దిశ దశ, కరీంనగర్:
చివరి వరకూ బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఆశాభంగం ఎదురైంది. రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుస్తారని ఆశించిన ఆయన మూడో స్థానంలో ఉన్న ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ తరువాత కూడా గట్టి పోటీ ఇచ్చిన వి నరేందర్ రెడ్డి ఓటమి చెందారు. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల ఫలితాల్లో చివరకు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలిచినట్టుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ప్రతికూల ఫలితం రావడంతో వి నరేందర్ రెడ్డి ఒకింత షాకుకు గురయ్యారు. కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వస్తూ కన్నీటి పర్యంతం అయిన వి నరేందర్ రెడ్డిని ఆయన సన్నిహితులు ఓదార్చే ప్రయత్నం చేశారు.
అదే స్థానం…
ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు వి నరేందర్ రెడ్డి పేరు తెరపైకి రాగానే ఆయనపై వ్యతిరేకత వెలుగులోకి వచ్చింది. విద్యా సంస్థలను నిర్వహించే క్రమంలో ఆయన వ్యవహార శైలిని ఎత్తి చూపుతూ విమర్శలు వచ్చాయి. దీంతో అటు వ్యతిరేకతను సానుకూలంగా మల్చుకుంటూ ఇటు పార్టీ నేతలతో సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో ముందుకు సాగారు. ఒక దశలో ఆయన సొంత జిల్లా కరీంనగర్ లో అసలు ఓట్లే రావన్న స్థాయిలో ప్రచారం జరిగినా ఆయన టఫ్ పైట్ ఇచ్చారు. అయితే తొలి రౌండ్ నుండి కూడా వి నరేందర్ రెడ్డి రెండో స్థానంతో పోటీ పడుతున్నప్పటికీ మూడు రౌండ్లలో నామ మాత్రపు ఆధిపత్యాన్ని సాధించారు. కానీ తనకన్నా ముందు ఉన్న అంజిరెడ్డి ఓట్లను అధిగమించలేకపోయారు. ఏ ఒక్క రౌండ్ లో అయినా ఆయనకు తొలి ప్రాధాన్యత ఓట్లు భారీగా వచ్చినట్టయితే ఈ ఫలితాలు తారుమారు అయ్యేవి. కానీ ఆయన అంచనాలకు తగ్గట్టుగా ఓట్లు రాబట్టుకోలేదన్న వేదన మాత్రం నరేందర్ రెడ్డిని వెంటాడుతున్నట్టుగా ఉంది. ఈ కారణంగానే మానసిక వేదనకు గురయ్యారు వి నరేందర్ రెడ్డి. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ మాత్రం అనూహ్య ఫలితాలను చవి చూసింది.