దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీ ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిస్తూ దండకారణ్యంలో పలు చర్యలకు పాల్పడింది. నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేస్తున్న బలగాల పహారా నడుమ రెండో విడుత పోలింగ్ శుక్రవారం జరిగింది. చత్తీస్ గడ్ లో జరుగుతున్న ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ కంకేర్ జిల్లా పకంజూర్ ప్రాంతంలో విధ్వంసానికి పాల్పడ్డారు. ఛోట బెథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అచిన్ పూర్ లో ఉన్న జియో టవర్ పై నక్సల్స్ దాడికి పూనుకున్నారు. టవర్ కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ కు నిప్పంటించిన మావోయిస్టులు చెట్లను నరికి రోడ్లకు అడ్డంగా వేశారు. దీంతో ఈ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోయిస్టులు కరపత్రాలను కూడా ఈ ప్రాంతంలో వదిలేశారు. ఇటీవల కోయలిబేరా ప్రాంతంలోని గోమే గ్రామంలో జరిగిన ఎన్ కౌంటర్ బూటకమని, అమాయక గిరిజనులను చంపేశారంటూ మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ప్రతాపూర్ ఏరియా కమిటీ పేరిట విడుదల చేసిన ఈ కరపత్రాల్లో పలు అంశాలను ప్రస్తావించిన మావోయిస్టులు కోయలిబేరా ఎన్ కౌంటర్ లో పాల్గొన్న బీఎస్ఎఫ్, బస్తర్ ఫైటర్స్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారకులైన సుక్కు, నరేటి, ప్రదీప్, ఎమేష్, రాంసాయి, అర్జున్, ముఖేష్ లకు శిక్ష తప్పదని హెచ్చరించారు. మరోవైపున మోర్ ఖండి ఏరియాలో ముగ్గురిని నక్సల్స్ హతమార్చినట్టుగా తెలుస్తోంది.