ఓట్లు అడిగేందుకు మా ఏరియాకు రాకండి
ఫ్లెక్సీలు కట్టిన జనం…
రామగుండంలో బీఆర్ఎస్ కు కొత్త కష్టం
దిశ దశ, పెద్దపల్లి:
ఎమ్మెల్యే ఎన్నికల్లో అధికార పార్టీ నేతలను ప్రజలు నిలదీసే సంస్కృతికి తోడుగా ఫ్లెక్సీల ఏర్పాటు ప్రోగ్రాం కూడా కొనసాగుతోంది. ఇంతకాలం ఫ్లెక్సీలు ఆయా పార్టీల నాయకులు తమ ప్రచారం కోసం వినియోగించుకోవడం కామన్. కానీ ఇప్పుడు ప్రజలే ఫ్లెక్సీల ద్వారా అధికారంలో ఉన్న వారిని నిలదీసేందుకు ఉపయోగిస్తున్నారు. మంత్రి కొప్పులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీ ఘటన ఇప్పటికే వెలుగులోకి రాగా తాజాగా రామగుండం పట్టణంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వైపున ఎన్నికల్లో గెలుపు కోసం నిర్విరామంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం చేస్తుంటే మరో వైపున ప్రజలు సరికొత్తగా నిలదీయడం ఆరంభించడం గమనార్హం. రామగుండం 41వ డివిజన్ లో మిషన్ భగీరథ నీరు మా ఇంటికి రావడం లేదు ఓటు అడిగేందుకు ఎలా వస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు కాలనీ వాసులు. వరదలు వచ్చినప్పుడు గోడ కూలిపోయినప్పుడు రాని నాయకులు ఇప్పుడు ఓట్లు అడిగేందుకు ఎలా వస్తారు అంటూ 41వ డివిజన్ వాసులు అడుగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్థానిక నాయకులు వ్యవహరించిన నిర్లక్ష్యాన్ని ప్రజలు నిలదీస్తున్న తీరుతో అభ్యర్థులకు సరికొత్త సమస్య ఎదురవుతోంది. అపరిష్కృతంగా పేరుకపోయిన సమస్యలు, లోకల్ లీడర్స్ వ్యవహరించిన తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్న తీరుతో ప్రజలు విసుగు చెంది ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. తాజాగా వెలుగులోకి వస్తున్న ఫ్లెక్సీల నిలదీత కార్యక్రమాన్ని అధికార పార్టీ అభ్యర్థులు ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి.