అభ్యర్థుల ముంగిట పెను సవాల్…
హుజురాబాద్ లో రౌండ్ టేబుల్ మీటింగ్
దిశ దశ, హుజురాబాద్ కరస్పాండెంట్:
హుజురాబాద్ నుండి పోటీ చేసే అభ్యర్థులకు సవాల్ ఎదురవుతోంది. ముక్త కంఠంతో వినిపిస్తున్న నినాదాన్ని అందిపుచ్చుకోకుంటే తల రాతలు మారే పరిస్థితి ఎదురవుతోంది. ఎన్నికలకు ముందే తమ పంథాను తెలియజేయాలని పట్టుబడుతున్నారు స్థానికులు. మంగళవారం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో హుజురాబాద్ కేంద్రంగా పీవి జిల్లా ఏర్పాటు చేయాల్సిందేనని పలువురు డిమాండ్ చేశారు.
వెయ్యి నామినేషన్లు…
పీవి జిల్లా ప్రకటించనట్టయితే నిజామాబాద్ లోకసభ ఎన్నికలను మరిపించాలని పలువురు వక్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియకు ముందే హుజురాబాద్ కేంద్రంగా పీవి జిల్లాను ప్రకటించనట్టయితే వెయ్యి మందిచే నామినేషన్లు వేయాలని చాలామంది వక్తలు స్పష్టం చేశారు. పీవి జిల్లా డిమాండ్ వినిపించేందుకు మాత్రమే నామినేషన్లు వేయాలని సూచించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా తమ గళాన్ని వినిపించేందుకు నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా రానున్న ఎన్నికల్లో కూడా మూకుమ్మడి నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతుండడం గమనార్హం. తమ పంథాన్ని వీడకుండా ఉండాల్సిందేనని, డిమాండ్ సాధించుకునే వరకూ పోరాటం ఉధృతంగా కొనసాగించాల్సిందేనని రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే పీవి జిల్లా ప్రకటించాల్సిందేనని, అధికార పక్షం కూడా ఎన్నికలకు ముందు ప్రకటించి చేతులు దులుపుకునే అవకాశం ఉందని, దీని వల్ల లబ్ది పొందడంతోనే సరి పెట్టుకునే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం చేశారు వక్తలు. అధికార పక్షం హుజురాబాద్ పీవి జిల్లాను ఏర్పాటు చేస్తూ అధికారిక ప్రక్రియను పూర్తి చేయాల్సిందేనని పట్టబడుతున్నారు. ఈ విషయంలో రాజీ పడినట్టయితే ఎన్నికల తర్వాత జిల్లా ఆవిర్భావం చేయాలన్న అంశం మరుగున పడిపోతుందని కూడా వక్తలు గుర్తు చేశారు. ఆరు నూరైనా… నూరు ఆరైనా హుజురాబాద్ జిల్లా ఆవిర్భావం విషయంలో రాజీలేని పోరాటం చేయాల్సిందేనని పలువురు స్పష్టం చేశారు. జిల్లా ఏర్పాటుకు సుముఖంగా ఉన్న అధికారేతర పార్టీ అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని కూడా ప్రతిపాదించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్, పీవికి బంధువు అయిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు కూడా ఈవిషయంపై సీరియస్ గా కృషి చేయలేదన్న వాదనలు కూడా వినిపించారు. ఏది ఏమైనా పీవి జిల్లా విషయంలో మాత్రం వెనక్కి తగ్గకుండా పోరు చేయాల్సిందేనని రౌండ్ టేబుల్ సమావేశంలో మెజారిటీ వక్తలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.