తెలంగాణ ముఖ్యమంత్రికి నోటీసులిచ్చిన ఢిల్లీ పోలీసులు: మరో ఐదుగురికి కూడా ఇవ్వనున్న స్పెషల్ టీం

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఎడిట్ చేసిన ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తితే… ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఎత్తి వేస్తామంటూ వ్యాఖ్యానించినట్టుగా ఎడిట్ చేశారని ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసును ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేసిన సైబర్ క్రైం అధికారులు Intelligence Fusion & Strategic Operations వింగ్ చే దర్యాప్తు చేయిస్తున్నారు. స్పెషల్ ఇంటలీజెన్స్ కు సంబంధించిన ఈ విభాగం దర్యాప్తు చేస్తున్న క్రమంలో దీనిని ఇండియా కూటమి పార్టీలకు చెందిన వారే వైరల్ చేశారని భావిస్తున్నారు ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. మే1న విచారణకు రావాలని వెంట మొబైల్ ఫోన్ కూడా తీసుకరావాలని సమన్లలో పేర్కొ్నట్టుగా ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. అమిత్ షా తెలంగాణ పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోనే ఎడిట్ చేయడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఎడిట్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు మరో ఐదుగురికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సమాయత్తం అయ్యారు. ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న ప్రత్యేక పోలీసు బృందం మిగతా వారికి నోటీసులు ఇవ్వనుంది. వీరిలో ఐదుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారితో పాటు ఇతర వ్యక్తులు ఉన్నట్టుగా సమాచారం. అయితే కొద్ది సేపటి క్రితం గాంధీ భవన్ కు చేరుకున్న ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియా ఇంఛార్జి మన్నే సతీష్ కు నోటీసులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. 91/160 సీఆర్పీసీ కింద ఇస్తున్న ఈ నోటీసులను అందుకున్న తరువాత ఢిల్లీలో విచారణకు హాజరు కావల్సి ఉంటుంది. ఎన్నికల సమయం కావడంతో ఇలాంటి ఎడిట్ వీడియోలతో ప్రజల్లో తప్పుడు ప్రచారం జరుగుతుందని భావించిన బీజేపీ పార్టీ ముఖ్య నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కారణంగానే అమిత్ షా కూడా ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని ఫిర్యాదు చేశారు. వీడియో ఎడిట్ చేసిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

You cannot copy content of this page