దిశ దశ, దండకారణ్యం:
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గత వైభవాన్ని సంతరించుకునేందుకు మావోయిస్టులు వేస్తున్న ఎత్తులు అంతగా సక్సెస్ కాలేకపోతున్నాయా…? దండకారణ్య అటవీ ప్రాంతం దాటి తెలంగాణాలోకి అడుగు పెట్టడం ఇబ్బందికరంగా మారిందా..? సాయుధ పోరుబాట తిరిగి చేపట్టాలని భావిస్తున్నా సానుకూల వాతావరణం లేకుండా పోయిందా..? నక్సల్స్ ఎత్తులు విఫలం అవుతున్న తీరు పార్టీకి ఆందోళనకరంగా మారిందా అన్న చర్చ సాగుతోంది.
ఘనమైన చరిత…
15 ఏళ్ల క్రితం వరకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పీపుల్స్ వార్ పార్టీ ప్రభుత్వానికి సవాల్ విసిరిందనే చెప్పాలి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ పెట్టని కోట మాత్రం నార్త్ తెలంగాణాలోనే ఉండేది. పీపుల్స్ వార్ నక్సల్స్ కు పెట్టని కోటగా మారిన ఉత్తర తెలంగాణ అడువులు శత్రు దుర్భేధ్యంగా మారిపోవడంతో సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహించేందుకు సమాయత్తం అయింది పార్టీ. కానీ అనూహ్యంగా మారిన పరిస్థితులు పార్టీ ఉనికి లేకుండా చేశాయనే చెప్పాలి. కోవర్టులు, సాంకేతికతకు తోడు పార్టీ రిక్రూట్ మెంట్ లోపాలు వంటి అంశాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుండి వలసలు కూడా తీవ్రంగా పెరిగిపోవడంతో ఉత్తర తెలంగాణాలో పార్టీ ఉనికి లేకుండా పోయింది. ఇదే సమయంలో చత్తీస్ గడ్ లోని బస్తర్ పూర్వ జిల్లా అటవీ ప్రాంతాల్లో కార్యకలాపాలను కూడా విస్తరింపజేసుకుంది అప్పటి పీపుల్స్ వార్. ఎంసీసీలో విలీనం అయిన తరువాత పార్టీ దండకారణ్య ప్రాంతంలో తిరుగులేని పట్టు సాధించింది. సమాంతర ప్రభుత్వాన్ని కూడా కొనసాగిస్తున్న మావోయిస్టు పార్టీ విప్లవోద్యమంలో ఓ చరిత్రను క్రియేట్ చేసిందనే చెప్పవచ్చు.
గత వైభవం కోసం…
అయితే కొత్త ప్రాంతాల్లో పార్టీ ఉనికిని చాటుకుంటూ ముందుకు సాగుతున్న నేపథ్యంలో గతంలో తిరుగులేని పట్టు ఉన్న ప్రాంతాలను దూరం చేసుకోవడం కూడా పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపినట్టయింది. దీంతో కేంద్ర కమిటీ స్థాయిలో కూడా జరిగిన చర్చల్లో ఉత్తర తెలంగాణలో పునర్ వైభవం కోసం ప్రయత్నించాలని నిర్ణయించాయి. ఈ మేరకు రూపాయి పోయిన చోటే వెతుక్కోవాలన్న నినాదాన్ని అందిపుచ్చుకున్న నక్సల్స్ కొంతకాలం భూస్వాముల భూములపై పోరుబాటకు శ్రీకారం చుట్టారు. గతంలో పార్టీ ఎర్ర జెండాలు పాతి పంచిన భూములను దళారులు జోక్యం చేసుకుని వాటిని విక్రయిస్తున్నారన్న విషయం తెలుసుకుని హెచ్చరికలు జారీ చేశారు. కాల్వశ్రీరాంపూర్ మండలానికి చెందిన ఒకరిని హత్య కూడా చేశారు నక్సల్స్. అంతకు ముందు మహాముత్తారం మండలంలో కూడా పలువురిని పోలీసు ఇన్ ఫార్మర్ల పేరటి చంపారు. దండకారణ్యంలో పార్టీ ఉనికి లేనప్పుడు దండకారణ్య అటవీ ప్రాంతం తెలంగాణ కమిటీలకు షెల్టర్ జోన్ గా మార్చుకుని సరిహద్దు ప్రాంతాల్లో అయినా పార్టీ కార్యకలాపాలు కొనసాగించాలని ప్రయత్నించారు. బండి ప్రకాష్ వంటి