తల్లినే మరిచారా…? అటు వైపు కన్నెత్తి చూడని వైనం


దిశ దశ, కరీంనగర్:

తెలంగాణ అనగానే ముందుగా గుర్తుకు రావల్సింది ఆమె. ఆవిర్భావ దినోత్సవం నాడైనా కనీసం ఆమె వైపు కన్నెత్తి చూడకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఉద్యమ సమయంలో తెలుగు తల్లికి ధీటుగా తెలంగాణ తల్లిని తీర్చిదిద్ది ఊరువాడా అన్ని చోట్ల కూడా విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే కనీసం రాష్ట్ర ఆవిర్భావం రోజున అయినా ఆమెను పట్టించుకున్న వారే లేకుండా పోయారు. దీంతో రాష్ట్రంలోని చాలా చోట్ల కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు నిరాదరణకు గురయ్యాయి. ఆర్భాటంగా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహాలను పట్టించుకోకపోవడం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోయింది.

దశాబ్ది ఉత్సవాల బిజీలో…

శుక్రవారంతో 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పెద్ద ఎత్తున నిధులు కూడా కెటాయించి అధికారిక కార్యక్రమాలు చేపట్టారు. 20 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రకటించారు. దీంతో అటు అధికార యంత్రాంగం, ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా కూడా సంబరాలను నిర్వహిస్తున్నారు. అంబరాన్ని తాకే విధంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో తెలంగాణ తల్లి గురించి ఎవరూ పట్టించుకోకపోవడం విడ్డూరం. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా చేపట్టినా ఆ తల్లిని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. దీంతో చాలా చోట్ల కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు నిరాదరణకు గురయ్యాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు అయినందున కనీసం ఆ విగ్రహాలకు దండ వేసిన దాఖలాలు కూడా లేవు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం పరిస్థితి ఇలా ఉండగా రాష్ట్రంలోని చాలా విగ్రహాల పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉందని తెలుస్తోంది.

You cannot copy content of this page