ప్రణభ్ కూతురు ఆరోపణలతో మరోసారి…
దిశ దశ, న్యూ ఢిల్లీ:
కాంగ్రెస్ పార్టీని ఓ అపవాదు నేటికీ వెంటాడుతూనే ఉంది. పార్టీతో అనుబంధం పెనవేసుకుని మరణించిన వారి పట్ల ఏఐసీసీ అదిష్టానం వ్యవహరించిన తీరు గురించి మరోసారి చర్చనీయాంశంగా మారింది. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు చేసిన ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది.
పివి విషయంలో…
భారత ఆర్థిక పితామహుడు, దేశాన్ని ఐదేళ్ల పాటు పాలించిన గాందేతర కుంటుంబానికి చెందిన తొలి వ్యక్తి పివి నరసింహ రావు విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యవహరించిన తీరు అందరినీ విస్మయపరిచింది. నెహ్రూ నుండి సోనియా గాంధీ వరకు ఆ కుటుంబం వెన్నంటి నడిచిన పివి నరసింహ రావు మరణించిన తరువాత ఆయన పార్థివ దేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి అనుమతించని విషయం ఆ పార్టీపై నేటికీ మాయని మచ్చగానే మిగిలింది. సోనియా గాంధీ అభ్యంతరం చెప్పారన్న కారణంతో న్యూ ఢిల్లీలో అంత్యక్రియలు కూడా జరపకపోవడంతో హైదరాబాద్ కు శవాన్ని తరలించాల్సి వచ్చింది. అయితే కారణాలు ఏమైనా… గాంధీ కుటుంబం మాత్రం పివి విషయంలో చూపిన వివక్ష నేటికీ చర్చనీయంశగానే మారింది. మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని మాత్రం ఏఐసీసీ కార్యాలయానికి తరలించాలని ఏఐసీసీ నిర్ణయించడంతో పివిని విస్మరించిన విషయం తెరపైకి వచ్చింది.
శర్మిష్ఠ ఆరోపణలు…
అయితే బారత రాష్ట్రపతిగా పని చేసిన ప్రణబ్ ముఖర్జీ విషయంలో కూడా ఏఐసీసీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న ఆరోపణల్లో కాంగ్రెస్ పార్టీ చిక్కుకుంది. ఆయన కూతురు శర్మిష్ఠ ముఖర్జీ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన వారికి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (CWC) సంతాపం తెలిపే ఆనవాయితీ లేదని ప్రణబ్ చనిపోయినప్పుడు ఓ కాంగ్రెస్ నాయకుడు చెప్పారని ఆమె వివరించారు. అయితే కేఆర్ నారాయణన్ చనిపోయినప్పుడు సీడబ్లుసీ సంతాప తీర్మాణం చేసిందని, ఈ తీర్మాణాన్ని ప్రణబ్ ముఖర్జీనే రాశారని శర్మిష్ఠ తెలిపారు. ఈ విషయంలో తనను కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టించిందని ఆమె కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గప్పించారు. ఇంతకాలం ఒక్క పివి నరసింహరావు విషయంలోనే కాంగ్రెస్ పార్టీ వివక్ష చూపిందన్న ఆరోపణలు ఉండగా, తాజాగా శర్మిష్ఠ ముఖర్జీ చేసిన ఆరోఫణలతో ఆ పార్టీ మరో అపవాదును మూటగట్టుకున్నట్టయింది.