అవిశ్వాసం అక్కడ… రాజీనామా ఇక్కడ…

భూపాలపల్లి మునిసిపల్ పాలి‘ట్రిక్స్’

దిశ దశ, భూపాపల్లి:

జిల్లా కేంద్రమైన భూపాలపల్లి మునిసిపల్ లో రాజుకున్న అసమ్మతి కాస్తా అవిశ్వాసం నోటీసు వరకు చేరింది. అయితే కౌన్సిలర్ల ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ లు తమ పదవులకు రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. అసంతృప్తుల శిబిరాన్ని అయోమయంలో పడేసే విధంగా స్కెచ్ వేసినట్టుగా స్పష్టమవుతున్నప్పటికీ రాజీనామాలు సమర్పించడం వెనక ఉన్న అసలు కోణాలపై చర్చలు సాగుతున్నాయి.

రాజీనామా అనంతరం కలెక్టరేట్ ముందు అసమ్మతి కౌన్సిలర్లు

మద్యాహ్నం కౌన్సిలర్లు…

భూపాలపల్లి మునిసిపల్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ లపై అవిశ్వాసం ప్రకటించిన కౌన్సిలర్లు అందరూ కూడా కలెక్టరేట్ కార్యాలయంలో ఈ మేరకు లేఖ అందించారు. 30 కౌన్సిలర్లలో 20 మంది కౌన్సిలర్లు తమకు ఇద్దరు ప్రజా ప్రతినిధులపై విశ్వాసం లేదని, వార్డుల్లో అభివృద్ది ఊసే లేకుండా పోయిందని ఆరోపించారు. అంతేకాకుండా ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ ల ఒంటెత్తు పోకడలు, ప్రోటోకాల్ వ్యవహారంలో వివక్ష చూపుతున్నారంటూ మండిపడ్డారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొన్నందును తామంతా కూడా అవిశ్వాసం లేఖ ఇస్తున్నందున సమావేశం ఏర్పాటు చేసే విశ్వాస పరీక్ష ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడుతూ తమ బాధలను వివరించారు. తమకు జరిగిన అన్యాయం తీరనిదని మునిసిపాలిటీలో జరుగుతున్న తీరును తమను తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తోందన్నారు.

సాయంత్రం రాజీనామా…

కౌన్సిలర్ల అంచనాలు తలకిందులు చేస్తూ మునిసిపల్ ఛైర్ పర్సన్ సెగ్గెం వెంకటరాణి, వైస్ ఛైర్మన్లు కొత్త హరిబాబులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఊహించని విధంగా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి కార్యాలయంలో తమ రాజీనామా పత్రాలను అందించారు. దీంతో భూపాలపల్లి మునిసిపల్ రాజకీయం రసకందాయకంలో పడిందనే చెప్పాలి. అయితే ఛైర్ పర్సన్ వెంకటరాణి, వైస్ ఛైర్మన్ హరిబాబులు మాత్రం తన రాజీనామా పత్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కెటాయింపుల పారదర్శకంగా వ్యవహరిస్తే కొంతమంది తమవారికి ఇవ్వాలని అడిగితే ఇవ్వనందుకు తనపై అభియోగాలు మోపారని ఆరోపించారు. ఈ అభియోగాలను ఖండిస్తూ పార్టీకి, ఎమ్మెల్యేకు ఎలాంటి నష్టం కలగకూడదనే రాజీనామా చేస్తున్నామని లేఖలో వివరించారు.

ఎమ్మెల్యే కార్యాలయంలో రాజీనామా పత్రాన్ని సమర్పిస్తున్న ఛైర్ పర్సన్ వెంకటరాణి

అక్కడిస్తే సరిపోతుందా..?

మునిసిపల్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ లు ఎమ్మెల్యే కార్యాలయంలో రాజీనామా చేయడమే కాకుండా తమ రాజీనామా పత్రాల్లో కూడా ఎమ్మెల్యేకు అడ్రస్ చేశారు. దీంతో వీరిద్దరి రాజీనామాను ఆమోదించే అదికారం ఎమ్మెల్యేకు లేదన్నది వాస్తవం కాగా వీరు రాజీనామా ఫార్మాట్ ను కూడా పాటించలేదన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. రిజైన్ లెటర్ ను కలెక్టర్ కు ఇవ్వాలి కానీ ఎమ్మెల్యేకు ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటోనన్నదే ప్రత్యర్థి వర్గంలో అంతుచిక్కకుండా పోయింది. జగిత్యాల మునిసిపల్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాణం కోసం సమావేశాలు పెట్టిన క్రమంలో ఛైర్ పర్సన్ బోగ శ్రావణి తన రాజీనామా లేఖను కలెక్టర్ కు ఫార్మట్ లో పంపించారు. ఆ తరువాత కలెక్టర్ రాజీనామా గురించి కలెక్టర్ మాట్టాడిన తరువాతే ఆమోదించారు. కానీ భూపాలపల్లి ఛైర్ పర్సన్, ఛైర్మన్ లు ఇద్దరూ కూడా తమ రాజీనామా పత్రాలను ఎమ్మెల్యేకు ఇవ్వడం గమనార్హం. మునిసిపల్ లో నెలకొన్న ముసలానికి బ్రేకులు వేయాలంటే అధిష్టానం ఎంట్రీ ఇవ్వల్సిందేనన్న ఉద్దేశ్యంతో రిజైన్ లెటర్స్ ఎమ్మెల్యేకు ఇచ్చారా లేక అసమ్మతీయులను డైలామాలో పడేసేందుకు ఇచ్చారా అన్న చర్చ సాగుతోంది. దీంతో భూపాలపల్లి మునిసిపల్ పాలి‘ట్రిక్స్’ గమ్మత్తుగా సాగుతున్నాయన్నది వాస్తవం.

You cannot copy content of this page