కళ్యణ వైభోగమే… వృద్ద దంపతులకు వివాహం

దిశ దశ, వరంగల్:

మనవళ్లు… మనవరాళ్లు ఉన్న ఆ వృద్ద దంపతులు మూడు మళ్ల బంధంతో మరోసారి ఒక్కటయ్యారు. దశాబ్దాల క్రితం మనసులు కలిసిన వీరు కలిసి జీవిస్తున్నారు. వారిప్పుడు మనవళ్లు, మనవరాళ్ల సమక్షంలో మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.

తండాలో సందడే సందడి…

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్త్రం తండాలో వ‌ృద్ద దంపతులు పెళ్లి చేసుకున్న తీరు వైరల్ అవుతోంది. తండాకు చెందిన గుగులోతు లాలమ్మ(75), సమిడా నాయక్ (80) దంపతులు ఆరు దశాబ్దాల క్రితం గాంధర్వ వివాహం చేసుకున్నారు. ఇరువురు మనసులు కలవడంతో మూడు ముళ్ల బంధం లేకుండానే అన్యోన్యమైన దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు. నలుగురు కొడుకులకు, ఓ కూతురుకు జన్మనిచ్చారు. వీరి కడుపున పుట్టిన బిడ్డలు కూడా వైవాహిక బంధంతో స్థిరపడిపోగా వారికి కూడా సంతానం కల్గింది. వారిలో యాకూబ్ అనే మనవడి పుట్టిన రోజున తాత, నానమ్మలచే మనువాడే తంతు జరిపించాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా వివాహ వేడుకలాగే లాలమ్మ, సమిడా నాయక్ లో వివాహ వేడుక నిర్వహించిన వారసులు తండా వాసులను కూడా ఆహ్వానించారు. అంగరంగ వైభవంగా మనవళ్లు, మనవరాళ్లతో పాటు రక్తం పంచుక పుట్టిన బిడ్డల సమక్షంలో ఆ వృద్ద దంపతులు పెళ్లి చేసుకున్నారు. 80 ఏళ్ల వయసులో పెళ్లి తంతు జరిపించాలని ఆ కుటుంబ సభ్యులు అనుకోవడమే తరువాయి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి వైభోవోపేతంగా మంగళ వాయిద్యాల నడుమ శుభాకార్యాన్ని నిర్వహించారు.

మరో కారణం కూడా…

అయితే ఈ వృద్ద దపంతులు 60 ఏళ్ల క్రితం నుండి కలిసి జీవనం సాగిస్తున్నప్పటికీ పెళ్లి తంతు మాత్రం జరగలేదు. ఇద్దరి మనసులు కలవడంతో ఒక్కటై జీవిస్తున్న క్రమంలో మరో మెట్టుకూడా ఎక్కారు. 80 ఏళ్ల వయసు వచ్చిందంటే సహస్ర చంద్ర దర్శనం పూర్తి చేసుకున్నారని హిందూ సాంప్రాదాయంలో ఆచారాం ప్రకారం వేడుకలు నిర్వహిస్తారు. 80 ఏళ్ల వయసు నిండిన సమిడా నాయక్ సహస్ర చంద్ర దర్శనం చేసుకున్నారని ఈ పెళ్లి తంతు నిర్వహించారు. హిందు ఆచారాం ప్రకారం 1000 పౌర్ణమిలను చూసిన వారికి ఈ సహస్ర చంద్ర దర్శనం వేడుక నిర్వహిస్తారు. 80 ఏళ్ల 349 రోజులు పూర్తి చేసుకున్న వారు వెయ్యి పౌర్ణమిలను చూసినట్టుగా లెక్కిస్తారు. వెయ్యి పౌర్ణమిలను చూడగలిగారని 80ఏళ్లు దాటిన వారిచే సహస్ర చంద్ర దర్శన వేడుకలు చేయిస్తుంటారు. అందులో భాగంగానే వస్త్రం తండాకు చెందిన లాలమ్మ, సమిడా నాయక్ లకు వారసులు వివాహ వేడుక నిర్వహించారు.

You cannot copy content of this page