వినూత్న రాజకీయాల ఖిల్లా… జగిత్యాల జిల్లా

మూడు సెగ్మెంట్లలోనూ వైవిద్యతే…

దిశ దశ, జగిత్యాల:

అత్యంత చైతన్యవంతమైన జిల్లాల్లో ఒకటైన ఆ ప్రాంతంలోని పబ్లిక్ పల్స్ అబ్జర్వ్ చేస్తూ అక్కడి లీడర్స్ తమ విధానాలను మార్చుకుంటుంటారు. ప్రజా క్షేత్రంలో నిలదొక్కుకునేందుకు వారు వేసే స్కెచ్ లే డిఫరెంట్ గా ఉంటాయి. ఆ జిల్లాలోని రెండు సెగ్మెంట్ల ప్రజలను ఆకట్టుకోవాలంటే ఏం చేస్తే బావుంటుందోనన్న ఆలోచనల్లో నిత్యం అక్కడి నేతలు మునిగిపోతుంటారు. స్వరాష్ట్ర కల సాకారం అయిన తరువాత అక్కడ నెలకొన్న వైవిద్యమైన పరిస్థితులు అత్యంత విచిత్రంగానే ఉన్నాయి. జగిత్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో నెలకొన్న వాతావరణంపై ఓ లుక్కెద్దాం.

జగిత్యాలలో ఇలా…

2014 ఎన్నికలప్పటి నుండి కూడా ఇక్కడ పాలిట్రిక్స్ విచిత్రంగానే సాగుతున్నాయి. జగిత్యాలలో తనదైన ముద్ర వేసుకున్న సీనియర్ నేత టి జీవన్ రెడ్డి 2014 ఎన్నికల్లో సరికొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. తనకివే చివరి ఎన్నికలని ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ విస్తృతంగా ప్రచారం చేయడంతో సింపతి సంపాదించుకుని బలమైన వాదాంతో ఉన్న గులాభి పార్టీని మట్టికరిపించారు. అయితే 2018 ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి బరిలో నిలవడాన్ని అడ్వంటైజ్ గా తీసుకున్న అధికారపార్టీ అభ్యర్థి డాక్టర్ సంజయ్ రిటైర్మెంట్ తీసుకుంటానని సానుభూతి పొంది ఇప్పుడు ఎన్నికల్లో నిలబడడం ఏంటని ప్రచారం చేసి జగిత్యాల ప్రజల మనసు దోచేశారు. దీంతో తన ప్రత్యర్థి రాజకీయ కురువృద్దుడు టీ జీవన్ రెడ్డిని ఓడించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల్లో తనను ఆదరించాలని, 2028 ఎన్నికలకు తాను దూరంగా ఉంటానంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సరికొత్త పల్లవి అందుకున్నారు. దీంతో 9 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎత్తిన నినాదాన్ని రానున్న ఎన్నికల్లో డాక్టర్ సంజయ్ అందుకోవడం గమనార్హం.

లోకసభ ఎన్నికల్లో…

ఇకపోతే 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ బలమైన ప్రత్యర్థి కల్వకుంట్ల కవిత ఓటమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నిజామబాద్ లోకసభ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో తీవ్రమైన ప్రభావితం చేసే పసుపు రైతుల సమస్యను అందుకుని ముందుకు సాగారు. తనను గెలిపిస్తే పసుపు రైతుల కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయిస్తానని ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పై హామీ పత్రం రాయించి మరీ ఇచ్చాడు. దీంతో పసుపు రైతులంతా కూడా అరవింద్ కు అనుకూలంగా మారడంతో ఏకంగా ముఖ్యమంత్రి తనయ కవితను ఓడించగలిగారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో…

ఇకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇక్కడి ప్రజలకు నమ్మకం ఉంచేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కూడా హామీ పత్రం రాసి ఇవ్వాల్సి వచ్చింది. కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని మెట్ పల్లి మండలంలోని కొండ్రికర్ల, ఆరపేట గ్రామాల్లో పలు అభివృద్ది పనులు చేయిస్తానని ఈ మేరకు అధికార పార్టీ అభ్యర్థిని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించారు. అయితే తమ గ్రామాల నుండి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోడ్డు, వంతెనల నిర్మాణం చేపడితేనే తాము సమ్మతిస్తామని తేల్చి చెప్పడంతో ఈ మేరకు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కూడా హామీ పత్రం రాసి ఇవ్వాల్సి వచ్చింది.

ధర్మపురిదో స్పెషాలిటీ..!

దేశంలో ఎక్కడా లేని విధంగా నేలపై నృసింహ క్షేత్రం ఇక్కడే వెలిసింది. నవ నృసింహ క్షేత్రాలలో ఒకటైన ధర్మపురి నియోజకవర్గంలో రాజకీయాలు కూడా వైవిద్యంగానే సాగుతున్నాయి. ఇక్కడి నుండి పోటీ చేయాలని ఆశిస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులంతా కూడా స్థానికేతరులే కావడం విశేషం. సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీజేపీ నుండి టికెట్ ఆశిస్తున్న కన్నం అంజయ్య, వివేక్ లు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించని వారే కావడం విశేషం. మరోవైపున కొప్పుల, అడ్లూరిలిద్దరు కూడా రామగుండం కార్మిక క్షేత్రంలో నేతలుగా ఎదిగిన వారే కావడం మరో ప్రత్యేకత అని చెప్పాలి. ప్రధానంగా 2018 ఎన్నికల ఫలితాల్లో గోల్ మాల్ జరిగిందని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి హై కోర్టును ఆశ్రయించడంతో విచారణ కొనసాగుతోంది. కోర్టు ఆదేశాలతో స్ట్రాంగ్ రూం గదులను తెరవాలని ఆదేశించినప్పుడు తాళం చేతులు అదృశ్యం కావడంతో ఈసీఐ విచారణ కోసం ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని పంపించాల్సి వచ్చింది.

డిఫరెంట్ ఖిల్లా…

జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గంలో రిటైర్మెంట్ల నినదాలు కొనసాగుతుంటే, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో ప్రామిస్ లెటర్లు తంతు సాగుతుండగా, ధర్మపురి అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించడం గమనార్హం.

You cannot copy content of this page