Telangana politics: ‘‘గండి’’ పూడ్చుకున్నట్టేనా..?

ఆ ఇద్దరి అరుదైన కలయిక…

తెలంగాణ రాజకీయాల్లో మరో హైలెట్…

దిశ దశ, కరీంనగర్:

ఒకప్పుడు ఒకే పార్టీలో కొనసాగిన ఆ ఇద్దరు ఏక కాలంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. పార్టీలో పట్టు నిలుపుకునేందుకు పావులు కదిపారు. అభిప్రాయ బేధాలు నెలకొన్న ఆ ఇద్దరిలో ఒకరు నేరుగా లోకసభలోకి అడుగు పెట్టగా మరోకరు కరీంనగర్ మునిసిపాలిటీకి ప్రాతినిథ్యం వహించారు . ఏ మాత్రం అవకాశం చిక్కినా తమ ఆదిపత్యాన్ని ప్రదర్శించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. వీరిద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్ తో ఒకరినొకరు కలుసుకోవడం కల్లా అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా  ‘వాకర్స్’ అసోసియేషన్ ఆ ఇద్దరిని కలిపింది.

ఇద్దరి నేపథ్యం…

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో పొన్నం ప్రభాకర్, యాదగిరి సునీల్ రావుల భూమిక కీలకంగానే ఉండేది. అయితే NSUI రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన పొన్నం ప్రభాకర్ మార్క్ ఫెడ్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించి ఎంపీగా ఎన్నికయ్యారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన సునీల్ రావు కౌన్సిలర్ గా వ్యవహరిస్తూనే మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా కూడా పని చేశారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత నెలకొన్న పరిణామాల దృష్ట్యా పొన్నం లోకసభకు కానీ, శాసనసభకు కానీ మరోసారి అడుగుపెట్టలేకపోయారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సునీల్ రావు గులాభి కండువా కప్పుకుని కరీంనగర్ మేయర్ పదవిని అందుకున్నారు. పొన్నం సాదాసీదా కాంగ్రెస్ నాయకునిగా వ్యవహరించాల్సి వచ్చిన నేపథ్యంలో కరీంనగర్ లో ఆయనకు ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో పొన్నం ప్రభాకర్ తన దృష్టిని హుస్నాబాద్ వైపు మరల్చి అక్కడి నుండి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే వేర్వేరు పార్టీలో ఉన్న ఈ నేతలు ఇద్దరు ఒకే వేదికపై కలుసుకున్న సందర్భాలు అయితే కనిపించలేదు అనూహ్యంగా ఆదివారం హుస్నాబాద్ పట్టణ సమీపంలోని మహా సముద్రం గండిలో వీరిద్దరు కలుసుకున్నారు. కశ్మీర్ గడ్డ వాకర్స్ అసోసియేషన్ ఆవిర్భవించి 24 ఏళ్లు అవుతున్న నేఫథ్యంలో గెట్ టు గెదర్ కోసం గ్యాదర్ కావాలని నిర్ణయించారు. ఈ అసోసియేషన్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ కు, మేయర్ సునీల్ రావులకు అనుబంధం ఉండడంతో వీరిని కూడా ఆహ్వానించారు నిర్వాహాకులు. ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ తన నియోజకవర్గంలో సహజ సిద్దంగా ఉన్న మహా సముద్రం గండిలో కార్యక్రమం ఏర్పాటు చేద్దామని సూచించడంతో ఆదివారం కరీంనగర్ కశ్మీర్ గడ్డ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అందరూ అక్కడకు వెల్లారు. దీంతో వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో పాటు ఒకరినొకరు సన్మానించుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఇంతకాలం ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ కు తెరపడినట్టేనా అన్న చర్చ కూడా మొదలైంది రాజకీయ వర్గాల్లో.

చాలాకాలం తరువాత…

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత కొన్ని కార్యక్రమాల్లో కనిపించిన మేయర్ సునీల్ రావు ఇటీవల కాలంలో గులాభి పార్టీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని టాక్. అంతకు ముందు మీడియా సమావేశాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ని ఏకీ పారేసిన సునీల్ రావు ఆయనను పలుమార్లు కలవడంపై బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సునీల్ రావు బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారా అన్న చర్చ కూడా ఆయా పార్టీల్లో సాగింది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులకు సునీల్ రావు టచ్ లోకి వెళ్లాడని, వారి ద్వారా జిల్లా మంత్రులతో కొన్ని ప్రతిపాదనలు పెట్టించాడన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే సునీల్ రావు మంత్రి పొన్నం ప్రభాకర్ వద్దకు వెల్లేందుకు వాకర్స్ అసోసియేషన్ సభ్యుల కలయికను తనకు అనుకూలంగా మల్చుకునే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సునీల్ రావు పట్ల సానుకూలత ప్రదర్శిస్తున్నట్టు ఆయన మాటల్లో కనిపిస్తోందని అంటున్న వారూ లేకపోలేదు.

కారణమేంటో..?

బీఆర్ఎస్ పార్టీని సునీల్ రావు వీడే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు బాహాటంగా చర్చించుకుంటున్నాయి. పార్టీ నేతలతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న సునీల్ రావు మొదట బీజేపీలోకి చేరేందుకు పావులు కదిపారన్న చర్చలు పెద్ద ఎత్తున సాగాయి. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏపీ నేత ఒకరి ద్వారా సునీల్ రావు సొంత గూటికి చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వనీయంగా తెలిసింది. తన విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సానుకూలత ప్రదర్శించాలని భావించిన సునీల్ రావు ఆ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారని వినిపిస్తోంది. కశ్మీర్ గడ్డ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధుల కలయిక కార్యక్రమం ద్వారా మంత్రి పొన్నం తనపట్ల సానుకూలంగా ఉన్నారన్న సంకేతాలు పంపించేందుకు సునీల్ రావు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంలో సునీల్ రావుకు క్లియరెన్స్ వచ్చినట్టేనా అని కూడా అంటున్నవారూ లేకపోలేదు. రానున్న మునిసిపల్ ఎన్నికలే లక్ష్యంగా సునీల్ ఇప్పటి నుండే పావులు కదిపి తనదైన స్టైల్ పాలిటిక్స్ కు తెరలేపారని, వచ్చే ఎన్నికల్లో కూడా మేయర్ గా బాధ్యతలు నిర్వర్తించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏది ఏమైనా సునీల్ రావు వేస్తున్న ఎత్తులు మాత్రం కరీంనగర్ అంతటా చర్చనీయాంశంగా మారాయి.

You cannot copy content of this page