స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తీరుపై విస్మయం…
దిశ దశ, హైదరాబాద్:
నిఘా విభాగం పరిధిలో ఏర్పాటు చేసిన ఎస్ఐబీలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఆధ్వర్యంలో అధికారులు ఎంతమంది ఉండాలి..? అత్యంత రహస్య సమాచారం సేకరించే ఈ విభాగంలో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యానికి ఏ మాత్రం అవకాశం ఉండొచ్చా..? కేవలం నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు మాత్రమే ఏర్పాటు చేసిన ఈ విభాగంలో మావోయిస్టుల ఉనికే లేని ఈ సమయంలో పెద్ద మొత్తంలో అధికారులను, ప్రైవేటు వ్యక్తులను నియమించుకోవడానికి అసలు కారణం ఏంటీ..? ఇప్పుడిదే ప్రశ్న దర్యాప్తు అధికారులను, యావత్ పోలీసు విభాగాన్ని వెంటాడుతోంది.
ఎస్ఐబీ…
1990వ దశాబ్దంలో నక్సల్స్ కార్యకలాపాలు తీవ్రంగా ఉన్న సమయంలో ఇంటలీజెన్స్ వింగ్ కు అనుభందంగా స్పెషల్ ఇంటలీజెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి పీపుల్స్ వార్ నక్సల్స్ కార్యకలాపాలతో రాష్ట్రంలోని ప్రభావిత ప్రాంతాలు అట్టుడికిపోతుండేవి. నక్సల్స్ కార్యకలాపాలు ఏ స్థాయిలో ఉండేవంటే… హైదరాబాద్ నడిబొడ్డున పోలీసు అధికారులను హతమార్చడం, ఏకంగా హోంమంత్రి మాధవరెడ్డి ప్రయాణిస్తున్న కారును హైదరాబాద్ హైవేపై పేల్చడం వంటి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు నక్సల్స్. వరంగల్ తో పాటు, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మంతో పాటు ఇతర పూర్వ జిల్లా కేంద్రాలు కూడా నక్సల్స్ కదలికలతో భయానక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడేవి. పోలీసుల కళ్లుగప్పి అటవీ గ్రామాల్లో అయినా పట్టణాల్లో అయినా విధ్వంసాలకు పాల్పడడం అత్యంత సాధారణంగా జరిగేది. అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో నక్సల్స్ ఏరివేత కోసం కేవలం శాంతిభద్రత పరిరక్షణలో పనిచేస్తున్న పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వూ బలగాలు మాత్రమే పనిచేస్తే సరిపోదని… ఆపరేషన్లు నిర్వహించేందుకు ప్రత్యేకంగా పోలీసులను తీర్చిదిద్దాలని గ్రే హౌండ్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నక్సల్స్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు కనిపెట్టేందుకు ప్రత్యేకంగా ఎస్ఐబీని ఏర్పాటు చేశారు. ఇంటలీజెన్స్ వింగ్ అధికారుల కనుసన్నల్లో నడిచే ఈ విభాగం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని నక్సల్స్ కట్టడి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రచారంలో ఉంది.
అత్యంత క్లిష్ట సమయంలో…
నక్సల్స్ తిరుగులేని పట్టు బిగించి కొన్ని ప్రాంతాలను కంచుకోటలుగా మార్చుకున్న సమయంలో కూడా ఎస్ఐబీలో నామమాత్రంగానే పోలీసు అధికారులను నియమించి మానిటరింగ్ చేసేవారు. ఆ తరువాత నక్సల్స్ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయినప్పటికీ పొరుగునే ఉన్న మహారాష్ట్ర, చత్తీస్ గడ్, ఒడిశాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఈ నేఫథ్యంలో మావోయిస్టులు తిరిగి తెలంగాణాలోకి ఎంట్రీ ఇస్తారన్న కారణంతో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ నక్సల్స్ కార్యకలాపాలను నిరోధించేందుకు ఎస్ఐబీ దోహదపడుతుందని భావించి అలాగే కొనసాగిస్తున్నారు. నక్సల్స్ కార్యకలాపాలు తెలంగాణాలో సమూలంగా తగ్గిపోయి కేవలం సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేయాల్సిన ఆవశ్శకత తెలంగాణ పోలీసులపై పడింది. అయితే అప్పుడు రాష్ట్రంలోని చాలా చోట్ల నక్సల్స్ కార్యకలాపాలు కొనసాగినప్పుడు కూడా ఈ స్థాయిలో అధికారులను నియమించుకోలేదు. కానీ ఇటీవల ఎన్నికలకు ముందు మాత్రం భారీగా ఈ విభాగానికి యంత్రాంగాన్ని ఎందుకు అలాట్ చేయించుకున్నారన్నదే అంతుచిక్కకుండాపోతోంది. అసలు నక్సల్స్ కార్యకలాపాలు ఏమాత్రం లేని ఈ సమయంలో సుమారు 50 మందిని స్పెషల్ ఆపరేషన్ కోసం వినియోగించుకోవడానికి కారణాలు ఏంటీ అన్నదే అంతుచిక్కకుండా పోయింది. సాధారణంగా ఇంటలీజెన్స్ వింగ్ లో అడిషనల్ డీజీ స్థాయి నుండి కానిస్టేబుల్ వరకు పనిచేస్తుంటారు. అసెంబ్లీ నియోజకవర్గాల విస్తీర్ణం, జనాభాను బట్టి 10 మంది వరకు ఫీల్డ్ స్టాఫ్ ను నియమించుకునే విధానం నడుస్తోంది. వీరిపై మానిటరింగ్ చేసేందుకు ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు, ఆర్ఐఓలు, ఎస్పీలు కూడా ఉంటారు. ఎన్నికల సమయంలో పొలిటికల్ వింగ్ ద్వారా లోతుగా సమాచారం సేకరించేందుకు మరింత కూపీ లాగే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ వింగ్ కు ఎన్నికల సమయంలో ఎక్కువ సంఖ్యలో యంత్రాంగం అవసరం పడుతుంటుంది. కానీ నక్సల్స్ కార్యకలాపాలపై ఆరా తీసేందుకు వారి మూవ్ మెంట్ కూడా అంతగా లేని ఈ సమయంలో అంతమందిని ఎలా డిప్యూట్ చేసుకున్నారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
అటాచ్డ్ చేసిందెవరూ..?
