దిశ దశ, హైదరాబాద్:
ధరణి పోర్టల్ సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోనే అతి ఎక్కువగా ధరణి ద్వారా సమస్యలు ఉన్నాయని ఫిర్యాదులు అందుకున్న రంగారెడ్డి జిల్లాలో ఈ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. చివరకు బాధితులు కార్యాలయాల ముందు నిరసనలు తెలపాల్సి వస్తోంది. గతంలో ధరణి పోర్టల్ ద్వారా ఎదురైన సమస్యల పరిష్కారం కోసం మీ సేవా ద్వారా ఫిర్యాదులు ఇవ్వాలని పలుమార్లు ప్రభుత్వం గడువు ఇచ్చింది. అంతే కాకుండా రెవెన్యూ సదస్సులను కూడా ఏర్పాటు చేసి బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించింది. అయినా చాలా వరకు సమస్యలు పెండింగ్ లోనే ఉన్నాయి. దీంతో బాధితులు నేటికీ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మరణించిన తండ్రి పేరిట ఉన్న భూమిని ఆయన వారుసుల పేర్లు రికార్డులకు ఎక్కాల్సి ఉంటే కనీసం బంధుత్వం లేని వారి పేర్లను ఎక్కించి చేతులు దులుపేసుకున్న సందర్భాలు ఉన్నాయి. పూర్వీకుల నుండి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని ప్రొహిబిటెడ్ కింద చేర్చి పట్టాదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ధరణి ద్వారా సమస్యలకు చెక్ పడుతుందని భావించినప్పటికీ కొత్త సమస్యలు ఉత్పన్నం కావడంతో చాలామంది రైతులు బాధితులుగా మారిపోయారు. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కార్యాలయంలో నిరసన తెలిపిన తీరే ధరణీ తప్పిదాల తీరును ఎత్తి చూపుతోంది. ట్రిపుట్ ఐటీ పూర్తి చేసి సోషల్ సైన్సెస్ లో పీజీ పూర్తి చేసిన జీవన్ (26) తన భూమిని ప్రొహిబిటెడ్ నుండి విముక్తి కల్పించాలని అధికారులను కలిసి విన్నపాలు చేసి విసిగి వేసారి పోయి ఏకంగా 30 నిమిషాల పాటు శీర్షాసనం వేసి మరీ తన బాధను వెల్లగక్కాడు. మంగళ్ పల్లి గ్రామంలో తనకు చెందిన సర్వే నంబర్ 374లోని 1.32 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చడంతో పాటు సీలింగ్ ల్యాండ్ అని రికార్డుల్లో ఎక్కించారు. దీంతో తమ భూమికి ఎప్పుడు విముక్తి కలుగుతుందో అర్థం కాక బాధితుడు గగ్గోలు పెడుతున్నారు. తన భూమికి సంబంధించిన రికార్డులను కూడా రెవెన్యూ అధికారులకు అప్పగించినా కూడా ఫలితం మాత్రం లేకుండా పోయింది. నేటికీ అతని భూమిని ప్రోహిబిటెడ్ కాలమ్ లోనే చూపిస్తున్నారు. దీంతో బాధితుడు తన ఆవేదనను తలకిందులుగా నిరసన చెప్పాడు. ఇలాంటి ఘటనలు కోకొల్లు ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశగా రెవెన్యూ అధికారులు చొరవ తీసుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.