ఎంఐఎం… బీఆర్ఎస్ మధ్య సమన్వయం
ప్రగతి భవన్ లో కలిసిన మంత్రి గంగుల, గులాం ఆహ్మద్
దిశ దశ, కరీంనగర్:
నిన్నటి వరకు ఎడ మొఖం పెడ మొఖంగా వ్యవహరించిన ఆ ఇద్దరు నాయకులు ఒకే వేదికపై కలుసుకున్నారు. కరీంనగర్ లో నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరించిన ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్టుగా కనిపిస్తోంది ప్రగతి భవన్ లో జరిగిన చర్చల సందర్భంగా కరీంనగర్ బీఆర్ఎస్, ఎంఐఎం నాయకుల మధ్య విబేధాలకు పుల్ స్టాప్ పడినట్టేనా అన్న చర్చ సాగుతోంది.
అసద్ పిలుపుతో…
మంత్రి గంగుల కమలాకర్, ఎంఐఎం నేత గులాం ఆహ్మద్ హుస్సేన్ మధ్య కొన్ని నెలలుగా విబేధాలు బహిర్గతం అయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర స్థాయి నాయకులు కలుసుకుని పోతున్నా కరీంనగర్ నేతలు మధ్య మాత్రం కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. దీంతో ఎంఐఎం నాయకుడు గులాం ఆహ్మద్ కూడా తన పట్టు నిలుపుకునేందుకు ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేసే అవకాశాలు లేవన్న సంకేతాలు కూడా ఇచ్చినట్టయింది. కరీంనగర్ లో మాత్రం తాను బరిలో నిలుస్తానని, మంత్రి గంగుల ఓటమే లక్ష్యంగా పనిచేస్తానంటూ గులాం ఆహ్మద్ చెప్పిన సందర్భాలు కూడా లేకపోలేదు. కానీ అనూహ్యంగా గురువారం ప్రగతి భవన్ లో చోటు చేసుకున్న పరిణామాలతో అభిప్రాయ బేధాలకు చెక్ పడినట్టేనని భావిస్తున్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పిలపును అందుకున్న కరీంనగర్ నేత గులాం ఆహ్మద్ గురువారం హైదరాబాద్ కు వెల్లి ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. మంత్రి గంగుల కమలాకర్ కూడా వీరితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కరీంనగర్ కు సంబంధించిన 10 ప్రధాన సమస్యల పరిష్కారం అంశాన్ని కూడా గులాం ఆహ్మద్ ఈ సమావేశంలో లేవనెత్తినట్టుగా తెలుస్తోంది. వీటన్నింటికి కూడా క్లియరెన్స్ రావడంతో మంత్రి గంగుల కమలాకర్, ఎంఐఎం నాయకుడు గులాం ఆహ్మద్ ల మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలకు బ్రేకులు పడినట్టేనని భావిస్తున్నారు.