మొదట రిపేర్ చేయాలని తీర్మానం…
ఆ తరువాత మరమ్మత్తు చేయనందుకు వాకౌట్…
దిశ దశ, కరీంనగర్:
మెజార్టీ సభ్యులు తల్చుకుంటే ఏదైనా జరుగుతుంది. ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం లేకుండా వ్యవహరించాలనుకుంటే మెజార్టీ ఈజ్ లా అన్నట్టుగా మారిపోయిందక్కడ. వేసవి కాలం రాబోతున్న నేపథ్యంలో తాగునీటీ సమస్యపై చర్చించడం కంటే సభను వాయిదా వేయడానికే మొగ్గు చూపినట్టుగా స్పష్టం అవుతోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ సభ్యులు తీసుకున్న నిర్ణయంతో మీటింగ్ అర్థాంతరంగా ముగిసినప్పటికీ ప్రజా సమస్యల గురించి చర్చించడం ఎలా అన్నదే అర్థం కాకుండా పోయిందన్న ప్రశ్న తలెత్తుతోంది. కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహించారు. 29 విభాగాలకు సంబంధించిన అంశాలను సుదీర్ఘంగా చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశం కేవలం 45 నిమిషాల్లోనే అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది.
మొదట అలా…
సమావేశానికి హాజరైన సభ్యులు మొదట మేడిగడ్డ ప్రాజెక్టును తిరిగి బాగు చేయాలని, పునర్నిమానం చేయాలని కోరుతూ తీర్మానం చేయాలని పట్టుబట్టారు. ఇందుకు సమ్మతించిన సమావేశం కూడా మేడిగడ్డను బాగు చేయాలని కోరుతూ తీర్మానం చేసింది. ఈ తరువాత కొన్ని శాఖలకు సంబంధించిన చర్చలు జరిగుతున్న నేపథ్యంలో మెజార్టీ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీని రిపేరు చేయనందుకు నిరసనగా తామంతా కూడా సభ నుండి వాకౌట్ చేస్తున్నామంటూ బయటకు వెల్లిపోయారు. దీంతో సాయంత్రం వరకు జరగాల్సిన ఈ సమావేశం అర్థాంతరంగా 45 నిమిషాల్లోనే ముగించాల్సి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే జడ్పీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే మెజార్టీ ఉండడంతో సమావేశం కొనసాగించే పరిస్థితి లేకుండా పోయింది అధికార యంత్రాంగానికి.
కారణమదేనా..?
అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన సభ్యులు వ్యూహాత్మకంగా వ్యవహరించి వాకౌట్ చేశారన్న చర్చ కూడా సాగుతోంది. లోకసభ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ నుండే శంఖారావం పూరించాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 12న కరీంనగర్ లో సభ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నందున బీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ సభ్యులు కావాలనే సభ నుండి వాకౌట్ చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ సమావేశాన్ని దృష్టిలో పెట్టుకునే బీఆర్ఎస్ సభ్యులు ప్రజా సమస్యలు చర్చించకుండా వాకౌట్ చేశారని జడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గీకురు రవిందర్ విమర్శించారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకవెల్లి వాటిని పరిష్కరించుకునేందుకు చొరవ చూపాల్సిందిపోయి సభ నుండి వాకౌట్ చేయడం ఎంత వరకు సబబో ఆలోచించాలన్నారు. వచ్చే వేసవి కాలంలో తాగు నీటి సమస్య పరిష్కారం గురించి చర్చించకుండా జిల్లాతో సంబంధం లేని మేడిగడ్డ అంశాన్ని లేవనెత్తారన్నారు. అయితే మేడిగడ్డను రిపేరు చేయాలన్న తీర్మాణం చేసిన కొద్దిసేపటి తరువాత తిరిగి అదే అంశంపై వాకౌట్ చేయడం వెనక ఆంతర్యం ఏంటని గీకురు రవిందర్ ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలు… అధికారులు…
ఇకపోతే కరీంనగర్ జడ్పీ సమావేశానికి ఛైర్ పర్సన్, సీఈఓ మాత్రమే హాజరు కాగా జిల్లా కలెక్టర్ హాజరు కాలేదు. అంతేకాకుండా చట్ట సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా అటెండ్ కాకపోవడం గమనార్హం. ఎంపీ బండి సంజయ్ పాదయాత్రలో చేస్తుండగా ఎమ్మెల్యేలు మాత్రం సమావేశానికి రాకపోవడం కూడా చర్చకు దారి తీసింది. జడ్పీ సభ్యులు లేవనెత్తే అంశాలను పట్టించుకునేందుకు చట్టసభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారు కూడా హాజరు కాకపోవడం విడ్డూరం. క్షేత్ర స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వేదికగా ఉన్న జడ్పీ సమావేశానికి ముఖ్యమైన అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం సరైన విధానం కాదని జమ్మికుంట జడ్పీటీసీ శ్యామ్ అన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన అంశాలను చర్చించడంతో పాటు ఇతరాత్ర సమస్యలను సభ దృష్టికి తీసుకవచ్చే అవకాశమే లేకుండా పోయిందని శ్యామ్ వ్యాఖ్యనించారు. అధికారులు, చట్టసభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారు కూడా జడ్పీ మీటింగ్ విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు.