మహా జాతర ఎప్పుడో చెప్పిన పూజారులు
దిశ దశ, ములుగు:
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసి జాతరలలో ఒకటైన మేడారం సమ్మక్క సారలక్క జాతర తేదీలను పూజారులు ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది జరగనున్న మహా జాతరకు సంబంధించిన వివరాలను కొద్ది సేపటి క్రితం వెల్లడించారు. జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే ఈ మహా జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు 2 కోట్లకు పైగా వనదేవతలను పూజించడం ఆనవాయితీగా వస్తోంది. తరతరాలుగా సాగుతన్న ఈ వేడుకల్లో మొక్కులు తీర్చుకోవడం, బంగారం తూకం వేసి అమ్మవార్లకు సమర్పించేందుకు భక్తులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒరిస్సా, చత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల నుండి ఆదివాసిల కోసం పోరాటం చేసిన సమ్మక్క, సారలక్కలను దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు. వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్న సమ్మక్క సారలక్క మహా జాతరకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
===================================================================
14-2-2024 బుధవారం మండే మెలగడం, గుడి శుద్ది చేయడం.
21-02-2024 బుధవారం గుడి మెలగడం, శ్రీ సారలమ్మ, శ్రీ గోవిందరాజులు, శ్రీ పగిడిద్ద రాజులు సాయంత్రం 6 గంటలకు వారి వారి గద్దెల మీదకు చేరుకోవడం.
22-02-2024 గురువారం రాత్రి 8 గంటలకు శ్రీ సమ్మక్క దేవత గద్దె మీదకు చేరుకొనుట
23-02-2024. శుక్రవారం సమ్మక్క, సారలమ్మలకు, శ్రీ గోవింద రాజులు, పగిడిద్ద రాజులకు భక్తుల మొక్కులు సమర్పించాల్సి ఉంటుంది.
24-02-2024 శనివారం నాడు శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతలు మరియు శ్రీ గోవిందా రాజులు, పగిడిద్ద రాజు దేవుళ్ళు వన ప్రవేశం చేయడం
28-02-2024 నాడు తిరుగు వారం నిర్వహిస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు తెలిపారు.
===================================================================