ఇథనాల్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు

సరికొత్త చర్చకు దారి తీసిన అంశం

దిశ దశ, కరీంనగర్:

ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో సరికొత్త చర్చకు తెరలేపారు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు. వెల్గుటూరు మండలం పాశిగామ, స్తంభంపల్లి గ్రామాల సమీపంలో నిర్మిస్తున్న ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని జరపొద్దంటు స్థానికులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. స్థానికుల డిమాండ్ కు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇథనాల్ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. అయితే తాజాగా మరో కాంగ్రెస్ నేత ఇచ్చిన బిగ్ ట్విస్ట్ కాంగ్రెస్ నేతల వైఖరి తీరుపై సరికొత్త చర్చకు దారి తీస్తోంది.

సీఎల్పీ నేత నుండి…

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు ఇథనాల్ ఇండస్ట్రీ వల్ల స్థానికులకు తీరని నష్టం వాటిల్లనుందని నిర్మాణం జరపొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. భట్టీ పాదయాత్రలో భాగంగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పడు ఇండస్ట్రీ నిర్మాణం విషయంలో జోక్యం చేసుకోవాలని బాధిత గ్రామాల ప్రజలు అభ్యర్థించారు. ఇథనాల్ ఇండస్ట్రీకి తాము పూర్తిగా వ్యతిరేకమని అసెంబ్లీలో కూడా ఈ విషయంపై చర్చిస్తానని భట్టీ వారికి హామీ ఇచ్చారు. జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి కూడా పలుమార్లు ఇండస్ట్రీ నిర్మాణం జరపతలపెట్టిన ప్రాంతానికి వెల్లి నిరసనలు చేపట్టారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఇథనాల్ ఇండస్ట్రీ వల్ల తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా తమకు అనుకూలంగా పోరాటం చేస్తోందని ఆయా గ్రామాల ప్రజలు భావించారు. తమ ఆందోళనలకు సంఘీభావం తెలుపుతుండడంతో కాంగ్రెస్ పార్టీపై అపార నమ్మకం పెట్టుకున్నారు అక్కడి జనం.

పొన్నం అభిప్రాయం ఇలా…

అయితే శుక్రవారం ఇథనాల పరిశ్రమ నిర్మించే ప్రాంత వాసులకు అవగాహన కల్పించేందుకు జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాష ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి క్రిభ్ కో డైరక్టర్ హోదాలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా హాజరయ్యారు. ఇథనాల్ పరిశ్రమ వల్ల ఎలాంటి నష్టం ఉండదని అడ్డుకోకూడదన్న రీతిలో సూచించారు. దీనివల్ల ఈ ప్రాంత అభివృద్ది జరుగుతుందని కూడా వ్యాఖ్యానించారు. ఆయనతో పాటు జిల్లా అధికారులు టెక్నికల్ ఆఫీసర్లు, కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ కొండూరు రవిందర్ రావులు కూడా బాధిత గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించినప్పటి వారు మాత్రం ఇథనాల్ ఇండస్ట్రీ నిర్మాణానికి ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. అయితే అనంతరం ఆయా గ్రామాల ప్రజలు మాత్రం కాంగ్రెస్ నాయకుల తీరుపై చర్చించుకున్నారు. తమ జిల్లా నాయకులు ఇథనాల్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుండడంతో పాటు సీఎల్పీ నేత భట్టి కూడా తమకు అనుకూలంగా ప్రకటనలు ఇచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ పొన్నం అనుకూలంగా మాట్లాడుతున్నారేంటన్న విషయంపై బాధిత గ్రామాల్లో చర్చలు సాగాయి. కాంగ్రెస్ నాయకుల్లో ఈ ఫ్యాక్టరీ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.

ఆ ఇద్దరి కౌంటర్…

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో తమ వ్యతిరేకతను ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇథనాల్ ఇండస్ట్రీకి తాము వ్యతిరేకమేనని, మాజీ ఎంపీ పొన్నం తన సొంత అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. ఆయన అలా మాట్లాడిల్సింది కాదని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బాధిత గ్రామాల ప్రజలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి పరిశ్రమను కూడా సందర్శించారని అక్కడి గ్రామాల ప్రజల ఇబ్బందులు గమనించిన తరువాత పూర్తిగా విముఖత వ్యక్తం చేస్తున్నారన్నారు. అలాగే జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై స్పందించారు. అవగాహన సదస్సుకు సైంటిస్టులనో, ఆ ప్రాజెక్టుపై అవగాహన ఉన్న రిటైర్డ్ అధికారులతోనే సమావేశాలు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. కెడిసీసీ బ్యాంక్ ఛైర్మన్, క్రిభ్ కో డైరక్టర్ పొన్నం ప్రభాకర్ లచే అవగాహన కల్పించడం ఏంటని ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన పొన్నం ప్రభాకర్ ను తీసుకరావడాన్ని ఖండిస్తున్నాని, ఆయన క్రిభ్ కో డైరక్టర్ హోదాలో వచ్చారు తప్ప ఆయన అభిప్రాయనికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తేల్చి చెప్పారు.

అయోమయం…

కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులే ఇథనాల్ ఇండస్ట్రీ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడం ఓ ఎత్తైతే… తాజగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు పొన్నం ప్రభాకర్ వ్యక్తిగత అభిప్రామం తప్ప పార్టీ అభిప్రాయం కాదని చెప్పడం గమనార్హం.

You cannot copy content of this page