దిశ దశ, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీసు విభాగంలో సస్పెన్షన్ల పర్వానికి తెరపడి… సర్వీసు నుండి తొలగించే ప్రక్రియ మొదలైంది. కొద్ది రోజులుగా రాష్ట్రంలోని వివిధ బెటాలియన్లలో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదట టీఎస్ఎస్పీ పోలీసుల కుటుంబాలు ఆయా బెటాలియన్న ముందు రొడ్డెక్కి ఆందోళనలు చేశాయి. ఇందుకు బాద్యులను చేస్తూ ఆయా కుటుంబాలకు చెందిన పోలీసులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. ఆ తరువాత వారి సమస్యలపై దృష్టి సారిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఆందోళన సద్దుమణిగిందని భావించారంతా. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆందోళన చేస్తున్న క్రమంలో ఓ ఎస్ఐ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బెటాలియన్లలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు ఆందోళనకు దిగారు. ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ అన్న నినాదాలతో పాటు ఎస్సైఐ కాంమెట్లపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పలు బెటాలియన్లలో కూడా ఈ నిరసనల పర్వం కొనసాగింది. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లోని బెటాలియన్లకు సీనియర్ పోలీసు అధికారులను పంపించిన ప్రభుత్వం పీడ్ బ్యాక్ తీసుకుంది. బెటాలియన్లలో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందుకుల సంబంధించిన నివేదికలను కూడా పరిశీలించింది. అనూహ్యంగా బెటాలియన్లలో పని చేస్తున్న పోలీసులను సర్వీసు నుండి తొలగిస్తూ ఉత్తర్వులు విడుదల చేయడం సంచలనంగా మారింది.
వీరిపై వేటు…
రాష్ట్రంలోని వివిధ బెటాలియన్లలో పని చేస్తున్న పోలీసు సిబ్బందిని సర్వీస్ నుండి రిమూవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరి ఆందోళన వల్ల ప్రభుత్వ ఉద్యోగులపై వ్యతిరేక ప్రభావం పడే విధంగా ఉందని, ప్రవర్తనా నియమావళికి విరుద్దంగా ఉన్నందున ఉద్యోగాల నుండి తొలగిస్తున్నామని కూడా అందులో పేర్కొన్నారు. యూనిఫాం బలగాలల్లో క్రమ శిక్షణా రాహిత్యం అనేది అత్యంత తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవల్సి ఉంటుందని కూడా ఆ లేఖలో స్పష్టం చేశారు. తెలంగాణలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాల్సిన టీజీఎస్పీ బలగాల ఆందోళనలు క్రమ శిక్షణకు విఘాతం కల్గించాయని వెల్లడించారు. సర్వీసు నుండి తొలగించిన వారిలో ఇబ్రహీంపట్నం బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ రవి కుమార్, భద్రాచలం కొత్తగూడెంకు చెందిన కె భూషణ్ రావు, అన్నేపర్తి బెటాలియన్ లో పనిచేస్తున్న వి రామకృష్ణ, ఎస్ కె షఫీ, సిరిసిల్ల బెటాలియన్ కు చెందిన ఏఆర్ ఎస్ఐ టీ సాయిరాం, పీసీలు కె లక్ష్మీనారాయణ, ఎస్ కరుణాకర్ రెడ్డి, టి వంశీ, బందెల అశోక్, ఆర్ శ్రీనివాస్ లను సర్వీస్ నుండి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
వ్యూహం ఉందా..?
బెటాలియన్లలో పని చేస్తున్న సిబ్బంది, వారి కుటుంబాలు అనూహ్యంగా ఆందోళనలకు దిగడంపై స్పెషల్ ఆపరేషన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకే సారి బెటాలియన్లలో పనిచేస్తున్న సిబ్బంది క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించే సాహసం చేయడం వెనక ఉన్న కారణాలు ఏమిటన్న విషయంపై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. సాధారణంగా పోలీసు యంత్రాంగం రోడ్డు ఎక్కి విషయంలో మీనామేషాలు లెక్కిస్తంది కానీ టీజీఎస్పీ పోలీసులు ఎందుకు ఇలా రోడ్డుపైకి వచ్చారు అన్న కోణంలో తెలుసుకునే పనిలో నిమగ్నం అయింది. దీని వెనక కుట్ర కోణం ఏమైనా దాగి ఉందన్న అంశం గురించి వివరాలు సేకరిస్తే మొదట్లో కానిస్టేబుళ్ల భార్యలు తమ కుటుంబాల్లో ఎదురవుతున్న సమస్యను వెలుగులోకి తెచ్చేందుకే ఆందోళనలు చేశారన్న నివేదికలు అందినట్టు సమాచారం. అయితే ‘‘ఏక్ పోలీస్ ఏక్ పోలీస్’’ అన్న నినాదం ఇవ్వడం వెనక ఆంత్యం ఏమైనా దాగి ఉందా అన్న కోణంలో కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నినాదాన్ని ఇచ్చిన విషయాన్ని పోలీసు సిబ్బంది అంది పుచ్చుకుని నిరసనలు చేసే అవకాశం ఉంటుందా అన్న విషయంపై చర్చ జరిగినట్టు సమాచారం. వ్యతిరేక శక్తులు కావాలనే టీజీఎస్పీ పోలీసులను రోడ్లపైకి వచ్చే విధంగా ప్రొత్సహించారా అన్న కోణంలోనూ నిఘా వర్గాలు తెలుసుకున్నాయి. అయితే ఈ ఆందోళన విషయంలో కాన్ఫిడెన్షియల్ సమాచారం అందుకున్న ప్రభుత్వం ఉద్యోగాల నుండి తొలగించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా టీజీఎస్పీ సిబ్బందిపై వేటు వేయడం మాత్రం రాష్ట్ర పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.