అలా దిగారు… ఇలా రిటర్న్ అయ్యారు…

అమెరికాలో తెలంగాణ విద్యార్థులకు చుక్కెదురు…

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా అలా చేరుేకున్నారో లేదో… అక్కడి అధికారులు వెంటనే తిప్పి పంపించారు. వరంగల్ కన్సల్టెన్సీ ద్వారా ఉన్నత చదువులు చదువుకునేందుకు చికాగో సమీపంలోని ఓ యూనివర్శిటీలో చేరేందుకు ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణాలోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు 42 మంది విద్యార్థులు రెండు రోజుల క్రితం ఎన్నో ఆశలతో అంతర్జాతీయ ప్రయాణానికి బయలుదేరారు. అట్లాంటాలో దిగిన తరువాత అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులను విద్యార్థుల పాస్ పోర్టులు, వీసాలు, ఇతర డాక్యూమెంట్లు పరిశీలించిన తరువాత వారందరిని ఎయిర్ పోర్టులోని ఓ గదిలోకి పంపించారు. తిరుగు ప్రయాణాం కోసం టికెట్లు బుక్ చేసుకోవాలని అట్లాంటా ఎయిర్ పోర్టు అధికారులు చెప్పడంతో తెలంగాణ స్టూడెంట్స్ అంతా షాకుకు గురయ్యారు. అసలు తామేం తప్పు చేశాం… ఉన్నత చదువులు చదువుకునేందుకు కోటి ఆశలతో ఇక్కడకు చేరుకుంటే తమను ఎందుకు రిటర్న్ పంపుతున్నారని అడిగినా అధికారులు మాత్రం తిరిగి వెనక్కి వెళ్లిపోవల్సిందేనని తేల్చేశారు. దీంతో విద్యార్థులంతా కూడా తమ పేరెంట్స్ కు సమాచారం ఇవ్వడం… వారు టికెట్ల కోసం డబ్బులు పంపించడంతో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో ఉన్న ఖాలీలను బట్టి స్టూడెంట్స్ ను ఇండియాకు తిప్పి పంపిస్తున్నారు. కొద్ది సేపటి క్రితం కొంతమంది విద్యార్థులు ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగి అక్కడి నుండి హైదరాబాద్ కు బయలు దేరారు. అసలేం జరిగింది అన్న విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులు చెప్తున్నారు. కన్సల్టెన్సీ ఏజెన్సీ విద్యార్థులను పంపించే విషయంలో తప్పు చేసిందా… డాక్యూమెంట్స్ పరంగా లోపాలు ఉన్నాయా అన్న వివరాలు తెలియడం లేదు. ఎడ్యూకేషన్ కోసం వీసా అప్లై చేస్తే అమెరికా ఎంబసీ అధికారులు స్టాంపింగ్ కూడా చేసిన తరువాతే వీరు అమెరికా పయనం అయ్యారు. విమానం ఎక్కేముందు ఇండియాలో ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీలు పూర్తయిన తరువాతే బయలుదేరినప్పటికీ అట్లాంటా ఎయిర్ పోర్టులో అర్థాంతరంగా ఆపేసి వెనక్కి పంపించడం సంచలనంగా మారింది. అయితే పూర్తి వివరాలు మాత్రం విద్యార్థులు తెలియజేస్తే తప్ప బయటకు వచ్చే అవకాశం లేదు.

You cannot copy content of this page