పోరుబాట పట్టాలని మావోయిస్టుల పిలుపు
తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 10న అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. తీర్మానం రద్దయ్యేవరకూ పోరుబాట సాగించాలని పిలుపునిచ్చింది. వాల్మీకి, బోయ, బేదర్, కిరాతక, నిషాది, పెద్దబోయ, తలయారి, చుండు వాళ్ళు, కైతి లంబాడా, భాగ్ మదుర, చమర్ మదుర కులాల వారిని షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాలని, 2016లో షెడ్యూల్డ్ తెగల విచారణ సంఘం ఆదిలాబాద్, కుమురంభీం అసిఫాబాద్, మంచిర్యాల జిలాల్లో నివసిస్తున్న మాలి సామాజిక సెక్షన్ల ప్రజలను ఎస్టీ జాబితాలో చేర్చాలనకన సిఫార్సును కూడా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందని పేర్కొంది. ఈ రెండు తీర్మానాలను ఆమోదించాల కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారని దీనివల్ల ఆదివాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోందని మావోయిస్టు పార్టీ తెలిపింది. ఈ రెండు తీర్మానాలు అమలు చేస్తే సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన ఆదివాసీలకు రాజ్యాంగ బద్దంగా దక్కిన హక్కులు, చట్టాలు, రిజర్వేషన్లు, పథకాలు దక్కకుండా పోతాయని ఆరోపించింది. ఇప్పటికే లంబాడాలను ఎస్టీలో చేర్చడం మూలంగా ఆదివాసులకు సామాజికంగా, ఆర్ధికంగా దక్కాల్సిన రిజర్వేషన్లు, పథకాలన్నింటిని అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన లంబాడాలే ఎక్కువ శాతం అనుభవిస్తున్నారని,
బ్రిటీష్ వలస పాలన నుండి, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత కూడా సాధారణంగా అమలవుతున్న చట్టాలే కాకుండా షెడ్యూల్డ్ ప్రాంతంలో ప్రత్యేక చట్టాలున్నాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మావోయిస్టు పార్టీ సూచించింది. మైదాన ప్రాంత ప్రజలతో పోలిస్తే ఆదివాసుల సామాజిక పద్ధతులు, ఆచార వ్యవహారాలు, వారి జీవన విధానం భిన్నంగా ఉంటాయని, అమాయకత్వం, నిరక్షరాస్యత ఆసరా చేసుకొని ఆదివాసులపై తీవ్రంగా దోపిడి, దౌర్జన్యాలు, మోసాలకు జరుగుతున్నాయని విమర్శించింది. దీనివల్ల ఆదివాసులు సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధిలో వెనకబడడంతో షెడ్యూల్డ్ జాతుల జీవనవిధాన పరిరక్షణకు, అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడానికి ప్రత్యేక చట్టాలు రూపకల్పన చేశారని, ఆదివాసులు నివసిస్తున్న ఏజెన్సీ ప్రాంతాలన్నింటిని 5వ షెడ్యూల్లోని 244వ అధికరణను తీసుకొచ్చి ఏజెన్సీలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా పిలుస్తున్నారని వివరించింది. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగ బద్దంగా కల్పించబడిన 1/70, పీసా, 5వ షెడ్యూల్డ్ చట్టాలను అమలు చేయకుండా నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆదివాసుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఆదివాసేతరులు ఏజెన్సీలో ప్రవేశించి అక్రమంగా భూములు సంపాదించుకున్నారని మావోయిస్టు పార్టీ దుయ్యబట్టింది. ఏజెన్సీల్లో ఆదివాసేతరులు రాజకీయ అధికారాన్ని శాసిస్తున్నారని ఆరోపించింది. కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే 11 ఆదివాసేతర కులాల ప్రజలను ఎస్టీ జాబితాలో కలిపడం వల్ల ఆదివాసుల హక్కులు, రిజర్వేషన్లు, చట్టాలను 11 కులాల ఆదివాసేతర్లకు కూడా వర్తించేలా చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్దేశ పూర్వకంగా చేయబడిన ఈ తీర్మానం ఆదివాసులను మరింత దుర్భర స్థితిలోకి నెట్టే ప్రమాదం ఎదురు కానుందని వ్యాఖ్యానించింది. వెనకబడిన కులాల అభివృద్ధి కోసం ప్రత్యేక చట్టాలు, పథకాలు, ప్యాకెజీలు రూపొందించే అధికారాలు ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్ళకుండా కేవలం ఆదివాసుల వినాశనాన్ని మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని ఆరోపించింది. జల్… జంగల్… జమీన్ అని కొమురంభీం ఇచ్చిన పిలుపునందుకుని ప్రతి ఆదివాసీ కూడా కొత్తగా ఎస్టీ జాబితాలో చేర్చూతూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఆదివాసీ బిడ్డలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ పోరాటం సాగించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.