దిశ దశ, హుజురాబాద్:
హుజురాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకత పూర్తిగా లాభిస్తుందని అంచనా వేసిన ఈటలకు ఊహించని షాకిచ్చినట్టయింది. ఎమ్మెల్సీగా కూడా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి వ్యూహాత్మక ఎత్తులతో ముందుకు సాగిన తీరు ప్రతి ఒక్కరిని విస్మయపరిచిందని చెప్పాలి. ఆయనపై వచ్చిన దుష్ప్రచారాలను తిప్పికొట్టేందుకు కౌశిక్ రెడ్డి ఓ వైపున తన భార్యను, తన కూతురును కూడా ప్రచారంలోకి దింపారు. ఆయన గెలిస్తే ఎంతో నష్టం చేకూరుతుందని, వసూళ్ల పర్వం కూడా మొదలవుతుందని ప్రచారం చేశారు. అయినప్పటికీ హుజురాబాద్ ప్రజలు మాత్రం కౌశిక్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. కమలాపూర్ మండల కేంద్రంలో ప్రచారం జరిగిన చివరి రోజున సాధుకుంటారో… సంపుకుంటారో మీ ఇష్టం, నాలుగున నా జయ యాత్రనా, నా శవ యాత్రనా అంటూ చేసిన వ్యాఖ్యలను హుజురాబాద్ ప్రజల మనసులను కరిగించాయనిపిస్తోంది. మరో వైపున పగలు గ్రామాల్లో ప్రచారాలు చేస్తూ రాత్రి వేళల్లో కౌశిక్ రెడ్డి చేసిన సీక్రెట్ ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. మంది మార్భలం లేకుండా వన్ ఆర్మీగా కౌశిక్ రెడ్డి వేసిన ఎత్తులు సఫలం అయ్యాయి. ఈటల వైఫల్యాలు, ఆయన బలహీనతలపై పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న కౌశిక్ రెడ్డి వాటన్నింటిని కూడా తనకు అనుకూలంగా మల్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. 20 వేల మెజార్టీతో తాను గెలవబోతున్నానని ముందుగానే కౌశిక్ రెడ్డి చెప్పినప్పటికీ ఆయన అనుచరులు కూడా ఊహించలేదు. ఓటమి ఖాయమని కౌశిక్ రెడ్డి అనుచరులు అనుకున్నప్పటికీ వారందరి అంచనాలను తలకిందులు చేసి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు.
ఈటల ఫెయిల్యూర్స్….
2004 నుండి ఇక్కడి ప్రజలతో మమేకమైన ఈటల రాజేందర్ పాత చింతకాయ పచ్చడిని మరిపించే విధంగా ప్రసంగించడాన్ని హుజురాబాద్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. సుతి మెత్తగా ఎమోషనల్ స్పీచ్ ఇస్తూ ప్రజలను ఆకట్టుకునే మంత్రానికి ఇక్కడి ప్రజలు తలొగ్గలేదనే చెప్పాలి. కౌశిక్ రెడ్డి దూకుడుతో పాటు ఆయన భార్య, బిడ్డలు కూడా వచ్చి ప్రచారం చేస్తున్న తీరును కూడా వ్యంగంగా విమర్శించినప్పటికీ ఆయనకు మెజార్టీ ఇవ్వడం గమనార్హం. ప్రధానంగా ఉప ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ ను ఓడించేందుకు బీఆర్ఎస్ నాయకులు చేసిన మౌత్ పబ్లిసిటీ ప్రభావం కూడా కొంతమేర ఉందని చెప్పకతప్పదు. 2004లోనే తనకు గజ్వేట్ టికెట్ కావాలని అడిగితే కేసీఆర్ ఇవ్వడానికి నిరాకరించారని, సొంత నియోజకవర్గం కమలాపూర్ నుండి పోటీ చేయాలని సూచించారని బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు. అప్పటి ఈటల ఆలోచనలకు తగ్గట్టుగా ఈ సారి బీజేపీ టికెట్లు రెండు చోట్ల తీసుకొచ్చుకున్నారన్న అభిప్రాయం కొందరిలో వ్యక్తం అయింది. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై గెలిచినట్టయితే ఆయన అక్కడికే ప్రాధాన్యత ఇస్తారని దీంతో హుజురాబాద్ నుండి గెలిచినా రాజీనామా చేస్తారన్న చర్చ కూడా స్థానికంగా సాగింది. దీంతో గత ఎన్నికల్లో ఓడిపోయిన కౌశిక్ రెడ్డికి అనుకూలంగా ఉండడమే మంచిదన్న నిర్ణయానికి హుజురాబాద్ వాసులు వచ్చినట్టు స్పష్టం అవుతోంది. మరోవైపున కౌశిక్ రెడ్డికి సమీప బంధువులు, వైరం ఉన్న వీణవంకకు చెందిన యుప్ టీవీ అధినేత పాడి ఉదయానంద రెడ్డిని తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకున్నప్పటికీ లాభం లేకుండా పోయింది. అంతేకాకుండా బీసీ అభ్యర్థిని సీఎంగా చేస్తామని బీజేపీ అధిష్లానం ప్రకటించిన నేపథ్యంలో తనకే అవకాశం దక్కుతుందన్న సంకేతాలు కూడా పంపించినా ఆయన మాటలను విశ్వసించలేదు ఇక్కడి ఓటర్లు. బీజేపీ బలహీనంగా ఉండడం ఒక ఎత్తైతే… ఇటీవలే బీజేపీలో చేరిన ఆయన్ని సీఎం చేయడం అసాధ్యమని అనుకున్న వారూ లేకపోలేదు. ఉప ఎన్నికల్లో చూపించినట్టుగానే ఇఫ్పుడు కూడా తనకు హుజురాబాద్ ఓటర్లు అండగా నిలబడ్తారన్న ఊహించుకున్న రాజేందర్ వాస్తవికతను గుర్తించలేకపోయారన్నది నిజం. తన గెలుపు నల్లేరుపై నడకేనని భావించిన ఈటల రాజేందర్ మంత్రాంగం నెరిపినట్టుగా వ్యవహరించారే తప్ప ఈ సారి మాత్రం హుజురాబాద్ ప్రజల మనసులను మాత్రం దోచుకోలేకపోయారు. ఆయన సతీమణి జమున కూడా కార్యరంగంలోకి దూకి అన్నీ తానై వ్యవహరించినప్పటికీ ఆమెను రిసీవ్ చేసుకోవడంలో కూడా ఇక్కడి ప్రజలు అంతగా ఆసక్తి చూపలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అత్యున్నత స్థాయికి చేరిన నేతనన్న భావనకు రావడమే కాకుండా ఇటీవల కాలంలో ఆయనతో పాటు ఆయన వెంట ఉంటే బృందం కూడా హుజురాబాద్ ప్రాంత వాసులతో అంతగా టచ్ లో లేకుండా పోవడం కూడా నష్టాన్ని చూపించింది. బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ క్యాడర్ ను విస్మరించి తన కోటారికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వడం కూడా మరో మైనస్ అని చెప్పవచ్చు.