సుమారు 50 మందిని ఎస్ఐబీ ఎస్ఓటీ వింగ్ కోసం నియమించుకున్నారని ఇందులో సగానికి పైగా పోలీసు అధికారులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అసలు నక్సల్స్ కార్యకలాపాలను లేని సమయంలో అంతమందిని ఈ వింగ్ కోసం అటాచ్డ్ చేయడం వెనక ఆంతర్యం ఏంటీ..? గతంలో ఏనాడైనా ఇంతమందిని వినియోగించారా.? నక్సల్స్ కార్యకలాపాలు తీవ్రంగా ఉన్నప్పుడు పలుమార్లు ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ఎస్ఐబీ కోసం ఎంతమంది పోలీసు అధికారులను డిప్యూట్ చేసుకున్నారు అన్న విషయంపై కూడా ఆరా తీయాల్సిన అవసరం ఉంది. కూంబింగ్ ఆపరేషన్లు చేసేందుకు ప్రత్యేకంగా బలగాలు ఉన్నప్పుడు ఇంతపెద్ద మొత్తంలో పోలీసు అధికారులను ఈ వింగ్ కు డిప్యూట్ చేసుకోవడం వెనక దాగి ఉన్న అసలు కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది. వీరందరిని ప్రణిత్ రావు వినియోగించుకున్నాడన్న ప్రచారం సాగుతున్నప్పటికీ అంతమందిని ఆయన స్వయంగా పిలిపించుకుని తన వింగ్ లో జాయిన్ చేసుకునే అవకాశం ఉంటుందా..? ఇందుకు సంబంధిత అధికారులు కూడా సమ్మతించాల్సి ఉంటుంది కదా..? తన పై అధికారులను ప్రణిత్ రావు శాసించే అవకాశం ఉంటుందా..? వారికన్నా పై స్థాయి అధికారులు చెప్తేనే తమ పరిధిలో ఉన్న అధికారులను అటాచ్డ్ చేసే అవకాశం ఉంటుంది కదా అన్న చర్చ మొదలైంది. ఎస్ఐబీ ఎస్ఓటీ వింగ్ కు అటాచ్డ్ చేసిన పోలీసు యంత్రాంగం అంతా కూడా ప్రణిత్ రావు కంట్రోల్ కు వెళ్లకముందు అసలేం జరిగింది అన్న కోణంలో విచారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ప్రణిత్ రావే స్వయంగా వారందరిని డిప్యూట్ చేసుకున్నట్టయితే డీఎస్పీ స్థాయిలో ఉన్న ఆయనకు ఆ స్వేచ్ఛను కల్పించిందెవరూ..? తమ సబార్డినేట్ చెప్పగానే పోలీసు అధికారులు తమవద్ద పనిచేస్తున్న తమ కింది స్థాయి అధికారులను ఎలా అటాచ్డ్ చేస్తారు..? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అసలు వీరందరిని అధికారికంగానే ఎస్ఐబీకి అటాచ్డ్ చేశారా లేక మౌఖిక అధేశాలతోనే పంపిచారా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. ఓరల్ ఇన్సట్రక్షన్స్ తో వారిని డిప్యూట్ చేసినట్టయితే వారంతా ఏఏ విధుల్లో ఉన్నట్టు అధికారికంగా చూపించారు..? ఒకవేళ అనధికారికంగా డిప్యూట్ చేస్తే అక్కడ పనిచేస్తున్నప్పుడు సదరు పోలీసు అధికారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లినట్టయితే అందుకు బాధ్యులెవరోనన్నది వారికే తెలియాలి.
ప్రైవేటు వ్యక్తులా..?
మరో వైపున ఈ వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యాన్ని ఎలా స్వాగతించారు. వారంతా నిఘా విభాగం, ఎస్ఐబీ వింగ్ లో జరుగుతున్న అంతర్గత విషయాలను లీక్ చేస్తే శత్రవుల చేతికి కీలక విషయాలు చిక్కే అవకాశం ఉంటుంది కదా. దీనివల్ల అసాంఘీక శక్తులు కూడా తమకు అనుకూలంగా మల్చుకునే ప్రమాదం ఉంటుంది కదా. అత్యంత కీలకమైన విభాగంలో వీరిని ఎలా నియమిస్తారు అన్నది కూడా మిస్టరీగా మారిపోయింది.