మీరు సీ ‘‘నీయర్స్’’ కాదిక… శ్రీధర్ బాబు స్పష్టం…

మంథని కాంగ్రెస్ నేతల్లో ఆందోళన…

దిశ దశ, మంథని:

మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంత్రి శ్రీధర్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గానికి చెందిన కొంతమంది సీనియర్ నాయకుల విషయంలో తన వైఖరి ఏంటో కుండబద్దలు కొట్టేశారు. ఇటీవల మాజీ సర్పంచ్ సత్యనారాయణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడే ముందు రికార్డు చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో ఆయన కొంతమంది పేర్లను ఊటంకించడంతో శ్రీధర్ బాబు మనస్తాపానికి గురైనట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి స్పష్టం అవుతోంది. సమీకరణాల విషయంలో అయినా, బాధ్యతలు కట్టబెట్టే విషయంలో అయినా తన తండ్రి హయాం నుండి అనుబంధం పెంచుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం శ్రీధర్ బాబు వ్యక్తం చేస్తున్న అభిప్రాయలు ఏంటీ అన్న విషయంపై ఆయన మాటల్లో స్ఫష్టం అయింది. చాలా అంశాల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చిన వారి పేర్లు కూడా సత్యనారయణ ప్రస్తావించడంతో సదరు నాయకులు తనపై ఎంతటి వ్యతిరేకతతో ఉన్నారోనన్న విషయాన్ని గమనించినట్టుగా అర్థం అవుతోంది. సత్యనారాయణ ఆత్మహత్యాయత్నం తరువాత తొలిసారి మంథని పర్యటనకు వచ్చిన శ్రీధర్ బాబు వేదిక పైనా, వ్యక్తిగతంగా తనను కలిసిన వారిపై తనకు ఎలాంటి అభిప్రాయం ఉందోనన్న విషయాన్ని తేటతెల్లం చేసేశారు. చాలా అంశాల్లో అండగా నిలిచినప్పటికీ కావాలనే తనను సమాజం దృష్టిలో దోషిలా నిలబెట్టేలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం శ్రీధర్ బాబు వ్యాఖ్యల్లో వ్యక్తం అవుతోంది. తన తండ్రి దుద్దిళ్ల శ్రీపాద రావు రాజకీయాలు నెరిపినప్పుడు ఆయనను చాలా సందర్భాల్లో నొప్పించిన వారిని కూడా అప్పటి నుండి తమ కుటుంబంతో అనుబంధం పెట్టుకున్నారన్న కారణంతో అన్నివిధాలుగా ప్రోత్సహిస్తే కూడా వెనక మాత్రం తనను నిందిస్తున్న తీరును పసిగట్టిన మంత్రి ఇటువంటి వారికి తానెందుకు ప్రాధాన్యత ఇవ్వాలి..? తానే డైరక్ట్ ప్రజలతో అనుబంధం పెంచుకుంటే అన్ని విధాలుగా మంచిదే కదా అని అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. రాష్ట్ర పరిస్థితులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై ఉంచిన బాధ్యతలు. ఏఐసీసీ ముఖ్య నేతలతో సమీకరణాలు చేయడం వంటి అత్యంత కీలకమైన బాధ్యతలు తన భుజాలాపై ఉన్నందున తన తమ్ముడు శ్రీను బాబును నియోజకవర్గ నాయకులకు అందుబాటులో ఉండేవిధంగా ప్రణాళికలు చేస్తే కూడా ఈ స్థాయిలో తనపై వ్యతిరేకత మూటగట్టుకోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటీ..? అన్నదే మంత్రి మదిని వెంటాడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఏ పని చేసినా వెన్నుదన్నుగా ఉంటామన్న భరోసా కల్పించేందుకు క్షేత్ర స్థాయిలో తమ్ముడు, తాను పర్యటనలు చేస్తున్నా కూడా అన్ని విధాలుగా లాభం పొందిన వారు దుష్ప్రచారం చేస్తున్నారెందుకోనన్న అంతర్మథనానికి శ్రీధర్ బాబు గురవుతున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఓ వైపున జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలను చక్కబెడుతూ తన వద్దకు వచ్చిన నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులకు ప్రయారిటీ ఇస్తున్నా ప్రజల్లో తనపై చులకన భావం కల్పించే విధంగా కామెంట్లు ఎందుకు చేస్తున్నారు..? ఈ పరిస్థితి ఒక్క సత్యానారాయణ వీడియోలో ప్రస్తావించిన పేర్లున్న వారితోనే పరిమితం అయిందా లేక… ఆ జాబితాలో చాలా మంది ఉన్నారా అన్న సంశయం మంత్రి శ్రీధర్ బాబులో వచ్చినట్టుగా తెలుస్తోంది. విశ్వసనీయతకే విశ్వసనీయులు అనుకున్న వారి పేర్లు కూడా ఆ వీడియో ఊటంకించడంతో ఒక దశలో శ్రీధర్ బాబు కూడా ఇలాంటి సమాజం ఉంటుందా..? అని తర్జనభర్జన పడినట్టుగా స్పష్టం అవుతోంది.

హైదరాబాద్ ఎందుకు..?

