థార్ లో లభ్యమైన డైనోసార్ శిలాజం
దిశ దశ, న్యూ ఢిల్లీ:
లక్షల సంవత్సరాల నాటి జీవకోటి ఆనవాళ్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాకాసి బల్లుల సంతతి భారతదేశంలో కూడా ఉండేదని తేలుతోంది. డైనో సార్, రైనో సార్ అనగానే ఇండియాకు సంబంధించిన ప్రాణులు కావన్న భావనలో చాలా మంది ఉంటుంటారు. కానీ వాస్తవంగా మన దేశంలో కూడా అలాంటి జీవులు ఉండేవని మరోసారి రుజువైంది. ఇప్పటికే నీటి ఎనుగు(స్టెగోడాన్) సంతతికి సంబంధించిన ఆనవాళ్లు తెలంగాణాలోని రామగుండం ఓసీపీలో వెలుగులోకి వచ్చాయి. 1980వ దశాబ్దంలో భూపాలపల్లి జిల్లా కాటారం అటవీ ప్రాంతంలో రైనోసార్ శిలాజం ఒకటి లభ్యం కాగా, మంచిర్యాల జిల్లా వేమన్ పల్లి ప్రాణహిత పరివాహక ప్రాంతంలో డైనోసార్ అవశేషాలు లభ్యం అయ్యాయి. అలాగే మహారాష్ట్రలోని సిరొంచలోని గోదావరి పరివాహక గ్రామం లక్ష్మీపూర్ లో కూడా డైనోసార్ శిలాజాలు లభ్యం అయ్యాయి. ఇప్పటికీ గోదావరి పరివాహక ప్రాంతంలోని చిటూరు అటవీ ప్రాంతంలో పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు నదులు, అడవులు, గుట్టల్లో మాత్రమే రాకాసి బల్లుల సంతతికి సంబంధించిన ఆనవాళ్లు వెలుగులోకి రాగా తాజాగా రాజస్థాన్ లోని థార్ ఎడారిలోనూ డైనోసార్ శిలాజం బయటపడడం గమనార్హం. రూర్కి ఐఐటీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాల నుండి పరిశోధనలు చేసేందుకు థార్ ఎడారిలోని జైసల్మేర్ ప్రాంతంలో రిసెర్చ్ చేస్తుండగా అవశేషాలు లభ్యం అయ్యాయి. ఈ క్రమంలో ఓ డైనోసార్ శిలాజాన్ని పరిశోధకులు గుర్తించగా దీనికి డైక్రియోసారిడ్ అని నామకరణం చేశారు. పొట్టి మెడ ఉండి మొక్కలను మాత్రమే తినే శాఖాహార సంతతికి చెందినదని అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఇప్పటి వరకు మూడు రకాల డైనోసార్ శిలాజాలను పరిశోధకులు గుర్తించారు.