ఫోన్ ట్యాపింగ్ కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరించారా..?

హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినప్పుడు ఎవరూ లేరా..?

ప్రైవేటు టీమ్ తో కార్యకలాపాలు సాగించడం వెనక…

దిశ దశ, హైదరాబాద్:

నిఘా విభాగం పరిధిలో ఉండాల్సిన రహస్య వ్యవహారాల్లో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఎలా అనుమతించారు..? ఎస్ఐబి ఎస్ఓటీ డీఎస్పీ ప్రణిత్ రావుచే ట్యాపింగుకు పాల్పడేందుకు ప్రోత్సహించిందెవరూ..? క్రమ శిక్షణకు కేరాఫ్ గా నిలిచే పోలీసు విభాగంలో అత్యుత్సహం ప్రదర్శించడం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ స్థాయిలో సాధ్యమా..? ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉన్న విభాగంలో అంత స్వేచ్ఛ ఉంటుందా..? ఇప్పుడిదే టాపిక్ పోలీసు వర్గాలతో పాటు రాష్ట్రంలోని పలువురి నోళ్లలో నానుతోంది.

అంతా మా ఇష్టమేనా..?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో డీఎస్పీ ప్రణిత్ రావు ఇష్టారీతిన వ్యవహరించారని ఎస్ఐబిలోనే రెండు గదుల్లో సపరేట్ గా మానిటరింగ్ చేశారని ఇందుకు తనకు సంబంధించిన వ్యక్తులను పురమాయించుకున్నారని పోలీసు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫలితాల తరువాత ఈ గదుల్లో రికార్డ్ అయి ఉన్న హార్డ్ డిస్కులతో పాటు డాక్యూమెంట్లను ధ్వంసం చేశాడని కూడా అంటున్నారు. అయితే ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉండే ఇంటలీజెన్స్ వింగ్ కు అనుభందంగా ఉన్న ఎస్ఐబిలో డీఎస్పీ స్థాయి అధికారి డిసిప్లేన్ తప్పి ఇష్టారీతిన వ్యవహరిస్తారా అన్నదే పజిల్ గా మారింది. ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఈ వింగ్ లో పనిచేస్తున్నప్పుడు ఓ డీఎస్పీ తనకు ఇష్టం వచ్చినట్టగా వ్యవహరించి ఉండే అవకాశమే లేదన్నది వాస్తవం. అయితే ప్రణిత్ కుమార్ మాత్రమే ఈ వ్యవహారంలో తల దూర్చి తనకు నచ్చిన విధంగా చేసుకుంటూ పోతుంటే ఆయన అలా వ్యవహరించినప్పుడు కట్టడి చేయాల్సిన అధికారులు ఎందుకు చొరవ తీసుకోలేదు. గోప్యత పాటించాల్సిన అంశాలను సేకరించే ఇంటలీజెన్స్ వింగ్ లో డీఎస్పీ నిజంగానే అత్యుత్సాహం ప్రదర్శించినట్టయితే డీజీపీ దృష్టికి తీసుకరావడంలో విఫలం అయ్యారా..? లేక ఆయనకు వెన్నుదన్నుగా అంతకన్నా ముఖ్యమైన వారు నిలిచారా అన్న విషయం తేలాల్సి ఉంది. ప్రధానంగా ఎన్నికల ఫలితాల తరువాత హార్డ్ డిస్కులను ధ్వంసం చేస్తుంటే ప్రణిత్ రావును ఎస్ఐబిలో పనిచేస్తున్న ఇతర అధికారులు ఎందుకు కట్టడి చేయలేకపోయారు..? ఈ విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంలో విఫలం అయ్యారా..? ఈ విషయం ప్రభుత్వానికి ఆలస్యంగా తెలియడానికి కారణం ఏంటన్నది మిస్టరీగానే మారిపోయింది. మరో వైపున ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన వివరాలను పెన్ డ్రైవ్ లలో తీసుకెళ్లాడని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ పెన్ డ్రైవ్ లు ఎక్కడకు చేరాయి.? పోలీసు విబాగంలోని ఉన్నతాధికారులకు చేరవేశారా..? లేక ప్రైవేటు వ్యక్తులకు అందించారా లేక తనవద్దే స్టోర్ చేసి పెట్టుకున్నారా అన్నది కూడా అంతు చిక్కకుండా పోతోంది. అంతేకాకుండా కాన్ఫిడెన్షియల్ రికార్డులు పెన్ డ్రైవ్ లలో డీఎస్పీ ప్రణిత్ రావు తీసుకెల్తుంటే ఎస్ఐబీలో కానీ ఇంటలీజెన్స్ లో కానీ పనిచేస్తున్న ఇతర అధికారులు ఎందుకు కట్టడి చేయలేకపోయారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

ఇతర ప్రాంతాల్లోనూ…

పోన్ ట్యాపింగ్ కోసం కేవలం ఎస్ఐబీ కార్యాలయమే కాకుండా రాష్ట్రంలోని పలు చోట్ల కూడా ప్రైవేటు ఆఫీసులు కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా పోలీసు ఉన్నతాధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లోని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులకు సంబంధించిన ఫోన్లను ట్యాపింగ్ చేశారని కూడా అనుమానిత వ్యక్తులకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు సేకరించేందుకు ప్రత్యేకంగా ప్రైవేటు సైన్యాన్ని పురామాయించి ప్రైవేటు అడ్డాల్లో ఈ వ్యవహారాన్ని కొనసాగించినట్టుగా పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అదెలా సాధ్యం…

ఒక ప్రైవేటు వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేయడం రాజ్యంగ విరుద్దమైన చర్యగా స్ఫష్టం అవుతోంది. దేశ ద్రోహం, రాజ ద్రోహం వంటి నేరాలకు సంబంధించిన వారి గురించి మాత్రమే ఆరా తీసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే తెలంగాణాలో మాత్రం ఇష్టం వచ్చినట్టుగా ఫోన్ ట్యాపింగ్ కు ఎలా పాల్పడ్డారన్నదే అంతుచిక్కడం లేదు. మరో వైపున సొంత రాష్ట్రానికి చెందిన వారి ఫోన్లను అబ్జర్వేషన్ లో ఉంచుతూ ట్యాప్ చేయాలంటే చీఫ్ సెక్రకటరీ లేఖ రాసిన తరువాతే టెలికాం సర్వీసుల నుండి ఓ లింక్ వస్తుందని తెలుస్తోంది. ఆ లింక్ ద్వారా 15 ఫోన్లను ట్యాప్ చేసే వీలు ఉంటుందని తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో ఇంతమంది ఫోన్లను ట్యాప్ చేశారంటే ఇందుకు సీఎస్ లేఖలు రాశారా..? ఆ లేఖలతో సంబంధం లేకుండానే ట్యాపింగ్ చేశారా అన్న విషయంపై చర్చలు సాగుతున్నాయి. ఒకవేళ సీఎస్ లేఖ రాసినట్టయితే ఏ కారణం చూపుతూ నిఘా వర్గాలు కోరాయో కూడా అర్థం కాకుండా పోతోంది. సీఎస్ కు సంబంధం లేకుండానే ఈ తతంగం అంతా నడిపించినట్టయితే ఇందుకు చేదోడుగా నిలిచిన ఘనులు ఎవరోనన్నది కూడా తెలియాల్సి ఉంది. టెలికాం సర్వీసులు సీఎస్ లేఖ రాయకుండానే లింక్ పంపించినట్టయితే ఆయా సంస్థలకు సంబంధించిన వారు కూడా ఈ నేరంలో భాగస్వాములే అవుతారు.

You cannot copy content of this page