‘గడ్డం’ ఫ్యామిలీపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఫైర్
దిశ దశ, మంచిర్యాల:
కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతగా వెలుగొందిన ఆయన వారసులు వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఏఐసీసీ ముఖ్య నేతల నుండి క్షేత్ర స్థాయి శ్రేణుల వరకు ఆయనకంటే ఓ ప్రాధాన్యత ఉండేది. కానీ ఆయన వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన వారసుల తీరుపై అసమ్మతి రాజుకుంటున్న తీరు అన్ని పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారింది. తాజాగా మంచిర్యాలలో జరిగిన సభలో స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
కాకా అంటే…
పెద్దపల్లి ఎంపీగా, సీడబ్లూసీ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించిన జి వెంకటస్వామి దేశ రాజకీయాల్లోనే తనదైన ముద్ర వేసుకున్నారు. ఏఐసీసీ చీఫ్ పదవికి తానే అర్హుడిని అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. కార్మిక నేతగా ఎదిగిన వెంకటస్వామిని కాకా అని పిలుచుకునే సాంప్రాదాయం కొనసాగేది. ఆయన కేంద్రీకృతంగానే ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలు నెరిపే పరిస్థితి ఉండేది. జాతీయ స్థాయి నాయకులతో పాటు రాష్ట్ర నేతలు కూడా వెంకటస్వామి ప్రాపకం కోసం పాకులాడిన సందర్బాలు చోటు చేసుకున్నాయి. కానీ ఆయన వారసత్వం పుణికి పుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన వారసుల తీరుపై వ్యతిరేకత వ్యక్తం అవుతుండడమే చర్చనీయాంశంగా మారింది. ఆయన వారసుల్లో వినోద్, వివేక్ లు ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తుండగా, వివేక్ తనయుడు వంశీ కృష్ణ పెద్దపల్లి ఎంపీగా కొనసాగుతున్నారు.
అన్ని పార్టీల్లోనూ…
తాజాగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఏ పార్టీలో కొనసాగినా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారన్న వాదనలు ఆయా పార్టీల నాయకుల్లో వ్యక్తం అవుతోంది. మొదట కాంగ్రెస్ పార్టీ తరుపున పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిథ్యం వహించినప్పుడు పార్టీ నాయకులకు వివేక్ కు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. ఆ తరువాత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నా గెలవలేకపోయారు. 2009లో తొలిసారి గెలిచిన ఆయన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన ఆయనపై టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ గెలిచారు. ఆ తరువాత 2019 ఎన్నికల వరకూ ఉద్యమ పార్టీలో చేరినా స్థానిక నాయకులంతా కలిసి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఏడు సెగ్మెంట్లకు చెందిన టీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు వివేక్ కు టికెట్ దక్కకుండా పావులు కదిపి వెంకటేష్ నేతను తెరపైకి తీసుకొచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చెన్నూరు నుండి పోటీ చేసిన వెంకటేష్ నేతకు టికెట్ ఇప్పించేందుకు టీఆర్ఎస్ నాయకులు సాహసించారు కానీ వివేక్ కు టికెట్ ఇవ్వడానికి మాత్రం ఒప్పుకోలేదు. దీంతో తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన అడుగులు వేస్తున్నారన్న విషయం గమనించిన కాంగ్రెస్ నాయకులు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఏ చంద్ర శేఖర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వివేక్ కు లేకుండా పోయింది. అనంతరం బీజేపీలో చేరిన ఆయన అదే పార్టీలో కొనసాగకుండా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. బీజేపీలోనూ పార్టీ నాయకులు కొంతమందితో పొడసూపలేదన్న ప్రచారం జరిగినప్పటికీ బహిర్గతం మాత్రం కాలేదు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు వివేక్ కు చెన్నూరు టికెట్, ఆయన సోదరుడు గడ్డం వినోద్ కు బెల్లంపల్లి టికెట్ ఖరారు చేసింది. 2024 లోకసభ ఎన్నికల్లో తన తనయుడు వంశీ కృష్ణకు టికెట్ ఇప్పించి గెలిపించుకోవడంలో సక్సెస్ అయిన వివేక్ మంత్రి పదవి సాధించుకునే విషయంలో మల్లగుల్లాలు పడాల్సి వస్తోంది. అదిష్టానం పెద్దలతో పాటు రాష్ట్ర నాయకులు కూడా వివేక్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మంత్రివర్గ విస్తరణ అంశం పక్కనపెట్టాల్సి వచ్చింది.
కొక్కిరాల ఫైర్…
తాజాగా సోమవారం మంచిర్యాలలో నిర్వహించిన సభలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఆ కుటుంబానికి ఇప్పటికే మూడు పదవులు దక్కాయని, మంత్రి వర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిదే సహించేది లేదని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో మంచిర్యాల, చెన్నూరు ఎమ్మెల్యేల మధ్య విబేధాలు నెలకొన్నాయి. బహిరంగ సభలోనే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గడ్డం ఫ్యామిలీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తూ ఊరుకునేది లేదని మంచిర్యాల ఎమ్మెల్యే వ్యాఖ్యానించిన తీరుతో సభలో ఒక్కసారిగా నినాదాలు మిన్నంటిపోయాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులు హాజరైన సమావేశంలోనే ప్రేమ్ సాగర్ రావు తన అభిప్రాయాన్ని కుండబద్లలు కొట్టిన తీరు కాంగ్రెస్ పార్టీలో సరికొత్త చర్చకు దారి తీసింది. ఇప్పుడు కూడా వివేక్ కు కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తీరుతో అటు ఆయన అనుచరుల్లో ఇటు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యల గురించి ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి