దిశ దశ, హైదరాబాద్:
సిఫార్సు లేఖల పుణ్యమా అని ఇంతకాలం లూప్ లైన్లలో ఉన్న వారు అక్కడే మగ్గిపోగా… లా అండ్ ఆర్డర్ లో ఉన్న వారు తమ ఆదిపత్యాన్ని చూపించారన్నది పోలీసు విభాగంలో ఓపెన్ టాక్. స‘‘ర్కారు’’ పెద్దల ఆశీస్సులు ఉన్నట్టయితే ఏం చేసినా నడుస్తుందన్న ధీమాతో వ్యవహరించారు కొంతమంది పోలీసు అధికారులు. గులాభి పార్టీ ప్రభుత్వం పతనానికి కారణమైన వాటిల్లో ఈ విధానమూ ఒకటన్నది నిజం. అయితే ‘మార్పు’ అనే నినాదంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా పోలీసు విభాగంలో బదిలీల ప్రక్రియలో సాగుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త సీసాలో పాత సార అన్నట్టుగానే సాగుతోందా… అన్న చర్చ పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది.
టాప్ టు బాటమ్…
పోలీసు విభాగంలో జరుతున్న బదిలీల ప్రక్రియలో క్షేత్ర స్థాయి నుండి ఉన్నతాధికారి వరకు కూడా ఇదే విధానం సాగుతోందన్న చర్చ మొదలైంది. బదిలీల విషయంలో పారదర్శకమైన విధానం ఇప్పుడైన అమలవుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. ‘పలుకు బడి’ విషయంలో వెనకబడ్డ పోలీసు అధికారులు అప్పుడు లూప్ లైన్ విభాగాలకే పరిమితం కావల్సి వచ్చింది. వాస్తవంగా పదోన్నతులు వచ్చినప్పుడు ఖచ్చితంగా లూప్ లైన్ విభాగంలో పనిచేయాలన్న నిభందనలు ఉన్నప్పటికీ అప్పటి అధికారం కొందరి పోలీసు అధికారులకు వరప్రదాయినిగా మారడంతో పెత్తనం చెలాయించే వారు లా అండ్ ఆర్డర్ పోస్టింగులకే అతుక్కుపోయారన్నది బహిరంగ రహస్యం. దీంతో బలహీనులుగా మారిపోయిన పోలీసు అధికారులు తెరవెనకే డ్యూటీలు చేసుకుంటూ మరుగునపడిపోయారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తీరుతో అప్పుడు అన్యాయానికి గురైన వారిలో మనోవేదన మరింత ఎక్కువైపోయింది. అప్పటి ప్రభుత్వంలో లాభ పడ్డవారిలో కొందరు నేటికీ అదే దర్పం ప్రదర్శిస్తుండడం విస్మయానికి గురి చేస్తోంది. కొత్త సర్కారు ఏర్పాటుతోనైనా పదేళ్ళుగా లూప్ లైన్ విభాగాల్లో మగ్గిపోతున్న వారికి మోక్షం కల్గుతుందనుకుంటే అలాంటి చర్యలే కానరావడం లేదన్న వేదన వ్యక్తం అవుతోంది.
ప్రాంతాలు మారుస్తూ…
అప్పుడు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించి ప్రతిపక్ష పార్టీ క్యాడర్ ను ముప్పు తిప్పలు పెట్టిన వారికి కూడా నేడు ప్రయారిటీ దక్కుతున్న తీరు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వరంగల్ కమిషనరేట్ లో ఓ ఇన్స్ పెక్టర్ స్థాయి అధికారికి ఇదే విధమైన పోస్టింగ్ రావడం అందరినీ ఆశ్యర్యపర్చింది. జిల్లాలు మారగానే అప్పటి తప్పిదాలన్ని మరుగునపడిపోతాయన్నట్టుగా తయారైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోస్టింగ్ ఇచ్చిన తరువాత సదరు పోలీసు అధికారుల గురించి తెలుసుకుని తప్పులో కాలేశామని బాధపడడం కంటే బదిలీల ప్రక్రియకు ముందే అన్ని వివరాలు సేకరిస్తే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతన్నాయి. అంతేకాకుండా ఎన్నికలకు ముందు వరకు కూడా అప్పటి సర్కారు పెద్దలకు అనుకూలంగా చట్టాలను చుట్టాలుగా మార్చేసిన కొంతమంది అధికారులకు ఇప్పుడు పోస్టింగులు వస్తుండడం కూడా విచిత్రంగా మారిందని అంటున్న వారూ లేకపోలేదు. తమకు అనుకూలమైన పోస్టింగుల కోసం కొంతమంది అధికారులు ఆదిపత్యం చెలాయించిన ఫలితంగా కొద్ది రోజుల పాటు తెరమరుగైన అధికారులకు కూడా అన్యాయం జరిగినట్టుగా ప్రభుత్వ పెద్దలు ఫీలవుతున్న తీరు సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సమర్థవంతమైన విధులు నిర్వర్తించే సత్తా ఉన్న ఇంతకాలం అణిచివేతకు గురైన అధికారులకు ఈ ప్రభుత్వంలోనూ గుర్తింపు రావడం లేదన్న ఆవేదన కనిపిస్తోంది.
పైరవీలు లేవంటూనే…
అయితే గత ప్రభుత్వ మాదిరిగా పైరవీలకు అవకాశం ఇవ్వడం లేదన్న ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. అధికారుల పనితీరును ప్రామాణికంగా తీసుకోవడం, అప్పుడు అన్యాయానికి గురైన సమర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి సాంప్రాదాయానికి మళ్లీ జీవం పోస్తారని ఈ ప్రచారంతో భావించింది యావత్ పోలీసు శాఖ. బదిలీలకు సంబంధించిన ఆర్డర్లు బయటకు వచ్చిన తరువాత జాబితాను గమనించిన చాలామంది పోలీసు అధికారులు నిరాశ నిసృహలకు గురవుతున్నారు. ఇంఛార్జి మంత్రులు చెప్తే పోస్టింగులు వస్తున్నాయని, ఓరల్ గా పోలీసు అధికారులకు పేర్లు చెప్పిన వారికి పోస్టింగులు ఇస్తున్నారన్న ప్రచారం కూడా తీవ్రంగా జరుగుతోంది. దీంతో ప్రభుత్వం తీరుపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయని చెప్పకతప్పదు. అప్పడు శాంతి భద్రతల విభాగాన్ని శాసించిన వారి వల్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడిందని, ఇందుకు ప్రధానమైన కారణాలు ఏంటో కూడా ప్రభుత్వం దృష్టిలో ఉందన్నది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి వారికే అందలం ఎక్కిస్తుండడం వల్ల ఈ ప్రభుత్వంపై కూడా మరక పడే ప్రమాదం లేకపోలేదన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్న సూచనలు వస్తున్నాయి.