రాజకీయవర్గాలను పట్టికుదిపేస్తున్న లిక్కర్ స్కాంలో ప్రముఖంగా వినపడుతున్న వారి పేర్ల జాబితా రోజు రోజుకు పెరిగిపోతోంది. కేవలం వ్యాపారవర్గాలే కాకుండా బడా వ్యాపారస్థులు కూడా ఈ వ్యవహారంలో తమవంతు పాత్ర పోషించినట్టుగా వెలుగులోకి వస్తున్న విషయాలు ఇప్పుడు అందరినీ ఇరుకున పెడ్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం మరక కాస్తా తెలంగాణాకూ అంటుకోవడం సరికొత్త చర్చకు దారి తీసింది. రాష్ట్రానికి చెందిన వారిని ఈడీ అరెస్ట్ చేయడంతో పాటు పలువురిని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయి ఇప్పటికే కస్టడీలో విచారణ ఎదర్కొన్న బోయినపల్లి అభిషేక్, విజయ్ నాయర్ లను మరిన్ని రోజులు విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇందులో బోయినపల్లి అభిషేక్ నుండి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని విచారణ అధికారులు కోర్టుకు వివరించడం గమానర్హం. అంటే లిక్కర్ స్కాంకు సంబంధించి తెలంగాణాకు చెందిన వారి భాగస్వామ్యంపై పూర్తిస్థాయిలో కూపీ లాగాలన్న యోచనలో ఈడీ ఉన్నట్టు స్పష్టం అవుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారిని గుర్తించిన ఈడీ అరెస్టులు చేయడంతో పాటు విచారణ కూడా చేస్తోంది. విజయ్ నాయర్ రిమాండ్ రిపోర్ట్ ను ఈడీ అధికారులు కోర్టులో దాఖాలు చేశారు. లిక్కర్ స్కాంలో కీలక భూమిక పోషించింది విజయ్ నాయర్ ద్వారానే మామూళ్ల పంపకాలు కూడా జరిగాయని ఈడీ తేల్చి చెప్తోంది. లిక్కర్ హోల్ సేల్ వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేసి ఢిల్లీ ఎక్సైజ్ శాఖ అధికారులకు అందజేశారని, పాలసీ ప్రకటనకు రెండు నెలల ముందే పూర్తి వివరాలు విజయ్ నాయర్ చేతికి వచ్చాయని కూడా పేర్కొంది. ఈ లిక్కర్ పాలసీ వివరాలను వాట్స్ ద్వారా విజయ్ నాయర్ చేశాడని కూడా పేర్కొనడం గమనార్హం. మరో వైపున అరెస్టయిన శరత్ చంద్రారెడ్డి భార్య కనికా టెక్రివాల్ ను అరగంట సేపు ఈడీ అధికారులు విచారించారని ప్రచారం జరుగుతుండగా, ఆమె కోర్టు అనుమతితో తన భర్తను కలిసిందని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విట్ చేయడం గమనార్హం.
లేని తలనొప్పా..?
లిక్కర్ స్కాంతో లేని తలనొప్పి కొనుక్కున్నట్టుగా తయారైంది కొందరి పరిస్థితి. ఊహించని వారి పేర్లు కూడా వెలుగులోకి వస్తుండడంతో ఈడీ ఎలాంటి చర్యలకు పూనకుంటుందోనన్న చర్చ సాగుతోంది. వ్యక్తిగత సంబంధాలు ఉండి లిక్కర్ స్కాం జరిగిన సమయంలో వారిని కలిసినా తమకూ పిలుపు వస్తుందా అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్న వారూ లేకపోలేదు. రోజుకో పేరు వెలుగులోకి తెస్తూ ఈడీ జరుపుతున్న విచారణ తీరును గమనిస్తే ఎక్కడ తాము చిక్కుల్లో ఇరుక్కుంటామోనని లోలోన భయపడుతున్న వారూ ఉన్నారన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.