ఏరివేతే కాదు… శవాల తరలింపులోనూ తప్పని కష్టాలు…

దండకారణ్యంలో బలగాల ఇక్కట్లు…

దిశ దశ, దండకారణ్యం:

శత్రు దుర్భేధ్యంగా ఉండే అభూజామడ్ అడవుల్లో మావోయిస్టుల ఏరివేత కోసం బలగాలు చేస్తున్న సాహసాలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపున సువిశాలమైన అభూజామఢ్ గుట్టలు, మరో వైపున కీకారణ్యాలు విస్తరించిన ప్రాంతం కావడంతో పాటు వాగులు వంకల్లో ఉధృతంగా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. పూర్వ బస్తర్ అటవీ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వం నిర్వహిస్తున్న మావోయిస్టుల ఏరివేత విషయంలో అష్టకష్టాలు ఎదుర్కొంటున్న బలగాలు లక్ష్యం వైపునకు పయనిస్తున్న తీరు బాహ్య ప్రపంచానికి అంతగా తెలియకపోవచ్చు.

ఎన్ కౌంటర్ ఘటనతో…

తాజాగా జరిగిన నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ అనంతరం బలగాలు తిరుగు ముఖం పట్టాయి. అయితే రహదారులు కూడా లేని ఆ ప్రాంతం నుండి శవాలను తరలించేందుకు మరో మార్గం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఎన్ కౌంటర్ లో మరణించిన నక్సల్స్ మృతదేహాలను కూడా బలగాలు తమ వెంట తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఇక్కడి అటవీ ప్రాంతం మీదుగా ప్రవహిస్తున్న ఇంద్రావతి నదిని దాటుతున్న జవాన్లు నక్సల్స్ డెడ్ బాడీస్ ను తమ భుజాలపై మోస్తూ తీసుకొస్తున్నారు. ఈ సన్నివేశాలకు సంబంధించిన ఫుటేజీని ఇక్కడి పోలీసు అధికారులు విడుదల చేశారు.

దండకారణ్యంలో…

శతాబ్దాల తరబడి ఇక్కడి అడువులతో మమేకమై జీవనం సాగిస్తున్న ఆదివాసీల్లో తిరుగులేని పట్టు సాధించిన మావోయిస్టులను ఏరివేయాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. లెఫ్ట్ వింగ్ ఎక్స్ర్ ట్రిమిస్ట్ (ఎల్ డబ్లూ ఈ)ను పూర్తిస్థాయిలో ఏరివేయాలని భావిస్తున్న నేపథ్యంలో బస్తర్ అటవీ ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బలగాలు పెద్ద సంఖ్యలో మోహరించాయి. వందకు పైగా బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయి. అయితే దేశంలోనే అత్యంత దట్టమైన అటవీ ప్రాంతాలుగా పేరుగాంచిన బస్తర్ అడవుల్లో ఆదిపత్యం చెలాయిస్తున్న నక్సల్స్ కోసం బలగాలు ఎదురుదెబ్బలు తిన్న సందర్భాలు చాలా ఉన్నాయి. బలగాలను మట్టబెట్టడంలో మావోయిస్టులు చాలా సార్లు సక్సెస్ అయ్యారు.కొన్ని నెలలుగా ఇక్కడి అటవీ ప్రాంతంపై పట్టు బిగించిన బలగాలు ఒక్కో అడుగు ముందుకు వేస్తు నక్సల్స్ ఏరివేతలో నిమగ్నం అయ్యాయి. రహదారులు కూడా లేని ఈ ప్రాంతంలోమావోయిస్టులను ఏరివేసేందుకు అడవుల్లో సంచరించే బలగాలు కేవలం నక్సల్స్ వల్ల ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడమే కాదు… ప్రాణాలకు తెగించి వాగులు, వంకలు దాటాల్సి ఉంటుంది. వేసవి కాలంలో అయితే నదుల్లో ప్రవహించే నీటి ఉధృతి అంతగా ఉండకపోయినప్పటికీ వర్షాకాలంలో అయతే వీరు పడే బాధలు వర్ణనాతీతం. వర్షపు నీటితో బురదమయం అయ్యే అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ వెల్లే కూంబింగ్ బలగాలు నదులను దాటేప్పుడు తమ ప్రాణాలను కాపాడుకుంటూ తమ భూజాన ఉన్న ఆయుధాలు సేఫ్ గా ఉండడంతో పాటు నీటిలో తడవకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. వరధ ఉధృతిలో కూంబింగ్ పార్టీలు నదులు, వాగులు దాటేప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే ముందుకు సాగుతుంటారు. గురువారం నారాయణ్ పూర్, దంతెవాడ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన నక్సల్స్ మృతదేహాలను తీసుకొచ్చేందుకు సెర్చింగ్ ఆపరేషన్ లో పాల్గొన్న బలగాలు చేస్తున్న సాహసానికి సంబంధించిన ఫుటేజీ బయటకు రావడంతో వారి ఇబ్బందులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఎన్ కౌంటర్లలో మరణించిన నకల్స్ మృతదేహాలకు పంచనామా చేయడం, పోస్టు మార్టం నిర్వహించడం, వారి బంధువులకు అప్పగించడం వంటి ఫార్మాలిటీస్ అన్నికూడా పోలీసులు చట్టపరిధిలో చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ఎన్ కౌంటర్ మృతదేహాలను బాహ్య ప్రపంచలోకి తీసుకవస్తున్నారు. 

You cannot copy content of this page