దిశ దశ, కరీంనగర్:
అహ నా పెళ్లంట సినిమాలో కోడిని కట్టి దాన్ని చూసుకుంటూ భోజనం చేస్తుంటాడు కోట శ్రీనివాస రావు… అచ్చంగా అలాంటి టైప్ సీనే కరీంనగర్ లో జరిగిందని ఓ పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమ నేత చేసిన బాసలు అన్నిఇన్ని కావంటున్నారు లోకల్ బాడీ ప్రజా ప్రతినిధులు. పార్టీకి అనుకూలంగా ఉండాలని, అధిష్టానం చెప్పినట్టు నడుచుకోవాలని పదేపదే చెప్తూ తమకు మాత్రం తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు. బలమైన నాయకుడిగా ఎదిగిన ఆయన మాట ఇస్తే అమలుకు నోచుకోవడం ఖాయమని నమ్మిన తాము ఇప్పుడు మిన్నకుండిపోవల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టూర్ల పేరిట…
నా అనుచరులుగా ఉన్న మీ అందరికీ సముచిత గౌరవం ఇస్తా… మిమ్నల్ని వివిధ దేశాలకు తీసుకెళ్తా… నా మాట నమ్మండి అంటూ పలుమార్లు చెప్పడంతో నిజమని నమ్ముకున్నా లాభం లేకుండా పోయిందని అంటున్నారు. తమ పదవి కాలం ముగిసిపోతున్నా ఆ మురిపెం మాత్రం తీరలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీమీ ప్రాంతాల్లో అభివృద్ది కోసం నిధులు మంజూరు చేయిస్తానని, అయితే ఇతరాత్ర ఆలోచనలకు దూరంగా ఉంటూ తనతో కలిసి నడవాలని సూచించడంతో తమ నేత ఇచ్చిన ప్రామిస్ మిస్ కాకుండా చూసుకుంటారని భావించి ఆయన చెప్పినట్టే నడుచుకున్నా లాభం లేకుండా పోయిందని వాపోతున్నారు. కొందరికి మాత్రమే అవకాశం ఇచ్చి తమను మాత్రం విస్మరించాడన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిగతా వారంతా.
మూడు సార్లు...
మూడు సార్లు అంతర్జాతీయ టూర్లు ఉంటాయని చెప్పి అందరి పాసుపోర్టులు కూడా కలెక్ట్ చేసుకుని చివరి నిమిషంలో వాయిదా వేశారు కానీ తమను మాత్రం గాలి మోటర్ ఎక్కించలేదని వాపోయారో ప్రజాప్రతినిధి. స్థానిక సంస్థల్లో తమ ద్వారా క్రెడిట్ దక్కించుకున్నా తమకు మాత్రం కనీసం విమానమెక్కే యోగం కల్పించలేదని, అయినప్పటికీ తమ నేతకు దూరం కాలేకపోయామన్నారు. తనకు నచ్చిన వారికి మాత్రం ప్రాధాన్యత ఇచ్చారే తప్ప సమన్యాయం పాటించలేదన్న ఆవేదన కూడా వెలిబుచ్చుతున్నారు. లోకల్ బాడీ ప్రజా ప్రతినిధుల్లో నాలుగు వర్గాలను పెంచిపోషించుకుంటూ తన పంథాన్ని నెగ్గించుకున్నారు కానీ తమను మాత్రం విస్మరించారని అంటున్నారు మరికొందరు. కనీసం విదేశాలకు వెల్లే యోగ్యం అయినా కల్పిస్తారనుకుంటే ఆ అదృష్టానికి కూడా నోచుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.