ఇప్పటికే చాలా సందర్బాల్లో కూడా పని ఉన్నట్టయితే హైదరాబాద్ వరకూ రాకండి వృధా ఖర్చులు చేసుకోకండి… చిన్న చిన్న పనులకు కూడా ఇంత దూరం వచ్చి డబ్బులు ఖర్చు చేసుకోకండి అని పదే పదే చెప్తున్నా కూడా మంథనికి చెందిన కొంతమంది చీమ చిటుక్కుమన్నా పుటుక్కుమంటూ హైదరాబాద్ లో ప్రత్యక్ష్యం అవుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ శ్రీధర్ బాబు కోసం హైదరాబాద్ చుట్టూ ప్రదర్శనలు చేస్తుండడం సరికాదని కూడా ఆయన చాలాసార్లు స్పష్టం చేశారు. అయితే కొంతమంది మాత్రం మాత్రం చిన్న పనికి కూడా హైదరాబాద్ కు వస్తూ… పని ఉన్న వారితో ఖర్చులు పెట్టిస్తున్న తీరును గమనించే హైదరాబాద్ రావద్దని చెప్తున్నారని తెలుస్తోంది. తనతో అవసరం ఉన్న వారితో వృధా ఖర్చులు పెట్టిస్తున్న తీరుతో ప్రజల్లో దురభిప్రాయం ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించే మా సేవలు మీకు అందుబాటులో ఉంటాయి… కానీ మీరు పట్నం వరకూ వచ్చి పరేషాన్ కావదన్ని శ్రీధర్ బాబు చెప్తున్నారన్న విషయాన్ని క్యాడర్ గుర్తించకపోవడం కూడా అడపాదడపా ఆయనలో అసహనానికి కారణం అవుతోంది.

అవకాశం కోసమే…

అయితే మంథని కాంగ్రెస్ పార్టీలో కూడా మరో వాదనలు వినిపిస్తున్నాయన్న విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు గుర్తించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు లేకపోలేదు. 1999 నుండి మంథనిలో రాజకీయాలు నెరుపుతున్న శ్రీధర్ బాబు పార్టీతో… ‘‘దుద్దిళ్ల’’ కుటుంబంతో లైన్ దాటకుండా ఉన్న వారిని కాకుండా తన దృష్టిలో పడ్డ వారికి మాత్రమే ప్రయారిటీ ఇస్తున్న తీరులో మార్పు రావల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారూ లేకపోలేదు. శ్రీధర్ బాబు ‘గుడ్ లుక్స్’లో పడిన తరువాత తామేం చేసినా చెల్లుతుందన్న రీతిలో వ్యవహరించిన నాయకులను మంత్రి అక్కున చేర్చుకుంటున్న తీరుపై క్రాస్ చెక్ చేసుకోవల్సిన అవసరం ఉందని అంటున్నారు కొందరు. విలాసాగర్ మాజీ సర్పంచ్ ఆత్మహత్యయత్నానికి ముందు వీడియో ద్వారా వెల్లడించిన పేర్లున్నవారికి మంథని పర్యటన సందర్బంగా శ్రీధర్ బాబు గట్టి షాక్ ఇవ్వడంతో ఖంగు తిన్నారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు. అయితే శ్రీధర్ బాబు, శ్రీను బాబు కనుసన్నల్లో విశ్వసనీయతను ప్రదర్శిస్తూ ఇతర పార్టీల ముఖ్య నాయకులతో టచ్ లో ఉంటున్న వారిని కూడా గుర్తించి పక్కన పెట్టినట్టయితే వారికి తిరుగే ఉండదని కూడా అంటున్నారు కొందరు. శ్రీధర్ బాబుతో మంచిగా ఉంటున్నట్టుగా నటిస్తూ ఆర్థికంగా, పదవుల పరంగా జాక్ పాట్ కొడ్తున్న వారితోనే సరిపెట్టుకోకుండా ఇతరులకు కూడా ప్రాధాన్యత ఇస్తే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన తండ్రి మనసును తల్లడిల్లేలా వ్యవహరించిన వారిలో కొంతమంది శ్రీధర్ బాబు కనుసన్నల్లో ఉంటున్నారన్న ఆవేదన వ్యక్తం చేస్తున్న వారూ లేకపోలేదు. ముఖస్తుతి లేకుండా మాట్లాడే వారు మంచివాళ్లు కాదన్న భావనతో కాకుండా వెనక నుండి గోతులు తీస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాల్సిన ఆవశ్యకత ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర పార్టీల నేతలను మేనేజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులమని నటిస్తున్న వారిని కూడా గుర్తించినట్టయితే శ్రీధర్ బాబు ట్రాక్ రికార్డు టాప్ లెవల్లో ఉంటుందని అంటున్నారు. వాస్తవిక కోణాలను ఆవిష్కరించుకున్నట్టయితే అన్ని విధాలుగా మంచి జరుగుతుందని చెప్తున్నారు కొందరు. తాజా ఎన్నికల్లో గెల్చిన తరువాత కాటారం సభలో ‘‘కట్టప్ప’’ల గురించి శ్రీధర్ బాబు ప్రస్తావించడంతో అసలు సిసలు కాంగ్రెస్ నాయకులు, దుద్దిళ్ల కుటుంబ విశ్వసనీయుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. కానీ ఆ తరువాత షరా మామూలే అన్నట్టుగా మారడంతో వారంతా మిన్నకుండి పోయారు. ఏది ఏమైనా మంథని రాజకీయాల్లో సంచలనంగా మారిన శ్రీధర్ బాబు వ్యవహారించిన తీరు మాత్రం కొంతమంది కాంగ్రెస్ నాయకులను డిఫెన్స్ లోకి నెట్టేసినట్టయింది.

You cannot copy content of this page