దిల్ సుఖ్ నగర్ పేలుడు కేసు… శిక్ష అనుభవిస్తున్న టెర్రరిస్ట్ మృతి

దిశ దశ, హైదరాబాద్:

ఇండియన్ ముజాహిద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉండడంతో పాటు… 2013లో హైదరాబాద్ నగరంలోని దిల్ సుఖ్ నగర్ వద్ద బాంబు పేలుళ్లలో ప్రధాన పాత్ర పోషించిన ఉగ్రవాది చర్లపల్లి జైలులో అనారోగ్యంతో చనిపోయాడు. 44 ఏళ్ల వయసున్న సయ్యద్ మక్బుల్ అలియాస్ జుబేర్ గురువారం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దిల్ సుఖ్ నగర్ బాంబు పేల్చివేత ఘటనలో 18 మంది మృత్యువాత పడడంతో పాటు 130 మంది గాయాలపాలయ్యారు. మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన జుబేర్ అహ్మద్ పాకిస్తాన్ లో ఉన్న రియాజ్ భత్కల్, భారత్ లో ఉన్న ఉగ్ర సంస్థలు, ఇండియన్ ముజాహిద్ సంస్థతో సంబంధాలు పెట్టుకున్నాడు. హైదరాబాద్ నగరాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడేందుకు పథకం వేసుకున్నాడని ఎన్ఐఏ ఆరోపించింది. జుబేర్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసి ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టులో హాజరు పర్చగా 2023లో జీవిత ఖైదు విధించింది. గత నవంబర్ లో దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో తెలంగాణ పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. 2006, 2007 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా జరిగిన పేలుళ్లలో ఆయన ప్రమేయం ఉన్నట్టుగా తేల్చారు. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లా, హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లలో జరిగిన హత్య కేసుల్లో కూడా దోషిగా నిర్దారించారు.

అనారోగ్యంతో… 

కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న జుబేర్ కు మూడు నెలల క్రితం నిమ్స్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ చేశారని అధికారులు తెలిపారు. ఆ తరువాత కిడ్నీ సంబంధిత వ్యాధితో పడుతున్నాడని కూడా వివరించారు. ఆయన ఆరోగ్యం కోసం 12 సార్లు నిమ్స్, గాంధీ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించినట్టుగా జైళ్ల శాఖ అధికారులు వెల్లడించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం గాంధీ ఆసుపత్రికి తరలించి వెంటిలెటర్ ద్వారా చికిత్స అందించారు. గురువారం తెల్లవారు జామున జుబేర్ చికిత్స పొందుతూ మరణించినట్టుగా వివరించారు. చర్లపల్లి జైలు అధికారులు జుబేర్ కస్టడీలో మరణించినట్టుగా కేసు నమోదు చేశారు. 

You cannot copy content of this page