కౌశిక్ రెడ్డి తీరు తలనొప్పిగా మారిందా..?
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ ఉమ్మడి జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారా..? సమీక్షా సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చలు ఆయన కేంద్రీకృతంగానే సాగుతున్నాయా..? అటు పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ… కుటుంబ వ్యవహారం మూడింటితో ముడిపడడంతో ఆయన కొంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టుగా అనిపిస్తోంది.
ఇంటా బయట…
ఆదివారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన రివ్యూ సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై ఇంటా బయటా రచ్చ రచ్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శించడం మొదలు పెట్టింది. ఇప్పటికే కౌశిక్ రెడ్డిపై కలెక్టరేట్ సమీక్షా సమావేశంలో జరిగిన ఘటనకు సంబంధించి మూడు కేసులు నమోదు కాగా ఇతరాత్ర అంశాలకు సంబంధించిన మరో రెండు కేసులు నమోదు అయినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కౌశిక్ రెడ్డి తీరును దుయ్యబడుతున్నారు. పలుచోట్ల ఆయన వైఖరిని నిరసిస్తూ ఆందోళనలు కూడా చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీపై ఎదురు దాడికి దిగుతున్నారు. అయితే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా రివ్యూ మీటింగ్ వ్యవహారంపై సోమవారం స్పందించారు. ఇంఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు తాము సమావేశానికి వెళ్లామని అయితే అక్కడ జరిగిన గొడవ విషయంలో ఇంచార్జి మంత్రి చొరవ తీసుకోలేదన్న రీతిలో కామెంట్ చేశారు. ముగ్గురు మంత్రులు ఇదే సమావేశంలో ఉన్నప్పటికీ కౌశిక్ రెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. అంతేకాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడి సద్దుమణిగేలా చొరవ తీసుకున్నట్టయితే బావుండేదని, కేసులు పెట్టడం సరికాదని కామెంట్ చేశారు గంగుల కమలాకర్. మరో వైపున కాంగ్రెస్ పార్టీలో కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసిన వెంటనే ఇంఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకుని నిలువరిస్తే బావుండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారిక సమావేశంలో రచ్చ జరుగుతున్నా కౌశిక్ రెడ్డిని కట్టడి చేసే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా తీసుకోలేకపోయారన్న వాదనలు కూడా వినిపిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌశిక్ రెడ్డి సోదరుని వరస కావడంతో ఆయనే ముందు అభ్యంతరం వ్యక్తం చేసినట్టయితే బావుండేదని అంటున్న వారూ లేకపోలేదు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే బావుండేదన్న వ్యాఖ్యలు వినిపించిన వెంటనే రాజకీయాలకు ఇక్కడ చోటు లేదని సంక్షేమ పథకాల గురించే మాట్లాడాలని కుండబద్దలు కొట్టినట్టయితే ఇంత దూరం వచ్చేది కాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఇబ్బందికర పరిస్థితేనా..?
కౌశిక్ రెడ్డి తన కుటుంబానికి చెందిన వాడు కావడంతో అతన్ని గట్టిగా మందలించలేకపోయారన్న అపవాదును ఉత్తమ్ కుమార్ రెడ్డి మూటగట్టుకున్నట్టయిందని వినిపిస్తోంది. అయితే ప్రత్యర్థి పార్టీకి చెందిన సభ్యుడు అయినందను కౌశిక్ రెడ్డి ఆ స్థాయిలో విరుచకపడడానికి ప్రధాన బలం ఉత్తమ్ కుమార్ రెడ్డేనని అంటున్న వారూ లేకపోలేదు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కూడా ఉత్తమ్ చొరవ తీసుకోకపోవడాన్ని తప్పు పట్టారు. దీంతో అటు కౌశిక్ రెడ్డిపై కేసుల పరంపరంను ఆపలేక, ఇటు పొలిటికల్ పార్టీ లీడర్ల నుండి వస్తున్న ప్రతికూల వ్యాఖ్యలను కవర్ చేసుకోలేక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవలసి రాక తప్పడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.