డిటెక్టివ్ ఏజెన్సీ ముసుగులో హత్యకు స్కెచ్… ఛేదించిన నల్గొండ పోలీసులు…

దిశ దశ, నల్గొండ:

నేవీలో కమ్యూనికేషన్ విభాగంలో పని చేసిన అనుభవంతో డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకుని ఏకంగా హత్యకు స్కెచ్ వేశాడు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకుండా హత్య చేస్తానని కలలుకన్న ఏజెన్సీ నిర్వాహకుడి తీరుపై పోలీసులు డిటెక్టివ్ ఆపరేషన్ చేసి మర్డర్ కేసును ఛేదించారు. సుపారీ  ఇచ్చి మరీ మర్డర్ చేసి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నా కేసు మిస్టరినీ ఛేదించి సంచలనం సృష్టించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హత్య కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

అసలేం జరిగిందంటే..?

ఈ నెల 11వ తేది రాత్రి 10.30 గంటల సమయంలో రామగిరి సెంటర్ లోని గీతాంజలి అపార్ట్ మెంట్ లో ఉన్న మణికంఠ కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేష్ ను గుర్తు తెలియని వ్యక్తులు మరణాయుధాలతో హత్య చేసి పరార్ అయ్యారు. నల్గొండ పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారగా పోలీసులు కూడా సవాల్ గా తీసుకుని కేసును ఛేదించారు.

అనుమానంతో…

నకిరేకల్ కు చెందిన గద్దపాటి నరేష్, హైదరాబాద్ కొత్తపేటకు చెందిన ఉమా మహేశ్వరీలకు 2017లో వివాహం జరిగింది. వైద్యురాలు కూడా అయిన ఉమామహేశ్వరికి కొంతకాలంగా తన భర్త నరేష్ నడవడికపై అనుమానం కలిగింది. ఈ విషయాన్ని తన తండ్రి ఎక్సైజ్ శాఖలో సీఐగా పని చేసి రిటైర్డ్ అయిన మాతరి వెంకటయ్యకు వివరించింది. దీంతో తన అల్లుడు నరేష్ చర్యలను గమనించేందుకు నేవీలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన చిక్కు కిరణ్ కుమార్ అలియాస్ సి.కె. కుమార్ నిర్వహిస్తున్న స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీతో సంప్రదింపులు జరిపాడు. నరేష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆయన మరో మహిళ ద్వారా సంతానం కూడా కలిగిందని డిటెక్టివ్ ఏజెన్సీ నిర్వాహాడుకు చిక్కు కిరణ్ కుమార్ తేల్చాడు. అయితే తన అల్లుని అన్న సురేష్ కారణంగానే నరేష్ దారి తప్పి ఉంటాడని అనుమానించిన వెంకటయ్య సురేష్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తన అల్లుడు నరేష్ లో మార్పు వస్తుందని భావించాడు. సురేష్ ను హతం చేసినట్టయితే నరేష్ వివాహేతర బంధానికి బ్రేకప్ చెప్పి తన కూతురుతో సాఫీగా జీవనం సాగిస్తాడని అంచనా వేశాడు. అయితే అల్లుని అన్న సురేష్ ను చంపేందుకు ఎలా అని ఆలోచిస్తున్న క్రమంలో డిటెక్టివ్ ఏజెన్సీ నిర్వాహకుడు చిక్కు కిరణ్ తాను ఇందుకు సిద్దమేనని చెప్తాడు. నేవీలో పని చేసినప్పుడు కమ్యూనికేషన్ వ్యవహారాలను పర్యవేక్షించానని,   హత్యకు సంబంధించిన ఆధారాలు పోలీసులకు ఏమాత్రం దొరకకుండా  అన్ని జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పి డీల్ కుదుర్చుకున్నాడు. ఇందు కోసం రూ. 15 లక్షల సుపారీ మాట్లాడుకున్న డిటెక్టివ్ ఏజెన్సీ నిర్వాహకుడు చిక్కు కిరణ్ సురేష్ హత్యకు స్కెచ్ వేస్తాడు.

