ఎన్నికల్లో బలంగా వినిపించాలని నిర్ణయం
కార్యరంగంలోకి దూకిన జేఏసీ
దిశ దశ, హుజురాబాద్ కరస్పాండెంట్:
మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహరావు పేరిట జిల్లా ఏర్పాటు కోసం మళ్లీ ఉద్యమాలు మొదలు కాబోతున్నాయి. భారత ఆర్థిక సంస్కరణలకు పితామహుడైన పివి పేరిట జిల్లా ఏర్పాటు చేయాల్సిందేనన్న డిమాండ్ బలంగా వినిపించబోతున్నారు. ఇప్పటికే నిరవధిక దీక్షలు చేపట్టిన జేఏసీ ఈ ఎన్నికల్లో జిల్లా ఆవిర్భావం కోసం పోరుబాటకు మళ్లీ శ్రీకారం చుడుతోంది.
రెండు చోట్లా డిమాండ్…
బహుష ఏ నాయకునికి కూడా దక్కని తీరు పివి నరసింహరావుకు దక్కిందని చెప్పుకోవచ్చు. ఆయన స్వస్థలం హుజురాబాద్ సమీపంలోని వంగెర అయితే రాజకీయ జన్మనిచ్చింది మాత్రం పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం. పివి పేరిట జిల్లా ఏర్పాటు చేయాలని ఆయన ప్రధాని అయినప్పుడే మంథని ఎన్ఎస్ యూఐ నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించారు. పివి జిల్లా కేంద్రంగా మంథనిని ప్రకటించాలంటూ 1990 దశకంలోనే మంథనిలో నిరవధిక కార్యక్రమాలు చేపట్టారు. మంథని విద్యార్థి యువత ఆధ్వర్యంలో చేపట్టిన ఈ డిమాండ్ గురించి అప్పటి ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. మంథని నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన పివి పేరిట జిల్లా ఏర్పాటు కోసం డిమాండ్ చేశారు. మరోవైపున ఆయన స్వస్థలం అయిన హుజురాబాద్ కేంద్రంగా కూడా జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇందుకోసం తెలంగాణ జేఏసీ, విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు చేపట్టారు. హుజురాబాద్ కు 12 కిలోమీటర్ల దూరంలో వంగెర ఉందని, ప్రధానంగా 1952లో తొలిసారి ప్రత్యక్ష్య ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ బరిలో నిలిచిన పివి నరసింహరావుకు హుజురాబాద్ తాలుకా కాంగ్రెస్ కమిటీ అండగా నిలిచింది. సీతారాంనాయుడు ఆధ్వర్యంలో అప్పుడు పివి లోకసభ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిందని జేఏసీ నాయకులు వివరించారు. అయితే పివి జిల్లాగా హుజురాబాద్ ను ప్రకటించాలని 2016 నుండి 2020 వరకు జేఏసీ ఆందోళనలు చేపట్టినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయంలో అప్పటి మంత్రి ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, లోక సభ సభ్యులు వినోద్ కుమార్ లు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంలో విఫలం అయ్యారని జేఏసీ అభిప్రాయపడుతోంది. ఈ కారణంగానే పివి జిల్లా ఏర్పాటు కాలేదన్న వాదనలను తెరపైకి తీసుకొచ్చింది. గత ఉప ఎన్నికల సమయంలో కూడా హుజురాబాద్ జిల్లాను ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు కూడా చేసిందన్న ప్రచారం జరిగినా ఆచరణలో మాత్రం పెట్టకపోవడంతో స్థానికులను నిరాశపరిచింది.
జిల్లా ఇలా…
హుజురాబాద్ జిల్లా పరిధిలో ఏఏ ప్రాంతాలు ఉండాలోనన్న ప్రతిపాదనలు కూడా జేఏసీ సిద్దం చేసింది. వరంగల్, హన్మకొండ జిల్లాలు ఒకే చోట ఉన్నాయని హన్మకొండకు బదులు హుజురాబాద్ ను జిల్లా కేంద్రంగా గుర్తించాలని జేఏసీ కోరుతోంది. ఇందులో ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, హుజురాబాద్, వి సైదాపూర్, శంకరపట్నం మండలాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి, టేకుమట్లలను కలుపుతూ హుజురాబాద్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జమ్మికుంట, ఎల్కతుర్తిలలో రెవెన్యూ డివిజనల్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టయితే పరిపాలన సౌలభ్యం కూడా బావుంటుందని కూడా జేఏసీ అంటోంది. రానున్న ఎన్నికల్లో తమ ప్రధాన ఏజెండా హుజురాబాద్ కేంద్రంగా పివి జిల్లాయేనని ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలని కోరుతోంది. భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సంస్కరణలతో దేశం యొక్క రూపురేఖలను మార్చిన తెలుగు ఠీవిగా నిల్చిన పివి పేరిట జిల్లా చేయాలని ఆయనకు రాజకీయ జన్మనిచ్చిన మంథని వాసులు డిమాండ్ చేసినా ఫలితం దక్కలేదు. హజురాబాద్ కేంద్రంగా అయినా జిల్లాను చేయాలని కోరుతున్నా ఆచరణ దిశగా అడుగులు వేయకపోవడంతో ఎన్నికల్లో తమ గళాన్ని గట్టిగా వినిపించాలని జేఏసీ నిర్ణయించుకుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా వ్యవహరిస్తుందో లేదో చూడాలి మరి.