ముఖ్య నేతలకు కూడా పార్టీ పునర్నిమానం బాధ్యతలు అప్పగించినప్పటికి సఫలం కాలేకపోయారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు ప్రత్యేకంగా కార్యకలాపాలు కొనసాగిచేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మూడేళ్ల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్మెల అటవీ ప్రాంతంలో సాయుధ దళాన్ని రంగంలోకి దింపినప్పటికీ కూంబింగ్ పార్టీల ఈ విషయాన్ని గమనించడంతో ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. దీంతో పార్టీ శ్రేణులకు సంబంధించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కమిటీలు…
గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ కొనసాగుతున్నప్పటికీ సాయుధ దళాలు సంచరించే పరిస్థితి మాత్రం తెలంగాణలో కనిపించడం లేదు. గతంలో సరిహధ్దు అటవీ ప్రాంతాల్లో పలు మార్లు ఎన్ కౌంటర్లు జరగడంతో పార్టీ క్యాడర్ సాయుధులుగా తిరగలేని పరిస్థితులే తయారయ్యాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని ఉత్తర తెలంగాణాలో బలోపేతం చేయాలన్న ఆలోచనతో బడే దామోదర్ అలియాస్ చొక్కారావుకు బాధ్యతలు అప్పగించారు. మరో వైపున కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ కు కూడా తెలంగాణాలోని పలు జిల్లాల బాధ్యతలు అప్పగించింది నాయకత్వం. అయితే ఆసిఫాబాద్ మీదుగా ప్రవహిస్తున్న ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో మంగి ఏరియా దళాన్ని రంగంలోకి దింపారు. అడెల్లు ఆధ్వర్యంలో పార్టీ నిర్మాణం కోసం ముమ్మర ప్రయత్నాలు జరిగాయి. అయితే అడెల్లును కట్టడి చేయడం కోసం పోలీసు బలగాలు పెద్ద ఎత్తు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఆయన ఉనికిని ఎప్పటికప్పుడు పోలీసులు తెలుసుకుంటుడడంతో పార్టీ నిర్మాణం చేయలేకపోయాడు. 2016లో సరిహధ్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు ఆత్రం శోభన్ అలియాస్ ఛార్లెస్, మంగి ఏరియా కమిటీ సభ్యుడు దినేష్ మరణించగా, ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన ఘటనలో కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల డివిజన్ కమిటీ సభ్యుడు వర్గీష్, సీర్సూర్, చెన్నూరు ఏరియా కమిటీ కార్యదర్శి మగ్తు, ప్లాటూన్ సభ్యుడు కుర్సంగి రాజు, కుడిమెట్ట వెంకటేష్ లు చనిపోయారు. ఇంతకు ముందు ఏటూరునాగారం, మహదేవపూర్ ఏరియా కమిటీ కూడా ఎదురు దెబ్బలు తిన్నది. తాజాగా ములుగు జిల్లా ఏటూరునాగారం సమీపంలోని చల్పాక అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రుతో పాటు ఆరుగురు నక్సల్స్ చనిపోయారు.
ఆదిలోనే…
ఏటూరునాగారం, మహదేవపూర్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఎగులోపు మల్లయ్య అలియాస్ మధు, ఉరఫ్ కోటి ఇటీవలే బాధ్యతలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రెండు మూడు నెలల క్రితమే భాద్యతలు తీసుకున్న ఆయన ఎన్ కౌంటర్ లో చనిపోవడంతో పార్టీ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.