దాస్యం కుటుంబంలో విభేదాలు… బాబాయ్ వర్సెస్ అబ్బాయ్…

బీఆర్ఎస్ పార్టీని వీడుతానన్న సంకేతాలు

ప్రణయ్ అన్న ఆత్మీయ సమ్మేళనంలో సంచలన వ్యాఖ్యలు

దిశ దశ, వరంగల్:

రెండున్నర దశాబ్దాలుగా బాబాయ్ అడుగు జాడల్లోనే నడిచిన అబ్బాయ్ అనూహ్యంగా నిర్ణయం మార్చుకున్నారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న బాబాయ్ కి అనుగుణంగా వ్యవహరించిన అబ్బాయ్ ఇప్పుడు తన పంథా మార్చుకుంటున్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. వరంగల్ జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. వరంగల్ బీఆర్ఎస్ పార్టీ నుండి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తుండగా ఒకే ఫ్యామిలీ నుండి వ్యతిరేకత రావడమే సంచలనంగా మారింది.

ఆత్మీయ సమ్మేళనంలో…

హన్మకొండలోని రెడ్డి కాలనీలో సోమవారం ప్రణయ్ అన్న ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు ఆయన తనయుడు, కార్పోరేటర్ అభినవ్ భాస్కర్. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇంతకాలం గుంభనంగా వ్యవహరించిన దాస్యం కుటుంబంలో పొరపొచ్చాలు బయటకు పొక్కడం రాజకీయ వర్గాల్లోనూ సంచలనంగా మారగా… బీఆర్ఎస్ పార్టీలోనూ కలకలంగా మారిందని చెప్పవచ్చు. ఎన్నికలకు ముందు అసహనం వ్యక్తం అయిందన్న ప్రచారం జరిగినా అదంతా పుకారేనన్న రీతిలో దాస్యం ఫ్యామిలీ ప్రచారంలో పాల్గొంది. అనూహ్యంగా సోమవారం అభినవ్ భాస్కర్ ఆత్మీయ సమ్మేళనంలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. బాబాయ్ వినయ్ భాస్కర్ ను ఉద్దేశించి అభినవ్ చేసిన ఘాటుగా వ్యాఖ్యానించడం గమనార్హం. వినయ్ భాస్కర్ కోసం చాలా త్యాగాలు చేశామని, అయినా మా బాబాయ్ వద్ద సరైన గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 1998లో తండ్రి ప్రణయ్ భాస్కర్ మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో తన తల్లిని పోటీ చేయాలన్న ప్రతిపాదన వచ్చినా తన మరిది వినయ్ భాస్కర్ కోసం తన తల్లి త్యాగం చేసిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పరకాల నుండి పోటీ చేయాలని తనను కోరినా తమ కుంటుంబంలో కలమాలు వస్తాయని భావించి బాబాయ్ కోసం పనిచేశామన్నారు. ఆయన చుట్టూ ఉండే నలుగురు వ్యక్తులు చెప్తున్న మాటలు నమ్మి తనపై కూడా నిందలు వేశారని అభినవ్ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నలుగురు చెప్పిన మాటలు నమ్మి వినయ్ భాస్కర్ ఓటమికి కారణం తానేనని అనడం బాధించిందన్నారు. కర్ణుడి చావుకు వంద కారణాలు ఉన్నా తననే టార్గెట్ చేసి మాట్లాడిన తీరుతో కలత చెందానన్నారు. ఆత్మగౌరవం లేని చోట తాను ఉండలేనని త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు.

అభినవ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి

You cannot copy content of this page