదని కూడా తెలుస్తోంది. బ్యారేజ్ నిర్మాణానికి ఉపయోగించిన మెటల్, సిమెంట్, స్టీల్ విషయంలో ప్రామాణికతలు పాటించనట్టుగా తెలుస్లోంది. కొన్నింటికి 12 ఎంఎం సైజులో ఉన్న తీగలు వాడినట్టుగా గుర్తించారు అధికారులు. ప్రాథమికంగా నిర్థారించిన ఈ అంశాలతో పాటు ఇప్పటికే నిపుణులు పరీక్షించిన రిపోర్టులు ఫిబ్రవరి 10 వరకు విజిలెన్స్ అధికారులకు రానున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి విజిలెన్స్ అధికారులు రెండు మూడు రోజుల్లో ప్రిలిమినరీ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. ప్రొఫైలింగ్ ఇమెజెస్, ల్యాబ్ టెస్ట్ రిపోర్టులు అందిన తరువాత పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించే అవకాశాలు ఉన్నాయి. కొన్నిచోట్ల నిర్మాణాల కోసం ఉపయోగించిన స్టీల్ బార్లను జాయింట్ చేశారని, రివిట్ సిస్టం ద్వారా జాయింట్ చేసే విదానాన్ని అవలంభించడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తాయన్న అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. రాఫ్ట్ ల కోసం వినియోగించిన మెటిరియల్ అంతా కూడా కొట్టకపోయిన తీరును గమనిస్తే అసలు బ్యారేజీ మీదుగా వెల్లే వరద నీటిని అంచనా వేయకుండానే నిర్మాణం జరిపారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని చోట్ల రాఫ్ట్ కింది భాగంలో గోతులుగా ఏర్పడడం కూడా నిర్మాణంలో డొల్లతనాన్ని స్పష్టం చేస్తోందన్న అభిప్రాయాలతో అధికారులు ఉన్నారు.
మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఇలాంటి దృశ్యాలు కామన్
ఒక్క బ్లాకే అయితే..?
ప్రస్తుతం పూర్తిస్థాయిలో డ్యామేజ్ అయిన7వ బ్లాకును మాత్రమే సవరించాలన్నా రూ. వెయ్యి కోట్ల వరకు డబ్బు అవసరం పడుతోందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే 7వ బ్లాకు పునరుద్దరించినప్పటికీ గతంలో మాదిరిగా 16 టీఎంసీల వరకు నీటిని నిలువ చేసే పరిస్థితి మాత్రం ఉండదని, రోజుకు రెండు నుండి మూడు టీఎంసీల నీటిని నిలువ ఉంచి ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తుపోసుకోవడం తప్ప మరో గత్యంతరం అయితే లేదన్న నిర్ధాణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. రూ. వెయ్యికోట్లు పెట్టి పునరుద్దరించినప్పటికీ శాశ్వతమైన ప్రయోజనం మాత్రం ఒనగూరే అవకాశం లేదని ప్రాథమికంగా గుర్తించిన అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా స్టడీ చేస్తున్నట్టుగా సమాచారం. సాధారణంగా ఏదైని నిర్మాణం జరిపేందుకు దాని లైఫ్ ఎంత కాలం ఉండాలి అన్న యోచనతో ఎస్టిమేట్లు తయారు చేస్తుంటారు. 50, 100, 500 ఏళ్ల వరకు కన్సట్రక్షన్స్ నిలువాలన్న లక్ష్యంతో నిపుణులు నిర్మాణాలపై సమగ్రమైన అధ్యయనం చేస్తారు. ఇందులో గత వందేళ్లలో ఎంత మేర వరదలు వచ్చాయి..? అవి ఎంత ఎత్తున ప్రవహించాయి, ఉధృతి ఎంత స్పీడ్ లో సాగింది, సాధారణ సమయంలో ప్రవాహం ఎలా ఉంటుంది అన్న విషయాలను బేరీజు వేసుకుని భవిష్యత్తు వందేళ్ళలో ఎంత మేర ఉండబోతుంది అన్న విషయాలపై గణాంకాలు వేస్తుంటారు. భవిష్యత్తులో వరదల తీరును అంచనా వేసినప్పుడు ఒకటికి పది సార్లు క్రాస్ చెక్ చేసుకుని అధికారులు తాము వేసిన అంచనాలకు మించి వరదలు వచ్చినా నిర్మాణం దెబ్బతినకుండా ఉండేవిధంగా అంచనాలు తయారు చేస్తుంటారు. అయితే మేడిగడ్డ విషయంలో ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకున్నారా..? తీసుకున్నట్టయితే మూడేళ్లలోనే దెబ్బతినడానికి కారణం ఏంటన్న విషయాలను కూడా పరిశీలించనున్నారు విజిలెన్స్ అధికారులు.