ఇదేంటో తెలుసా… ?

ఆ ప్రాంతాల్లోనే కనిపిస్తుంది… దీపావళి ముందు రోజు మస్ట్…

దేశ విదేశాల్లో దీపావళి పండగ వచ్చిందంటే ఇండ్ల ముందు దీపాలు వెలిగించడం… టపాసులు కాల్చడం చూస్తుంటాం. ఆనవాయితీగా వచ్చే కేదారేశ్వరునికి నోముకునే సాంప్రాదాయాన్ని అవలంబించే వారినీ చూస్తుంటాం… కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ వైవిద్యమైన పద్దతిలో దీపావళి జరుపుకునే సంస్కృతి సాంప్రదాయాన్ని పాటిస్తుంటారు అక్కడి ప్రజలు. తరతరాలుగా అమలు చేస్తున్న ఈ ఆనవాయితీని నేటికీ అవలంబిస్తున్నప్పటికీ చాలా మందికి తెలియని విషయం ఇది. గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు శతాబ్దాలుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. కారణాలు ఏమైనా చాలా వైవిద్యంగా ఉండే ఈ తంతు మాత్రం నేటి తరం వరకూ అవలంబిస్తున్నారని చెప్పాలి. దండకారణ్య అటవీ ప్రాంతంగా పిలవబడే ప్రాంతాల్లో మాత్రమే ఆచరిస్తున్న ఈ ఆచారం గురించి తెలుసుకుందాం.

కోల…

దీపావళి ముందు రోజు అంటే భోగి పండగను చేసుకునే ఆనవాయితీ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే భోగికి ముందు రోజు రాత్రి, భోగి రోజు ఉదయం ఇంటిల్లిపాది అంతా కలిసి కోల తిప్పుకునే సాంప్రదాయం ఒకటి ఉంది. నది పరివాహక ప్రాంతంతో పాటు అడవులు విస్తరించి ఉన్న చోట మాత్రమే కోల తిప్పుకునే ఆచారాన్ని పాటిస్తున్నారు. కాగడాలను పొలినట్టుగా ఉండే కోల అంటే ఓ కట్టెను నాలుగు వైపులా విడగొట్టి మధ్యలో కట్టెపుల్లలను దింపుతారు. ఈ కట్టె పుల్లలు విడిపోకుండా ఉండేందుకు నాలుగు వైపులా చిల్చిన భాగం వైపునకు దిగువన చెట్టు నారతో గట్టిగా కడ్తారు. వీటిని తయారు చేసి విక్రయిస్తూ కొన్ని కుటుంబాలు ఉపాధి కూడా పొందుతుంటాయి. భోగి ముందు రోజు రాత్రి, వేకువ జామున రెండు సార్లు కూడా కోలలకు నిప్పంటించి ఇంటిల్లిపాది రోడ్డుపై కూర్చున్నప్పుడు వారిపై నుండి గుండ్రంగా తిప్పుతారు. కొత్తగా పెళ్లయిన జంటలు, అప్పుడే పుట్టిన బిడ్డలతో అయితే ఖచ్చితంగా ఈ పద్దతిని అమలు చేసే పద్దతి ఉంటుంది. ఆధునికత కారణంగా చాలా కుటుంబాలు కోలలను తిప్పే సాంప్రాదాయానికి స్వస్తి చెప్పినప్పటికీ నేటికీ ఇంకా కొన్ని కుటుంబాలు తమ పూర్వీకుల నుండి వచ్చిన ఇలాంటి ఆచార వ్యవహారాలను పాటిస్తూనే ఉన్నారు. గతంలో అణా పైసకు విక్రయించే ఈ కోల ఇప్పుడు రూ. 60 నుండి రూ. 80లకు విక్రయిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో కట్టెలను సేకరించి కోలలను తయారు చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన కొన్ని కుటుంబాలు వారి పూర్వీకుల నుండి నేర్చుకుని నేటికి కోలలను సిద్దం చేసి విక్రయిస్తున్నారు.

ఎందుకో మరి..?

అయితే నరకాసుర వధను పురస్కరించుకుని చేసుకునే వేడుక దీపావళి. ఈ సందర్భంగా దీనిని పర్వదినంగా భావించి పలు రకాలుగా తమ ఆనందాన్ని పంచుకునే సంస్కృతిని తరతరాలుగా చూస్తూనే ఉన్నాం. అయితే భోగి సందర్బంగా నిర్వహించే కోలలు తిప్పుకునే ఆచారం సందర్భంగా ‘కోల కోలరే కోల’ అంటుంటారు. కోలలను తమ చుట్టూ తిప్పుకోవడం వల్ల తమలోని భయం తొలగిపోయి ధైర్యం నిండుతుందని పూర్వీకులు చెప్తుండేవారని ఆయా ప్రాంతాల వాసులు అంటుంటారు. అలాగే దండకారణ్య అటవీ ప్రాంతం అంతా కూడా భయానక వాతావరణంలోనే ఉండేది. విషపూరితమైన జంతువులు, కీటకాల సంచారంతో నిండిపోయి ఉండేది. వన్య ప్రాణులు తరుచూ గ్రామాల్లోకి చొరబడి రావడం వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గమనించి కోలలను తిప్పుకునే వారని మరో కథనం కూడా వాడుకలో ఉంది. చలి కాలం కావడంతో మంటలతో ఉన్న కోలలను తిప్పుకోవడం వల్ల అన్ని రకాలుగా ఉపయుక్తంగా ఉండేదని కూడా చెప్తున్నారు. కోలలను తిప్పుకునే సాంప్రదాయం మాత్రం కేవలం గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జయశంకర్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని కొన్ని చోట్ల, చత్తీస్ గడ్ లోని భీజాపూర్, రాయ్ పూర్ వరకు కొన్ని చోట్ల ఈ సాంప్రదాయం విస్తరించింది. అయితే కాలనుగుణంగా వస్తున్న మార్పుల వల్ల కొన్ని ప్రాంతాల్లో ఈ విధానం కనుమరుగైనప్పటికీ ఇతర ప్రాంతాల్లోని నేటి తరం కూడా ఆచరిస్తున్నది.

You cannot copy content of this page