డిసిప్లేనరీ పేరిట చర్యలు సబబేనా..? స్పెషల్ పోలీసుల సస్పెన్షన్

దిశ దశ, హైదరాబాద్:

వారంతా అధికారుల ఆదేశాలు ధిక్కరించలేదు… క్రమశిక్షణ ఉల్లంఘించలేదు… స్పెషల్ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న తమ భర్తల పట్ల కనికరం చూపాలని అభ్యర్థించారు. డిపార్ట్ మెంటల్ స్టోర్స్ లో నెల నెల కొనుగోలు చేయడంలో సీలింగ్ విధించారు. నెలకు రూ. 5 వేలకు మించి షాపింగ్ చేయరాదన్న కొత్త నిబంధన విధించారు. తమ భర్తలచే డ్యూటీలు చేయించాల్సిన అధికారులు ఆర్డర్లీ పేరిట అదనపు పనులు చేయిస్తున్నారు, ఆహారం సరిగా ఉండడం లేదు, గతంలో ఉన్న నిబంధనలు సవరించి సెలవులు విధానాన్నే మార్చేశారు. దీంతో కుటుంబాలకు దూరం అవుతున్న తమ భర్తల విషయంలో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానం ఉండాలని అభ్యర్థించారు. అయితే ఇదంతా వారి వారి కుటుంబ బంధాలపై చూపుతున్న ప్రభావాన్ని సాక్షాత్కరిస్తోంది. కానీ బెటాలియన్స్ అధికారులు మాత్రం భార్యలు చేసిన ఆందోళనకు బాధ్యులుగా పేర్కొంటు పోలీసు యంత్రాంగంపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సాహసించడం విస్మయానికి గురి చేస్తోంది. నిత్యం విధి నిర్వహణలో తలమునకలవుతున్న పోలీసులు కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు అవసరమైన విధంగా మార్చిన నిబంధనలు సవరించడం తప్పయిందా అంటున్నాయి ఆయా పోలీసు కుటుంబాలు. రెండు రోజుల క్రితం నల్గొండ జిల్లాలోని స్పెషల్ పోలీస్ బెటాలియన్ వద్ద ఆందోళన జరగగా, మంగళవారం వరంగల్ సమీపంలోని మామ్నూరు వద్ద, బుధవారం ములుగు జిల్లా చల్వాయి వద్ద కూడా పోలీసు కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టాయి. స్పెషల్ పోలీస్ వింగ్ లో పనిచేస్తున్న పోలీసు యంత్రాంగానికి చెందిన ఫ్యామిలీ మెంబర్స్ ఏ స్థాయిలో మానసిక వేధనకు గురవుతున్నాయో వరసగా జరుగుతున్న ఆందోళనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవల్సిన పోలీసు ఉన్నతాధికారులు ఆందోళనలో పాల్గొన్న కుటుంబాలను గుర్తించి ఆయా కుటుంబాలకు చెందిన పోలీసులపై వేటు వేయడం విస్మయపరుస్తోంది.

డిసిప్లేన్ ఎక్కడ తప్పింది..?

రోడ్డెక్కిన స్పెషల్ పోలీసు బెటాలియన్ సిబ్బంది కుటుంబాల ఆందోళన నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు సంబంధిత విభాగం అధికారులు. అయితే ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఆవేదనతో చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరిస్తున్న తీరు మాత్రం విచిత్రంగా మారింది. గాయం ఓ చోట అయితే మందు మరో చోట రాసినట్టుగా బెటాలియన్ అధికారులు వ్యవరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. శాఖాపరంగా అంతర్గతంగా జరుగుతున్న అంశాలు వెలుగులోకి వచ్చాయన్న కారణంతో చర్యలకు పూనుకున్న అధికారులు పోలీసుల కుటుంబాలు రోడ్డెక్కే పరిస్థితికి అసలు కారణమేంటన్న విషయాన్ని విస్మరిస్తుండడం గమనార్హం. ప్రతి నెల పోలీసులకు ఇస్తున్న సెలవుల విషయమే కాకుండా చాలా అంశాల్లోనూ పోలీసులు బెటాలియన్ క్యాంపుల్లో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఆందోళనలతో వెలుగులోకి వచ్చింది. మెస్ లలో ఇస్తున్న ఆహారం తీరు, ఆర్డర్లీ వ్యవస్థ, గడ్డి పీకించడం వంటి అసంబద్దమైన పనులకు పురమాయిస్తున్న అంశాలపై కూడా పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. దీనివల్ల 24 గంటల పాటూ అప్రమత్తంగా ఉంటున్న పోలీసు యంత్రాంగానికి ఓ నమ్మకాన్ని కల్పించినట్టు అవుతుంది. నిజంగానే క్యాంపుల్లో జరుగుతున్న వ్యవహారాలు తప్పని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటే బావుంటుంది. కానీ శాఖాపరంగా విచారణ చేయకుండా ఆందోళన చేపట్టారన్న కారణంతో డిసిప్లేనరీ యాక్షన్ తీసుకోవడం మాత్రం రాష్ట్ర పోలీసు వ్యవస్థ వైపే వేలెత్తి చూపాల్సిన పరిస్థితి వస్తోంది. సమన్యాయం కావాలని డిమాండ్ చేసిన పోలీసుల భార్యలతో చర్చలు జరిపినా కొంతమేర సమస్య పరిష్కారం దొరికేది కానీ ఇలాంటి చొరవ తీసుకోకుండానే బెటాలియన్స్ అధికారులు చర్యలు తీసుకుంటుండడం మాత్రం అందరినీ ఆశ్యర్యపరుస్తోంది.

నాడు అలా…

తెలంగాణ జిల్లాల్లో నక్సల్స్ కార్యకలాపాలు తీవ్రంగా ఉన్నప్పుడు ప్రభావిత స్టేషన్లలో విధులు నిర్వర్తించే పరిస్థితి కూడా ఉండకపోయేది. కొత్తగా వచ్చిన పోలీసులకు ఆయా ప్రాంతాలకు బదిలీ చేసేవారు. రహదారులు కూడా సరిగా లేని ఆ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, ఇతర అధికారుల విషయంలో జిల్లా స్థాయి అధికారులు కొంతమేర ఉదాసీనంగా ఉండేవారు. నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న పోలీసు యంత్రాంగం వారి వారి కుటుంబ సభ్యులను కలిసేందుకు అవసరమైన విధంగా ఓ కార్యాచరణ తయారు చేశారు. ఇందుకు సంబంధించిన లిఖిత పూర్వక ఆదేశాలు లేనప్పటికీ ఆయా జిల్లాల పోలీసు బాసులు మానవతా ధృక్ఫథంతో వ్యవహరించాలన్న మౌఖిక ఆదేశాలతో వీటిని అమలు చేశారు. తెలంగాణ స్పెషల్ పోలీసుల విషయంలోనూ అలాంటి హ్యుమానిటీ చూపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా స్పెషల్ పోలీసులపై తీసుకుంటున్న చర్యలపై పోలీసు ఉన్నతాధికారులు కూడా పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

You cannot copy content of this page