దిశ దశ, మంథని:
లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఆ సెగ్మెంట్ నుండే పోటీ ఎక్కువగా ఉంది. ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు తమకు టికెట్ ఇప్పించాలన్న ప్రతిపాదనలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంంగా ఎంపీ టికెట్ కోసం మంథని నుండి ఆశావాహులు పెద్ద సంఖ్యలో వస్తుండడం విశేషం.
పెద్దపల్లి రేసులో…
పెద్దపల్లి లోకసభ స్థానం నుండి పోటీ చేసేందుకు మంథని అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారే ఎక్కువగా తెరపైకి వస్తున్నండడం గమనార్హం. రెండు సార్లు ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన సుగుణ కుమారి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. మంథనికి కోడలిగా వచ్చిన ఆమె మరోసారి లోకసభకు అడుగపెట్టాలని ఆశిస్తున్నారు. కాటారం మండలం గూడురుకు చెందిన గోమాస శ్రీనివాస్ కూడా ఈ సారి టికెట్ రేసులో ఉన్నారు. చాలా కాలంగా మహారాష్ట్రలోని చంద్రపూర్ లో నివాసం ఉంటున్న గోమాస శ్రీనివాస్ అనూహ్యంగా పెద్దపల్లి ఎంపీ రేసులో ఎంట్రీ ఇచ్చారు. 2009లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గోమాస శ్రీనివాస్ 49 వేల స్వల్ప ఓట్ల మెజార్టీతో జి వివేక్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత జరిగిన రెండు లోక సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినప్పటికీ నిరాశే ఎదురైంది. తాజాగా మరో సారి తనకు టికెట్ ఇవ్వాలని అథిష్టానాన్ని కోరుతున్నారు. అలాగే ఆయన అన్న కొడుకు గోమాస సచిన్ కూడా ఎంపీ టికెట్ అడుగుతున్నానని ప్రచారం జరుగుతోంది. మంథని ఎంపీపీగా ఉన్న కొండ శంకర్ కూడా తనకు ఎంపీ టికెట్ ఇప్పించాలని మంత్రి శ్రీధర్ బాబుకు అప్లికేషన్ పెట్టుకున్నారు. మంథని మండలం నాగారం సర్పంచ్ గా బాధ్యతలు నిర్వర్తించిన, అడ్వకేట్ బూడిద మల్లేష్ కూడా తనకు టికెట్ ఇప్పించాలని కోరుతున్నారు. ఆయన ఇప్పటికే మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. మహదేవపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన మంచినీళ్ల దుర్గయ్య కూడా తనకు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇప్పించాలని శ్రీధర్ బాబును అభ్యర్థించారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధిగా పలుమార్లు గెలిచిన తాను కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా కొనసాగుతున్నానని తనకు అవకాశం ఇచ్చి నట్టయితే సామాన్యులకు ప్రాధాన్యత కల్పించినట్టవుతుందని మంచినీళ్ల దుర్గయ్య అంటున్నారు. మహాముత్తారం మండలం స్తంభంపల్లి(పిపి) సర్పంచ్ జాడి రాజయ్య కుడా తనకు ఎంపీ టికెట్ ఇప్పించాలని కోరుతున్నారు. అయితే వీరిలో ఇప్పటి వరకు అయితే సిహెచ్ సుగుణ కుమారి, గోమాస శ్రీనివాస్ లు మాత్రమే గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మిగతా వారు కూడా దరఖాస్తు చేసుకున్నట్టయితే మాత్రం మంథని సెగ్మెంట్ హైలెట్ కానుంది.
శ్రీధర్ బాబుపైనే అంతా…
పెద్దపల్లి లోకసభ టికెట్ రేసులో మంథని నియోజకవర్గం నుండే పలువురు అభ్యర్థిస్తుండడంతో వారందరిని ఒక తాటి మీదకు తీసుకరావల్సిన పరిస్థితి మంత్రి శ్రీధర్ బాబుపైనే ఉంది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారు, స్థానిక నాయకులు పెద్దపల్ల ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నప్పటికీ శ్రీధర్ బాబు చెప్తే వింటారన్న అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఈ ఇద్దరి మధ్యే..?
ప్రధాన పోటీ మాత్రం సుగుణ కుమారి, గోమాస శ్రీనివాస్ ల మధ్యే ఉంటుందని స్పష్టం అవుతోంది. గతంలో రెండు సార్లు ఇక్కడి నుండి ఎంపీగా గెల్చిన అనుభవం ఉండడం తనకు లాభిస్తుందని సుగుణ కుమారి చెప్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కూడా సీనియర్ నేతలను కలిసి తన అభ్యర్థిత్వం గురించి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు సుగుణ కుమారి. మరోవైపున గోమాస శ్రీనివాస్ కూడా తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరు కూడా శ్రీధర్ బాబుపై విశ్వాసం ఉంచుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే గోమాస శ్రీనివాస్ అటు మహారాష్ట్రలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటు ఏఐసీసీ పెద్దలతో కూడా సంబంధాలు ఉండడంతో ఢిల్లీ లెవల్లో పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతల సానుకూలత కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా గతంలో ఏనాడు లేని విధంగా పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం మంథని సెగ్మెంట్ నుండే పోటీ తీవ్రంగా ఉండడం మాత్రం సంచలనంగా మారింది.