పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికులంతా సేఫ్‌

విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలోని అంకుషాపూర్‌ సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. దీంతో అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదమేమీ లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో కాజీపేట-సికింద్రాబాద్‌ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రైలు పట్టాలు తప్పిన సమయంలో రైలు వేగం తక్కువగా ఉంది. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైలును నిలిపివేయడంతో భారీ ప్రమాదం తప్పింది. రైలులోని నాలుగు భోగీలు పట్టాల తప్పగానే రైళ్లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఒక్కసారిగా రైళ్లో కుదుపులు రావడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు హాహాకారాలు చేశారు. రైలు బ్రేక్ వేయగానే ప్రయాణీకులంతా ఒక్కసారిగా రైళ్లోంచి కిందకు దిగిపోయారు. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్ఠవశాత్తూ ఎవరికీ ఏం కాలేదని రైల్వే అధికారులు తెలిపారు.

ప్రధాన మార్గంలో గోదావరి రైలు పట్టాలు తప్పడంతో అదే మార్గంలో వెళ్లే ఇతర రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలిగి ఆలస్యమయ్యాయి. ప్రయాణీకులను ఘట్‌కేసర్ నుంచి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. ఇతర రైళ్లను బీబీనగర్, భువనగిరి, ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్లలో నిలిపివేశారు. బీనగర్‌ స్టేషన్‌లో విశాఖ-మహబూబ్‌నగర్‌ ప్రత్యేక రైలును ఆపేశారు. తిరుపతి-పూర్ణా (నాందేడ్‌) స్పెషల్‌, దిబ్రూగఢ్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ రైళ్లను భువనగిరిలో నిలిపేశారు. ట్రాక్‌ మరమ్మతులు పూర్తయిన తర్వాత వీటిని పంపనున్నారు.

You cannot copy content of this page