మర్డర్ కోసం…

ఎక్సైజ్ రిటైర్డ్ సీఐ మాతరి వెంకటయ్య వద్ద కుదుర్చుకున్న ఒప్పందంలో అడ్వాన్సుగా రూ. 2 లక్షలు తీసుకున్ని డిటెక్టివ్ ఏజెన్సీ నిర్వాహకుడు చిక్కు కిరణ్ కుమార్ నరేష్ హత్య కోసం రంగలోకి దిగాడు. దాదాపు నెల రోజుల క్రితం తన బంధువు అయిన ముషం జగదీష్‌ను చేరదీసిన కిరణ్ కుమార్ రూ.3 లక్షలు ఇస్తానని ఆశ చూపాడు. అప్పటి నుండి నల్గొండలో తిరిగిన ముషం జగదీష్ సురేశ్ కదలికలపై ఆరా తీసి అతన్ని ఎలా హత్య చేయాలి..? ఎక్కడ చేయాలో రెక్కీ నిర్వహించాడు. ఈనెల 11వ తేది రాత్రి 10.30 గంటల సమయంలో కిరణ్ కుమార్, ముషం జగదీష్ లు మణికంఠ కలర్ ల్యాబ్ వద్దకు చేరుకుని అర్జంటుగా ఫొటోలు ప్రింట్ కావాలని మాటల్లో పెట్టారు. కస్టమర్లుగా భావించిన సురేశ్‌ వారికి ఫోటోలు ప్రింట్ చేసి ఇచ్చే పనిలో నిమగ్నం అయిన క్రమంలో అతనిపై కత్తులతో దాడి చేసి గొంతు కోసి అతి దారుణంగా హత్య చేశారు.

తప్పించుకునేందుకు…

నిందితులు ఇద్దరు సురేష్ ను హత్య చేసిన తరువాత బైక్ పై పరార్ అయి చెరువు గట్టు వద్దకు చేరుకున్నారు. రక్తం అంటిన దుస్తులను, కత్తులను కారులో పెట్టుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు. మూసీ నది సమీపంలోని ముళ్ల పొదల్లో దుస్తులు, కత్తులు పడేసి తాము పోలీసులకు చిక్కకుండా సేఫ్ అయ్యామన్న ధీమాతో వెల్లిపోయారు.

పోలీసులకు సవాల్…

నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఒక్కసారిగా హై అలెర్ట్ అయ్యారు. పట్టణంలో దారుణ హత్య జరగడాన్ని  సవాల్ గా తీసుకున్న పోలీసులు కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. మృతుని కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకోవడంతో పాటు అనుమానితులపై నిఘా కట్టుదిట్టంగా వేసిన పోలీసులు మర్డర్ కు అసలు కారణం ఏంటో తేల్చేశారు. మృతుడు సురేష్ తమ్ముడు నరేష్ వైవాహిక బంధంలో వచ్చిన అనుమానంతో ఆరా తీసినప్పుడు… అతని  వివాహేతర బంధం గురించి తెలుసుకుని ఈ హత్యకు పాల్పడి ఉంటారని  అనుమానించిన పోలీసులు ఆ కోణంలో ఆరా తీశారు. హత్య కేసు చిక్కుముడి అంతా కూడా డిటెక్టివ్ ఏజెన్సీ నిర్వాహాకుడు చిక్కు కిరణ్ కుమార్ కేంద్రీకృతంగానే సాగిందని గుర్తించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా సేకరించిన పోలీసులు ప్రధాన నిందితుడు ఎక్సైజ్ రిటైర్డ్ సీఐ మాతరి వెంకటయ్య(66), అతని కూతురు ఎంబీబీఎస్ డాక్టర్ ఉమా మహేశ్వరి (37)లను అరెస్ట్ చేశారు. డిటెక్టివ్ ఏజెన్సీ నిర్వాహాకుడు పోలీసుల హత్య కేసులో ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడతానని కలలు కన్నప్పటికీ నల్గొండ పోలీసుల దర్యాప్తుతో అసలు విషయం బట్టబయలు అయింది. హత్య కోసం ఉపయోగించిన కారు, ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి, టూటౌన్ సీఐ ఎస్.రాఘవరావు, శాలి గౌరారం సీఐ కొండల్ రెడ్డి, నల్లగొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు వై సైదులు, సైదాబాబు, విష్ణుమూర్తి, సాయి ప్రశాంత్ లు చాకచక్యంగా వ్యవహరించారని ఎస్పీ శరత్ చంద్ర పవార్ కితాబిచ్చారు. మర్డర్ మిస్టరీని ఛేదించడంలో సఫలం అయిన పోలీసు యంత్రాంగాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

You cannot copy content of this page