అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్
దిశ దశ, జగిత్యాల:
ధర్మపురి ఈవీఎంల విషయంలో నిభందనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికార యంత్రాంగంపై క్రిమినల్ కేసులు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. అలాగే వారిని విధుల నుండి తొలగించాలని కూాడ ఆయన కోరారు. ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ వ్యవహారంలో మాల్ ప్రాక్టీస్ జరిగిందని తాను నమ్ముతున్నానని స్ఫష్టం చేశారు. పోలింగ్ జరిగిన రోజునే నోటిఫై చేసిన వీఆర్కె కాలేజీకి ఈవీఎంలను తరలించకుండా ధర్మపురిలోనే ఉంచి మరునాడు నూకపల్లి స్ట్రాంగ్ రూంకు తరలించారని ఆరోపించారు. అలాగే తాను కౌంటింగ్ కేంద్రంలోనే అభ్యంతరాలు వ్యక్తం చేశానని, లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన వీడియో రికార్డింగ్ తో పాటు తాను అబ్జక్షన్ చేసిన తీరు కూడా వీడియో ఫుటేజీలో ఉండాలన్నారు. అంతేకాకుండా ఈవీఎంలను స్ట్రాంగ్ రూంకు తరలించే వరకూ వీడియో రికార్డింగ్ ఉండడంతో పాటు వీఆర్కే కాలేజీ పరిసర ప్రాంతాలు, కాలేజీ లోపల కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఫుటేజీని భద్రపర్చాల్సి ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ మాత్రం ఆ రికార్డులే లేవని చెప్తుండడం విస్మయం కల్గిస్తోందని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ రూం కీస్ మిస్సింగే కాకుండా గదుల లోపల ఉన్న ట్రంకు బాక్సులకు కొన్నింటికి తాళలే లేవని, తాళం వేసినప్పటికీ వాటి తాళం చెవులు లభ్యం కాలేదని ఆరోపించారు. అయినప్పటికీ హై కోర్టు ఆదేశాల మేరకు లాక్స్ బ్రేక్ చేయడానికి పిటిషనర్ గా తాను అధికారులకు సహకరించి వాటిని కూడా పగలగొట్టేందుకు సమ్మతించినట్టు వెల్లడించారు. 209 బూత్ కు సంబందించిన 17సీ ఫామ్స్ కవర్ కు అసలు సీలే లేదన్నారు. ఇలా ప్రతి అంశాలోనూ అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ విషయాలన్ని కూడా హై కోర్టు దృష్టికి తీసుకెళ్తానని అడ్లూరి వెల్లడించారు. ప్రధానంగా ఈవీఎం మిషన్లు, 17ఏ, 17సీ, 17సీ పార్టు 2 ఫామ్స్ అన్నింటిని సరి చూడాలని కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేస్తానన్నారు. రీ కౌంటింగ్ ప్రక్రియ మళ్లీ కొనసాగించాలని హై కోర్టును అభ్యర్థించానని మళ్లీ కూడా కోర్టును ఈ విషయంపై కోరుతానని ప్రకటించారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post